సాక్షి హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈసందర్భంగా రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావించారు. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో మాదిరి తిరుపతిలోనూ తెలంగాణ భవన్ నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రానికి చెందిన భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాల అంశంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా అయ్యప్పస్వామి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు శబరిమలకు వెళుతుంటారని, సూదూర ప్రాంతం కావడంతో అక్కడ కూడా తెలంగాణ భవన్ నిర్మించే అంశం ప్రభుత్వం ఆలోచించాలని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి సూచించారు.
ఇదివరకే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తిరుపతిలో ఆ రాష్ట్రాలకు చెందిన భవన్‌లు నిర్మించుకున్నాయని దీంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజాపతినిధులు అక్కడికి వెళ్లినప్పుడు వారికి ఇబ్బందులు కలగడం లేదన్నారు. కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం అక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే ప్రజాప్రతినిధులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి నివేదించారు.


