అందెశ్రీకి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అందెశ్రీ భార్య, మహేశ్‌గౌడ్, అడ్లూరి లక్ష్మణ్, విమలక్క, వీహెచ్, అనిల్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్
అందెశ్రీ కోహినూర్ వజ్రం అని చెప్పొచ్చు: సీఎం రేవంత్
వీరు ఎంతోమందిని తెలంగాణ ఉద్యమబాట పట్టించారు
జనజీవన స్థితిని ఆవిష్కరించే కవులు, కళాకారులు రాష్ట్రంలో మాత్రమే ఉన్నారు
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వారి గొంతు వినిపించకుండా చేశారు
పెన్నులపై మన్ను కప్పే ప్రయత్నం చేస్తే.. ఆ పెన్నులే గన్నులై మొలిచాయి
అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని చైతన్య పర్చడంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గూడ అంజయ్య, గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్ లాంటి వాళ్లంతా రాష్ట్రానికి రత్నాల్లాంటివాళ్లన్నారు. అందెశ్రీ కోహినూర్ వజ్రం అని చెప్పొచ్చన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతోమందిని ఉద్యమబాట పట్టించి తెలంగాణ జాతిని జాగృతం చేశారని సీఎం కొనియాడారు. అవసరమైతే ఇప్పుడు రాష్ట్రంలోని కవులంతా ప్రజా సమస్యలే ఇతివృత్తంగా గొంతెత్తుతారని చెప్పారు.
కవులు రాసే పాటలు, పద్యాల్లో, కళాకారుల కళలో జనజీవన స్థితి ఆవిష్కృతమవుతుందని, అంతటి మహా కవులు తెలంగాణలో మాత్రమే ఉన్నారన్నారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కవులు, కళాకారుల గొంతు వినిపించకుండా కుట్ర జరిగిందని సీఎం విమర్శించారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అందెశ్రీ సంతాప సభకు ఆయన హాజరయ్యారు. అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం మాట్లాడారు.
ప్రతి పాఠ్య పుస్తకం తొలిపేజీలో ‘జయ జయహే తెలంగాణ’
‘రాష్ట్రంలో పదేళ్ల పాటు కవులు, కళాకారుల గొంతు అణచివేశారు. ఉద్యమ సమయంలో వారి కృషికి ఏమాత్రం ప్రచారం జరగకుండా కుట్ర చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ భవిష్యత్తరాలకు కవులు, కళాకారుల రచనలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పదేళ్ల పాటు ఏలిన దొరలు అధికారం శాశ్వతమనే భావనలో ఇలాంటి కుట్ర చేశారు. కానీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. చూడడానికి అమాయకంగా కనిపించినప్పటికీ అవసరమైనప్పుడు పోరాట పటిమను అద్భుతంగా ప్రదర్శిస్తుంది. పదేళ్లపాటు దొరల ప్రభుత్వం పెన్నులపై మన్ను కప్పే ప్రయత్నం చేస్తే.. ఆ పెన్నులే గన్నులై మొలిచాయి. దొరల గడీలను పగలగొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
వర్గీకరణతో వైరం సమసిపోయింది
‘షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ప్రక్రియను న్యాయ సమస్యలు లేకుండా చట్టబద్ధంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు పూర్తి చేశాం. వర్గీకరణతో ఎన్నో ఏళ్లుగా దళిత కులాల మధ్య ఉన్న వైరం సమసిపోయింది. ఇప్పటివరకు ఉన్నత చదువులకు అర్హత సాధించని కులాలు కూడా వర్గీకరణ ప్రక్రియతో సీట్లు దక్కించుకున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన కులాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ప్రజాప్రభుత్వం కృషి ఫలితంగా ఈ విజయం సాధ్య మయ్యింది..’అని రేవంత్ చెప్పారు. కాగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు పాటలతో అందెశ్రీకి నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అందెశ్రీ పేరిట స్మృతి వనం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘జయ జయహే తెలంగాణ’గీతానికి రాష్ట్ర గీతంగా గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి పాఠ్య పుస్తకం మొదటి పేజీలోనే అది ప్రచురితమవుతుంది. దీంతో భవిష్యత్తరాలకు ఆ పాట విలువ తెలుస్తుంది. గద్దర్, అందెశ్రీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అందెశ్రీ పేరిట ఒక స్మృతి వనాన్ని నిర్మిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చాం. భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి అందమైన ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మంత్రి రాజనర్సింహకు అప్పగిస్తున్నా. వారి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయాన్ని కూడా అందించాం.’అని సీఎం వివరించారు.


