breaking news
Andesri
-
మన కవులు రత్నాలు
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని చైతన్య పర్చడంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గూడ అంజయ్య, గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్ లాంటి వాళ్లంతా రాష్ట్రానికి రత్నాల్లాంటివాళ్లన్నారు. అందెశ్రీ కోహినూర్ వజ్రం అని చెప్పొచ్చన్నారు. వీరంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతోమందిని ఉద్యమబాట పట్టించి తెలంగాణ జాతిని జాగృతం చేశారని సీఎం కొనియాడారు. అవసరమైతే ఇప్పుడు రాష్ట్రంలోని కవులంతా ప్రజా సమస్యలే ఇతివృత్తంగా గొంతెత్తుతారని చెప్పారు.కవులు రాసే పాటలు, పద్యాల్లో, కళాకారుల కళలో జనజీవన స్థితి ఆవిష్కృతమవుతుందని, అంతటి మహా కవులు తెలంగాణలో మాత్రమే ఉన్నారన్నారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కవులు, కళాకారుల గొంతు వినిపించకుండా కుట్ర జరిగిందని సీఎం విమర్శించారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అందెశ్రీ సంతాప సభకు ఆయన హాజరయ్యారు. అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం మాట్లాడారు. ప్రతి పాఠ్య పుస్తకం తొలిపేజీలో ‘జయ జయహే తెలంగాణ’ ‘రాష్ట్రంలో పదేళ్ల పాటు కవులు, కళాకారుల గొంతు అణచివేశారు. ఉద్యమ సమయంలో వారి కృషికి ఏమాత్రం ప్రచారం జరగకుండా కుట్ర చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ భవిష్యత్తరాలకు కవులు, కళాకారుల రచనలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పదేళ్ల పాటు ఏలిన దొరలు అధికారం శాశ్వతమనే భావనలో ఇలాంటి కుట్ర చేశారు. కానీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. చూడడానికి అమాయకంగా కనిపించినప్పటికీ అవసరమైనప్పుడు పోరాట పటిమను అద్భుతంగా ప్రదర్శిస్తుంది. పదేళ్లపాటు దొరల ప్రభుత్వం పెన్నులపై మన్ను కప్పే ప్రయత్నం చేస్తే.. ఆ పెన్నులే గన్నులై మొలిచాయి. దొరల గడీలను పగలగొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వర్గీకరణతో వైరం సమసిపోయింది ‘షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ప్రక్రియను న్యాయ సమస్యలు లేకుండా చట్టబద్ధంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు పూర్తి చేశాం. వర్గీకరణతో ఎన్నో ఏళ్లుగా దళిత కులాల మధ్య ఉన్న వైరం సమసిపోయింది. ఇప్పటివరకు ఉన్నత చదువులకు అర్హత సాధించని కులాలు కూడా వర్గీకరణ ప్రక్రియతో సీట్లు దక్కించుకున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన కులాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ప్రజాప్రభుత్వం కృషి ఫలితంగా ఈ విజయం సాధ్య మయ్యింది..’అని రేవంత్ చెప్పారు. కాగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కవులు, కళాకారులు పాటలతో అందెశ్రీకి నివాళులు అరి్పంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందెశ్రీ పేరిట స్మృతి వనం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘జయ జయహే తెలంగాణ’గీతానికి రాష్ట్ర గీతంగా గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి పాఠ్య పుస్తకం మొదటి పేజీలోనే అది ప్రచురితమవుతుంది. దీంతో భవిష్యత్తరాలకు ఆ పాట విలువ తెలుస్తుంది. గద్దర్, అందెశ్రీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అందెశ్రీ పేరిట ఒక స్మృతి వనాన్ని నిర్మిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చాం. భారత్ ఫ్యూచర్ సిటీలో వారికి అందమైన ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మంత్రి రాజనర్సింహకు అప్పగిస్తున్నా. వారి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయాన్ని కూడా అందించాం.’అని సీఎం వివరించారు. -
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు. -
అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో పోలీస్ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు జరిగాయి. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయన అందెశ్రీ పాడెను మోశారు. అంత్యక్రియలు అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని రేవంత్ కోరారు. ‘‘తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర ఉండాలని కోరా. గద్దర్ అన్నతో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపింది..అందుకే ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం. ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తాం. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన పాటల సంకలనం “నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుంది. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో ఆ పుస్తకాన్ని అందుబాటులో ఉంచుతాం’’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
అందెశ్రీ పాడె మోసి.. అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(అందె ఎల్లయ్య) అంత్యక్రియలు ముగిశాయి. ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్లో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలి వచ్చారు. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులు, మేధావులు, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ హాజరయ్యారు. అందెశ్రీ పార్థీవ దేహానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఓదార్చారు. అందెశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోయ్యారు. ఆపై అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు. అందెశ్రీ(64) సోమవారం ఉదయం ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణ..తో పాటు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని రగల్చిన అనేక పాటలను రాశారాయన. సాహితీ లోకానికి గర్వకారణమైన అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.నిన్నటి నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు అందెశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ ఉదయం సీనియర్ నేత కే కేశవరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సీనియర్ నేత వీహెచ్‌లు నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా.. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. దారిపొడవునా అభిమానులు పూలు జల్లి అందెశ్రీకి నివాళులు సమర్పించారు. -
అందెశ్రీ ఇక లేరు
సాక్షి, హైదరాబాద్/లాలాపేట/మద్దూరు (హుస్నాబాద్): తెలంగాణ సాహితీ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రజా, ప్రకృతి కవి, గాయకుడు అందెశ్రీ (64) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లాలాపేటలోని తన ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీని కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి వచ్చేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు వల్ల చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన అందెశ్రీకి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం ఉదయం ఘట్కేసర్ మండలంలోని ఎన్ఎఫ్సీ ప్రాంతంలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎంతో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఘట్కేసర్ బైపాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సమీపంలోని హెచ్ఎండీఏకు చెందిన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. అందెశ్రీ మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదితర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రముఖుల శ్రద్ధాంజలి అందెశ్రీ భౌతిక కాయాన్ని గాంధీ ఆస్పత్రి నుంచి ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంకు తరలించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పద్మారావు గౌడ్, ఎంపీ ఈటల రా జేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, డిప్యూటీ మేయర్ ఎం. శ్రీలత శోభన్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, కవి జయరాజ్‌తో పాటు పలువురు కవులు, కళాకారులు అందెశ్రీ భాతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అందెశ్రీ సాహిత్య సేవలను, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. రేబర్తి దిగ్భ్రాంతి అందెశ్రీ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కన్నుమూత వార్త వినగానే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామస్తులు, ఆయన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అందెశ్రీ రేబర్తి గ్రామానికి చెందిన అందె ఎల్లమ్మ, బొడ్డయ్య దంపతులకు 1961 జూలై 18న రెండో సంతానంగా జని్మచారు. ఆయనకు అక్క రాజమ్మ, తమ్ముడు రాములు ఉన్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. అయితే గ్రామస్తులు ఎల్లన్న అని పిలిచేవారు. కడు పేదరికం కారణంగా తల్లిదండ్రులు అందెశ్రీని చిన్నప్పుడు పశువుల పాలేరుగా చేర్చారు.పశువులను మేపుతూనే ప్రకృతి ఒడిలో ఆశువుగా పాటలు పాడేవారు. తన 18వ ఏట నిజామాబాద్‌కు వెళ్లి తాపీమేస్త్రీగా పని చేశారు. అదే సమయంలో శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహరాజ్ ఆయనలోని ప్రతిభను గుర్తించి, భవిష్యత్తులో గొప్ప కవి అవుతావని చెప్పి అందె ఎల్లయ్యగా ఉన్న పేరును అందెశ్రీగా మార్చారు. కాగా అందెశ్రీ చేర్యాల మండలం బండపల్లికి చెందిన మల్లమ్మను వివాహం చేసుకున్నారు. తాపీ మేస్త్రీగానే కుటుంబంతో కలిసి హైదరాబాద్ తార్నాక లాలాపేట వినోభానగర్‌కు వలస వచ్చారు. తన ఆశు కవిత్వంతో స్థానికులను అలరించేవారని లాలాపేట వాసులు చెప్పారు. స్వగ్రామంపై గేయం అందెశ్రీకి తన స్వగ్రామమైన రేబర్తితో మంచి అనుబంధం ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం గ్రామంలో జరుగుతున్న బీరప్ప పండుగ కోసం వచి్చన సమయంలో ‘సూడ సక్కాని తల్లి.. సుక్కల్లో జాబిల్లి’ అంటూ తన ఊరు గొప్పతనంతో పాటు కులవృత్తుల వైభవాన్ని చాటేలా పాట రాశారు. గ్రామంలోని పాఠశాలను పలుమార్లు సందర్శించి విద్యార్థులకు దిశానిర్దేశం చేసేవారు. 1988లో రేబర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. గతంలో ప్రభుత్వం ఆయనకు 500 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వగా, ఇటీవల గ్రామంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు తన మిత్రులకు తెలిపారు. ప్రపంచమే పాఠశాలగా.. అందె ఎల్లయ్య చదువుకోనప్పటికీ కవిత్వాన్ని అలవోకగా చెప్పేవారు. జనం నాల్కలపై చిరస్థాయిగా నిలిచిపోయేలా కవితలు రాశారు. ఆయనకు గురువులు లేరు. ఆయనకు ప్రపంచమే పాఠశాల. జీవన అనుభవ మూలాల నుంచి తాతి్వకత నిండిన చిక్కని కవిత్వాన్ని చెప్పటం అందెశ్రీకే చెల్లింది. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..’ అన్న పాట నేటి సమాజాన్ని, మానవ సంబంధాల్ని మనకు అద్దంలా చూపుతుంది. ఈ ఒక్క పాదం లక్షలాది మంది ప్రజల సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌గా మారింది. ఆయన కంఠమే ఒక ధూంధాం అన్నట్టుగా అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై రాసిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతం కోట్లాదిమందిని ఉర్రూతలూగించింది. తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా నిలిచి కోట్లాది మంది గుండెల్లో ప్రతిధ్వనించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత ఆ గేయాన్ని కొన్ని మార్పులతో రాష్ట్ర గీతంగా ప్రకటించింది. మది నిండా నదులు మానవ జీవన పరిణామ క్రమం మీద, నదుల మీద సుదీర్ఘ కావ్యం రచించారు. నదులు పుట్టిన చోటుకు వెళ్లి అక్కడ అలల మీద తిరుగాడుతూ కవిత్వాన్ని అల్లుకుంటూ పద్యమై, పాటై పల్లవించారు. నైలు నదిని చూశారు. అమెజాన్ నది పుట్టిన ప్రదేశానికీ వెళ్లారు. మిసిసిపి, కాంగో, జాంబేజీ నదుల దగ్గరకు వెళ్లి వాటి ప్రవాహ సవ్వడిని, అలల తాకిడిని విన్నారు. ‘నది నడిచిపోతున్నదమ్మా.. నన్ను నావనై రమ్మన్నదన్నా..’ అంటూ రమ్యమైన పాటను రచించారు. పాటలు.. పురస్కారాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. ‘బతుకమ్మ’ సినిమాకు మాటలు రాశారు. అనేక సినిమాలకు పాటలు రాశారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా..’, ‘గలగల గజ్జెల బండి..’, ‘పల్లె నీకు వందనాలు..’, ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు..’ వంటి అనేక పాటలు రాశారు. పలు అవార్డులను అందుకున్నారు.‘లోకకవి’ అవార్డు, విశాఖ లోక్‌నాయక్ ఫౌండేషన్ నుంచి ‘లోక్‌నాయక్’ అవార్డు, డాక్టర్ రావూరి భరద్వాజ పురస్కారం, సుద్దాల హన్మంతు పురస్కారం, వంశీ ఇంటర్నేషనల్ దాశరథి పురస్కారం తదితరాలు అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆయన పాటలు అనేక విశ్వవిద్యాలయాల సిలబస్‌లో చోటు చేసుకున్నాయి. ‘గంగా’ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. గణపతి సచి్చదానంద స్వామి నుంచి స్వర్ణ కంకణం పొందారు. ఆయన కవిత్వం, పాటలు కలిపి ఇటీవలే ‘నిప్పుల వాగు’ అన్న బృహత్ సంకలనాన్ని అందెశ్రీ సంపాదకత్వంలో వెలువరించారు.సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు – ప్రధాని మోదీ సంతాపం అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా తెలుగులో ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు. ‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన.. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే.. ప్రజల సాంఘిక హృదయ స్పందనకు రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన.. సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను..’ అని మోదీ పేర్కొన్నారు.అందెశ్రీ మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ ప్రత్యేకతను చాటారని తెలిపారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కారి్మకుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.బాధాకరం: అమిత్ షా తెలుగు కవి, గేయ రచయి త అందెశ్రీ మరణం బాధాకరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నా రు. ‘అందెశ్రీ చిరస్మరణీ యుడు. తెలంగాణలోని ప్రజల గొంతులను శక్తివంతం చేయడానికి, తన సృజనాత్మకత ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన మరణం మన సాహిత్య, సాంస్కృతిక రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం..’ అని అమిత్ షా పేర్కొన్నారు. నిజమైన భూమి పుత్రుడు: మల్లికార్జున ఖర్గే ‘అందెశ్రీ మరణం తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య ఆత్మలో లోతైన శూన్యతను మిగిలి్చంది. పేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన నిజమైన భూమి పుత్రుడు ఆయన. గొప్ప కవిగా ఆయన మాటలు తెలంగాణ ఉద్యమానికి హృదయ స్పందనగా మారాయి. ఆయన కుటుంబానికి, స్నేహితులు, అభిమానులకు నా హృదయ పూర్వక సంతాపం..’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.సాహితీ శిఖరం నేల కూలింది: సీఎం అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాంస్కృతిక దిగ్గజాన్ని కోల్పోయాం: రాహుల్‌గాంధీ ‘అందెశ్రీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన స్వరం ‘జయ జయహే తెలంగాణ’ ద్వారా తెలంగాణకు ఆత్మను ఇచి్చంది. ఇది గుర్తింపు, స్థితిస్థాపకత, సామూహిక గర్వానికి చిహ్నంగా మారింది. ఆయన మరణంతో మనం ఒక సాంస్కృతిక దిగ్గజాన్ని కోల్పోయాము. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటుత్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంతాపంసాక్షి, హైదరాబాద్: అందెశ్రీ మరణం పట్ల త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తంచేశారు. సాహితీ లోకా నికి అందెశ్రీ లేని లోటు తీర్చలేనిదని, తన కలం, గళంతో ప్రజానీకాన్ని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని నివాళులర్పించారు. ప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు.. యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. సాహిత్యానికి తీరని లోటు: కేటీఆర్ అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అందెశ్రీ పారి్థవదేహానికి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రముఖుల దిగ్భ్రాంతి: అందెశ్రీ మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క సంతాపం తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, వివిధ పారీ్టల ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సంతాపం తెలిపారు.తెలంగాణకు తీరనిలోటు: కేసీఆర్ అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో.. కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఒకే పాటై పయనించాం: గోరటితెలంగాణ ఉద్యమంలో ఇద్దరం ఒకే పాటై పయనించామని, ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆవేదన వ్యక్తంచేశారు. లాలాపేట్‌లోని జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అందెశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పద సాహిత్యం, పద్య కవిత్వం నుంచి తనదైన దారి వేసుకొని సాగిపోయిన గొప్ప కవి అందెశ్రీ అని కొనియాడారు.మూడు రోజులుగా అస్వస్థత: ప్రొఫెసర్ సునీల్‌కుమార్ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): అందెశ్రీని గాంధీ ఆస్పత్రికి తెచి్చనప్పటికే ఆయన మృతి చెందారని, దీంతో బ్రాట్ డెడ్‌గా డిక్లేర్ చేశామని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సునీల్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఆదివారం రాత్రి భోజనం చేసి పడుకున్నారని, ఉదయం చూసేసరికి బాత్రూమ్ వద్ద పడి ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారని చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో ఆయన మృతి చెంది ఉంటారని భావిస్తున్నామని, సోమవారం ఉదయం 7.18 గంటలకు గాంధీ ఆస్పత్రికి తెచ్చినప్పటికే ఆయన శరీరం గట్టి పడి ఉందని పేర్కొన్నారు.అందెశ్రీ ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. గత ఐదేళ్లుగా హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారని, నెలరోజుల నుంచి బీపీ మాత్రలు వేసుకోవడం లేదని చెప్పారు. గత మూడు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నా వైద్యుని సంప్రదించలేదని, ఛాతీలో స్వల్పంగా వచి్చన నొప్పిని గ్యా్రస్టిక్ సమస్యగా భావించి ఉండొచ్చునని అన్నారు. -
బతుకును గానం చేసిన కవి
‘మాయమై పోతున్నడమ్మా మనిషి’... అని మనిషి కోసం వెతుకులాడినా ‘కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిచి మొక్కితే అమ్మరా’... అని ప్రకృతిని ఆరాధించినా ‘జయజయహే తెలంగాణ’ అని తెలంగాణ తల్లికి జ్యోతలు అర్పించినా అందెశ్రీకే సాధ్యం. జనజీవన గాథలను పాటగా మలచిన అమర కవి అందెశ్రీకి నివాళి...పాటల మాగాణంగా వాసికెక్కిన తెలంగాణలో ఒక దిక్కార గొంతుక అందెశ్రీ. అక్షరాలు రాని దశ నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్రగీతం అందించే దశకు ఎదిగిన కవి ఆయన. తెలంగాణ నేలన వందలాదిమంది పాటకవులు ఉన్నారు. అందరూ తమ తమ సృజనస్థాయుల్లో కృషి చేశారు. కాని వారిలో అందెశ్రీ తనదైన శైలితో కోట్లాది హృదయాలను గెలుచుకున్నాడు. చదవడం, రాయడం రాకముందే పాటలు అల్లి పాడడం మొదలు పెట్టిన ఆయనది జానపదుల శైలి. ఆ శైలినే మొదట కొనసాగించాడు. తర్వాత తనకు తెలిసిన జీవితాన్ని పాటల్లోకి ఒంపుతూ వెళ్లాడు. అట్లా ఆయన పాటల నిండా తనదైన ముద్ర పరుచుకుని ఉంది.అందెశ్రీ పాటల్లో సామాజిక సమస్యల మీద రాసిన పాటలది సగపాలు. తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలది సగపాలు. సామాజిక సమస్యల మీద అందెశ్రీ రచించిన పాటల్లో పల్లెతనం ఆవహించుకుని ఉంటుంది. పల్లె బతుకును పాటగా అల్లడం ద్వారా ఆయన ఈ మట్టి మీద, మనుషుల మీద తనకున్న ఎడతెగని ప్రేమ, మమకారాన్ని అక్షరాల్లో చూపిస్తాడు. పూర్వ వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో జన్మించిన అందెశ్రీకి పల్లెను పట్టుకోవడంలో తనదైన దృష్టి ఉంది. తెలంగాణ పల్లెల్లో ఉండే మానవ సంబంధాలను అర్థం చేసుకుని తనకున్న దళిత జీవిత అస్తిత్వం నుండి వాటిని పాటలుగా మలిచాడు. తాను రాసిన ‘సూడా సక్కాని తల్లి, సుక్కల్లో జాబిల్లి’ పాటలో పల్లెల్లో కులవృత్తుల భాగస్వామ్యాన్ని గానం చేశాడు. సబ్బండ కులాలు ఎట్లా గ్రామ స్వరాజ్యంలో పాలుపంచుకుంటాయో వర్ణించాడు. చేతివృత్తులకు శిరస్సు వంచి నమస్కరించాడు. అలాంటి చేతి వృత్తులు గ్లోబలైజేషన్ నేపథ్యంలో విధ్వంసానికి గురైనప్పుడు ఆయనే ‘కొమ్మ చెక్కితే బొమ్మరా...అది కొలిచి మొక్కితే అమ్మరా...’ అంటూ ధిక్కారాన్ని పలికించాడు. అంతర్జాతీయ కుట్రలను ఎండగట్టాడు. ‘భాష మీద దాడి చేసిరిబతుకు మీద దాడి చేసిరి తరతరాలుగా భరతజాతిని బహువిధాలుగ బాధపెడితిరిఎవరి నమ్మకాలు వారివిఎక్కిరించే హక్కులెకడివి?అగ్గికి చెదలెట్ల పడుతది?నిగ్గదీసి అడుగుతున్నా’అంటూ నిలదీశాడు. తెలంగాణ గ్రామాల్లో ఉండే వెనుకబడిన కులాల జీవనం మీద కూడా అందెశ్రీ పాటలు రాశాడు. ‘తలమీద సుట్టా బట్టాఆ పైనా పండ్లా తట్టాపండ్లు పండ్లోయనిపల్లెంత తిరుగుకుంటూబజార్ల కూసోనమ్మిబతుకెళ్ల దీసుకున్నా’అంటూ ‘తెనుగోల్ల ఎల్లమ్మ’ బతుకును పాటల్లో అద్భుతంగా చిత్రించాడు అందెశ్రీ. ఇక మాదిగల సాంస్కృతిక జీవనంలో భాగమైన డప్పు పాత్రను అత్యద్భుతంగా వర్ణించాడు. ‘మాదిగయ్యల మేథ నుండి పురుడు పోసుకున్నదిమానవ జాతులను ఎపుడూ మేలుకొలుపుతుంటది’ అంటూ డప్పు ఇప్పటికీ గ్రామాల్లో పోషించే పాత్రను గొప్పగా ఆవిష్కరించాడు. డప్పు మీద అందెశ్రీ రాసిన ఈ పాట అత్యంత తాత్విక గాఢతను కలిగి ఉంది. ‘ఊరిలో ఏ సావుకైనా ముందే ఉంటానంటది... ఏడుపెందుకు లోకమందున ఎవరు బతుకుతరంటది’ అంటాడాయన ఆ పాటలో తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ రాసిన ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకమైంది. ‘సూడు తెలంగాణ సుక్కనీరు లేనిదానా’అంటూ తెలంగాణ అరవయేండ్ల దు:ఖానికి గొంతుకను ఇచ్చి మోసినవాడు అందెశ్రీ. అలాగే ఉద్యమ కాలంలో ‘జై బోలో తెలంగాణ...’ అంటూ తాను రాసిన పాట తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రూత లూగించింది. అందెశ్రీ రాసిన తెలంగాణ పాటల్లో తలమానికమైంది ‘జయజయహే తెలంగాణ...’ పాట. ఈ పాట తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రజలే దీనిని రాష్ట్ర గీతంగా భావించారు. స్కూళ్లు, ఆఫీసుల్లో ఈ పాటను పాడుకుని దినచర్యను ్రపారంభించారు. అట్లా తెలంగాణ వచ్చిన పదేళ్ల తరువాత అధికారికంగా ఇదే గీతాన్ని రాష్ట్ర గీతంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈ పాట నుండి తెలం గాణ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటాడు అందెశ్రీ. ముఖ్యంగా ఇందులో వాడిన భాష పండిత భాష. బాగా చదువుకున్న పండితుల కంటే తాను ఏ మాత్రం తక్కువకాదని నిరూపించుకునేలా ఈ పాటలో పద ప్రయోగాలు చేశాడు.అటు పల్లె పాటలైనా, ఇటు పండిత పాటలైన మెప్పించి, ఒప్పించగలిగే శక్తి ఆయన పాటలకే ఉందంటే అతిశయోక్తి కాదు. అందెశ్రీ రచించిన పాటల్లో ఎక్కువగా పాపులర్ అయిన పాటల్లో ఒకటి ‘మాయమై పోతున్నడమ్మా... మనిషన్నవాడు’ పాట. ఈ పాటలో అందెశ్రీ ఆధునిక కాలంలో మృగ్యమై పోతున్న మానవ విలువల మీద ఒక హెచ్చరిక లాంటి స్వరాన్ని వినిపించాడు. తాను జీవించిన కాలాన్ని పాటతో వెలిగించిన ఈ పాటల ప్రజాకవి, ధిక్కారమే తన చిరునామాగా జీవించాడు. పాట ఉన్నంత కాలం అందెశ్రీకి మరణం లేదు. – డా. పసునూరి రవీందర్,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు -
అందెశ్రీ మృతిపై లైవ్ లో భావోద్వేగానికి లోనైన సింగర్స్..
-
అందెశ్రీ మరణంపై వైద్యుల కామెంట్స్
-
రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’కు సంబంధించిన రెండు వెర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’పూర్తి స్థాయి గేయాన్ని ఓ వెర్షన్‌గా, సంక్షిప్తీకరించిన గేయాన్ని మరో వెర్షన్‌గా విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందెశ్రీ, సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు.రాష్ట్ర గీతానికి రెండు వెర్షన్లు సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డు చేసే బాధ్యతలను అందెశ్రీకి ప్రభుత్వం అప్పగించింది. అంతర్జాతీయ, జాతీయ, వివిధ రాష్ట్రాల అధికారిక గీతాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయి వెర్షన్లో గేయాన్ని ఉన్నది ఉన్నట్టు వాడుకోవాలా, ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తన ఆలోచనలను వివరించారు. చరణాలు, పల్లవి, బాణీలో అవసరమైన మార్పులపై తుదినిర్ణయం తీసుకునే బాధ్యతను అందెశ్రీకి అప్పజెప్పారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి అతిథులు రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు సుదీర్ఘంగా ఉన్న జయజయహే తెలంగాణ గేయాన్ని పాడటం/వినిపించడానికి అవసరమైన సమయం ఉండదు. ఈ నేపథ్యంలో గేయం సంక్షిప్తరూపంతో మరో వెర్షన్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు. గేయాలను ఎవరు పాడాలి? కోరస్ ఉండాలా? సోలోగా పాడాలా? అనే అంశాలను సైతం అందెశ్రీకి వదిలేసింది. సంగీత దర్శకుడిగా కీరవాణి పేరును సైతం అందెశ్రీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని గతంలో నిర్వహించిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యప్రజాసంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.తిరుమలకు సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. మనవడి తలనీలాలు సమరి్పంచి మొక్కు తీర్చుకోవడానికి ఆయన శ్రీవారి ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. బుధవారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. -
తెలంగాణ రాష్ట్ర గేయం ఇదే
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం!! పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణా!! పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ!! కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! జానపద జనజీవన జావలీలు జాలువారు కవిగాయక వైతాళిక కళల మంజీరాలు!! జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నీవే మా ప్రాణం!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! సిరివెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం!! సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ ఎద!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి!! సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి!! జై తెలంగాణ జై జై తెలంగాణా!! అందెశ్రీ నేపథ్యం.. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత అందెశ్రీ రాశారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా పనిచేసిన ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని చేరదీశాడు. రాష్ట్రవ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందెశ్రీ పాటలున్నాయి. 2006లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అందెశ్రీ సినీ పాటల జాబితా జయజయహే తెలంగాణ జననీ జయకేతనం పల్లెనీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గలగల గజ్జెలబండి కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా జన జాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి -
కవిత్వం కళ్ల ముందు కన్పించాకే రాస్తా!
తెలంగాణ రాష్ట్ర గీతకర్త అందెశ్రీ ఇంటర్వ్యూ ఆది శంకరుడిని కీర్తించడం అసాధారణమేమీ కాదు. శంకరుడు పూజించిన ‘చండాలుడి’ని? అసాధారణం కదా. అటువంటి అద్భుతం నిజామాబాద్ జిల్లా అమరాద్లో దాదాపు నాలుగు దశాబ్దాల నాడు జరిగింది. లోకరీతిలో నిజామాబాద్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తిలో 1961 జూలై 18న మాదిగ కులస్తుడిగా పుట్టారు ఎల్లయ్య. అతడి 16వ ఏట శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహరాజ్ ‘బిడ్డా, కాళిదాసును తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె అందె విన్పిస్తోంది. నీవు నేటి నుంచి అంద్శైవి అని ఆశీర్వదించారు. ఆచరణలోనూ అపురూపంగా చూశారు. ఒక యజ్ఞంలో ‘అంద్శైని రుత్వికునిగా కూర్చోపెట్టారు. తమ సరసన ‘అతడు’ కూర్చునేందుకు వీలులేదన్న సాంప్రదాయవాదులతో ‘తమరు నిష్ర్కమించవచ్చు. అందె శ్రీ రుత్వికుడు. నేను సోమయాజిని, యజ్ఞానికి మీరు అనర్హుల’న్న అభినవశంకరుడు శంకర్ మహరాజ్! బడి మొఖం చూడని పశువుల కాపరి లలిత జానపద కవి (సెమీ క్లాసికల్ కవి)గా ఆవిష్కృతమైన బతుకు బాటలో ఇటువంటి అపురూపాలెన్నో. ఎర్రసముద్రం సినిమా కోసం ఆయన రాసిన పాట ‘మాయమై పోతున్నడమ్మ మనిషి’ 2006 నుంచి ద్వితీయ ఇంటర్ పాఠ్యాంశం. తెలుగు సినిమా చరిత్రలో ‘మా తెలుగు తల్లికి’, ‘తెలుగు జాతి మనది’ తర్వాత పాఠ్యాంశంగా చేరిన మూడవ పాట ‘మాయమైపోతున్నడమ్మా’ కావడం గమనార్హం. గంగ సినిమాలో ‘వెళ్లి పోతున్నావా’కు నంది అవార్డు స్వీకరించారు, భారత ప్రభుత్వపు 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ’ తన పాటను రాష్ట్రగీతంగా స్వీకరించిన సందర్భంలో అంద్శై ఇంటర్వ్యూ సారాంశం : పాటకు బీజం తెలంగాణ కళాకారులు లేదా రచయితలు తమ తమ సమావేశాలను పాటతో ప్రారంభించడం ఆనవాయితీ. వివిధ సంఘాల సమాహారమైన తెలంగాణ ఉద్యమ కళాకారులు 2002 సెప్టెంబర్ 30న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ధూంధాం తలపెట్టారు. అందులో నేనూ పాల్గొన్నా. ముందుగా ఏ పాట పాడాలని మీమాంస వచ్చింది. తెలంగాణకు అందరూ హర్షించే ఒక గీతం లేకపాయెనే అన్పించింది. అందరి నాల్కలపై నిలిచే పాట రాయాలె అనుకున్న. అప్పుడు రెండు చరణాలు ఇప్పుడు రెండు చరణాలు ఊరుతున్నవి. మరుసటి సంవత్సరం సిద్దిపేటలో తెలంగాణ రచయితల సంఘం సమావేశ ప్రారంభగీతంగా పాడుతున్నా... ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ ... ఎవరో వెనుక నుంచి ‘ఇది తెలంగాణ జాతీయగీతం’ అన్నరు. వెక్కిరింతేమో అని కొంచెం భయపడ్డాను. కాదని తెలిసి తెప్పరిల్లిన. ఆ క్షణం నుంచి ప్రతి ఒక్కరూ ఈ పాటను తమదిగా చేసుకున్నారు. ఏడేళ్లుగా నునుపు చేసిన పాటలో పల్లవితో కలిపి 12 చరణాలున్నవి. లక్షలాది ప్రజానీకం సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి యువ విభాగం ‘జనజాగరణసేన’ సమావేశంలో ఇందులోని నాలుగు చరణాలు పాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్థులు ఈ పాటను కొన్నాళ్లుగా పాడుతున్నారు. ఆ నాలుగు చరణాలకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం హోదానిచ్చింది. రాష్ట్రగీతం హోదా పూర్తి పాటను తెలుసుకునేందుకు ఆస్కారం ఇస్తుందని భావిస్తున్నాను. అన్నిటి కంటె గొప్ప ఆనందం నన్ను కొడుకుగా పెంచి పెద్దచేసిన దివంగత బిరుదురాజు ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేల జాతీయ గీతం’ అన్నప్పుడు కలిగింది. ప్రతి భాషా అపౌరుషేయమే! వేదాలు అపౌరుషేయాలు అంటారు. ‘తాను పలికినది కాదు’ అనే అర్ధంలో ప్రతి భాషా అపౌరుషేయమే! ఏ పదం ఏ ఒక్కరూ కనిపెట్టలేదు. మనకు సంక్రమించిన పదాలు, నుడికారాలు, భావాలతో స్వీయానుభవాన్ని రంగరించి గానం చేస్తాం. రచిస్తాం. కాబట్టి ‘జయజయహే తెలంగాణ’ నా ద్వారా వచ్చిన అనేకుల పాట! శతకకవుల్లా తెలంగాణ ప్రాంతంలో ‘వరకవులు’న్నరు. వేమన వలె ‘గున్రెడ్డిపల్లె కుమ్మర సిద్దప్ప’ ప్రజలు పాడుకునే వరకవి. బాల్యంలో పశువులు కాసుకునే వాడిని. చెలకల్లో చెట్టుకిందకు చేరి కొందరు ఆయన పద్యాలు పాడేవారు. అవి నాలో ఇనికి పోయినవి. అక్షరాలు నేర్వకుండనే ఛందస్సుతో పద్యాలు రాయడం ఆ తీరుగ వచ్చింది. గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాను. పండుటాకు ఎంత ఇష్టమో, అంకురించే చివురుపైనా అంత ప్రేమ! ప్రకృతికి చెందిన వస్తు-శిల్పాలకు శృతి లయలు ప్రాణ ప్రతిష్ట చేశాయి. లంకలో సంపద ఎంత ఉన్నా అయోధ్యకు సాటిరాదు అనే నేపథ్యంలో రామునితో ఆదికవి వాల్మీకి ‘జననీ జన్మభూమిశ్చ’ అనే శ్లోకాన్ని చెప్పిస్తారు. అదే భావాన్ని ‘తరతరాల చరితగల తల్లీ నీరాజనం-పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’ అన్నాను. ఆదికవి నుంచి నన్ను ఆదరించిన జక్కిరెడ్డి పూజల మల్లయ్య, ఉడుకుడుకు అన్నం పెట్టిన మహ్మద్ మునీర్ సేట్, బాలబాలికలు, యువతీ యువకులు అందరి పాలూ రాష్ట్రగీతంలో ఉంది. ఇందులో నా వాటా అణాపైసలే! చూడంది రాయలేను! పద్యమైనా, పాటైనా చూడంది రాయలేను. ప్రకృతి మనిషితో సహా అందులో భాగమైన చరాచరాలను చూసినపుడు కలిగిన సంవేదనలనే రాస్తాను. ‘వాక్కులమ్మ’ రాస్తున్నాను. ఆమె సరస్వతి కాదు. ప్రాణిలో పరుగిడు ప్రణవం. సృష్టి కనుచూపు. అందులో ఒక చరణం ‘కోటి భావాల కొనగోట మీటినట్లు-వసుధ విన్పింతు నా మాట వాక్కులమ్మా’. ప్రపంచంలో ఉన్న నదులన్నిటినీ సందర్శించి నదీ కవిత్వం రాయాలని సంకల్పించాను. ఆఫ్రికా, చైనా పర్యటనలు చేశాను. చూసే రాయాలంటే ‘నదిని కంప్యూటర్లో చూడొచ్చు కదా’ అన్నారొక మిత్రులు. కంప్యూటర్‌తో సంసారం చేయగలమా?! - పున్నా కృష్ణమూర్తి -
కూలీ కలం నుంచి జాలువారిన గీతం
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.. ఇప్పుడిది తెలంగాణ రాష్ట్రగీతం. ప్రాథమిక విద్య కూడా చదవకుండానే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన అందె ఎల్లయ్య ఈ పాటను రాశారు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. వరంగల్ జిల్లా జనగామ సమీపంలోని రేబర్తి గ్రామంలో జన్మించారు. గొర్రెల కాపరిగా, కూలీగా కూడా పని చేశారు. ఆర్. నారాయణమూర్తి తీసే విప్లవ చిత్రాల్లో చాలావరకు పాటలు ఈయన రాసినవే. తెలంగాణ ప్రాంతాన్ని అద్భుతంగా వర్ణిస్తూ.. సాధారణమైన చిన్నచిన్న పదాలతో ఈయన అల్లే పాటలు ఈ ప్రాంతంలో బహుళ జనాదరణ పొందాయి. ఎర్ర సముద్రం సినిమా కోసం ఆయన రాసిన 'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు' పాటను కొన్ని విశ్వవిద్యాలయాలు తమ తెలుగు పాఠ్యభాగాల్లో కూడా చేర్చాయి. ప్రకృతి ప్రేమికుడైన ఈయన రాసిన 'జయజయహే తెలంగాణ' పాటను.. ఇన్నాళ్లుగా ఉన్న 'మా తెలుగు తల్లికి' స్థానంలో రాష్ట్ర గీతంగా స్వీకరించారు. నదులంటే అందెశ్రీకి చెప్పలేనంత ఇష్టం. అది ఎంతగానంటే కృష్ణా గోదావరి నదులతో పాటు ఏకంగా నైలు నది, విక్టోరియా ఫాల్స్ లాంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న నదుల వరకు అన్నింటి విషయాలూ ఆయనకు కరతలామలకం.


