సాక్షి హైదరాబాద్: కృష్ణానది ఎక్కడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అడగడం హస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్న సంగతి కూడా సీఎంకు తెలియకపోవడం బాధాకరమన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తినే ఈ రోజు ప్రభుత్వం నీటి పారుదల శాఖ సలహాదారుగా నియమించిందని తెలిపారు.
అసెంబ్లీలో నీటి సమస్యలపై దేనిమీద చర్చపెట్టాలో సైతం కనీసం ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. కేసీఆర్ చర్చకు వస్తున్నారని మంత్రులంతా ప్రిపరేషన్ మెుదలు పెట్టారని రాష్ట్ర మంత్రులను కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అయితే సభా కార్య కలాపాలపై ఈ రోజు బీఎసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు జరపాలని సమావేశంలో నిర్ణయించారు.
అయితే అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నడపాలని బీఆర్ఎస్, 20 రోజులు నడపాలని బీజేపీ పార్టీలు పట్టుబట్టాయి. ఈ అంశంపై తదుపరి నిర్వహించే బీఎసీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.


