ముగ్గురు మృతి
వంద మందికిపైగా ఆస్పత్రిపాలు
ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో ఘటన
ఇండోర్(ఎంపీ): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరథ్‌పురాలో నల్లా కనెక్షన్ ద్వారా ఇళ్లకు సరఫరా అయిన కలుషిత నీటిని తాగిన ఉదంతంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. డిసెంబర్ 25వ తేదీన ఈ ప్రాంతంలో సరఫరా అయిన మున్సిపల్ నీరు కలుషితం కావడంతో డయేరియా సోకి పెద్ద సంఖ్యలో జనం అస్వస్థులయ్యారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యవిభాగ సిబ్బంది 2,703 నివాసాల్లోని దాదాపు 12,000 మంది స్థానికులకు వైద్య పరీక్షలు చేశారని చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసానీ చెప్పారు.
మధ్యస్థాయి రోగ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న 1,146 మందికి వెంటనే చికిత్సనందించారు. 111 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారని, ఆరోగ్యం మెరుగుపడటంతో 18 మంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. బాధితులందరికీ ప్రభు త్వ ఖర్చులతో వైద్యసాయం అందిస్తామని ఇండోర్ మేయర్ పుష్యామిత్ర భార్గవ హామీ ఇచ్చారు. నర్మదా నదీజలాలను శుద్ధి చేసి నల్లా కనెక్షన్ ద్వారా ఈ ప్రాంతానికి మంచినీటిని సరఫరాచేస్తున్నామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, శాంపిళ్లను సేకరించారని ఆయన చెప్పారు. ఇండోర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని ఖర్గోన్ జిల్లాలోని జలూద్ నుంచి పైప్‌లైన్ ద్వారా నర్మదా నదీజలాలను నగరానికి సరఫరాచేస్తున్నారు.


