ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి షాకిచ్చిన అధిష్టానం | Congress High Command Decision Shocks MLC Jeevan Reddy in Telangana MLC Polls | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి షాకిచ్చిన అధిష్టానం

Feb 16 2026 10:40 AM | Updated on Feb 16 2026 11:25 AM

Congress High Command Decision Shocks MLC Jeevan Reddy in Telangana MLC Polls

సాక్షి,జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్‌ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎమ్మెల్యే సంజయ్‌ తరుఫు వర్గానికి చెందిన అభ్యర్థిని మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మొండి చేయిచూపించింది. ఎమ్మెల్యే సంజయ్‌ వర్గానికి చెందిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వాణి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. 

జగిత్యాలలలో మున్సిపాలిటీ వార్డులు మొత్తం 50 ఉండగా ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాలంటే కనీసం 25 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్‌ వర్గం వైపు 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో ఆయన వర్గానికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఈ పరిణామం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గానికి పెద్ద దెబ్బగా మారింది.

కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. వాణి అభ్యర్థిత్వం ఖరారవడంతో, జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లోనే ఉండే అవకాశం బలపడింది. అయితే, ఈ నిర్ణయం వల్ల పార్టీ అంతర్గతంగా విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement