తెలంగాణ భూమి పుత్రుడికి తుది వీడ్కోలు
ఆయన రచనలు ముందు తరాలకు అందాలి
పాఠ్యాంశాల్లో చేర్చి, స్మృతివనం ఏర్పాటు చేయాలి
తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన ప్రవాస తెలంగాణ వాదులు
ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.
తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు.
ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.
అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.
అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు.


