అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
ఐదుగురు ఎమ్మెల్యేలకు జిల్లా కాంగ్రెస్ పగ్గాలు.. 5 జిల్లాల అధ్యక్ష స్థానాలు మహిళలకు
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి
సామాజిక సమతుల్యంతో ఎంపిక.. బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 27 పదవులు
పెండింగ్‌లో రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు జిల్లా పార్టీ సారథులను నియమించింది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లాలు, కార్పొరేషన్లకు డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులను నియమిస్తూ శనివారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలకు డీసీసీ పగ్గాలిచ్చారు. వీరిలో మేడిపల్లి సత్యం, బీర్ల అయిలయ్య, చిక్కుడు వంశీకృష్ణ, ఎంఎస్.రాజ్‌ఠాకూర్, వెడ్మ బొజ్జు ఉన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేనారెడ్డికి కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. మరో ఐదుగురు మహిళా నాయకురాళ్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమతుల్యతను పాటించింది.
మొత్తం 36 పదవులను ప్రకటించగా, అందులో 27 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనాకాంగ్రెస్ లకు కేటాయించింది. ఓసీలకు తొమ్మిదింటిని కేటాయించింది. ఆయా సామాజికవర్గాల వారీగా చూస్తే..బీసీలకు 14, ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, మైనార్టీలకు 2 డీసీసీ పదవులు దక్కాయి.



