బస్సు.. రాదేం బాసూ! | Hyderabad City Bus Services Face Major Disruptions, Passengers Struggle With Reduced Timings and Cancellations | Sakshi
Sakshi News home page

బస్సు.. రాదేం బాసూ!

Feb 16 2026 9:57 AM | Updated on Feb 16 2026 11:33 AM

night bus shortage leaves passengers stranded at aramghar bus stop city services cut

సాక్షి, హైదరాబాద్‌: ఇది ఆరాంఘర్‌ చౌరస్తాలోని బస్టాప్‌. శనివారం రాత్రి 9 గంటలు దాటింది. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్‌ మీదుగా ఉప్పల్‌కు రాకపోకలు సాగించే  సిటీబస్సు (రూట్‌ 300) కోసం ప్రయాణికులు  ఎదురుచూస్తున్నారు. బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. గంట సేపట్నుంచీ ఇలా పడిగాపులు కాస్తున్నారు. చాలాసార్లు ఆఖరి బస్సు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణం చేయడం షరామామూలుగా మారింది. ఈ ఒక్క రూట్‌లోనే కాదు.. నగర శివారు కాలనీలకు, దూర ప్రాంతాలకు సకాలంలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ప్రత్యేకించి రాత్రి 9 గంటల తర్వాత, శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో సిటీ బస్సులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకొనే నెపంతో పలు డిపోల్లో ఆఖరి ట్రిప్పులను నిలిపివేస్తున్నారు. మరోవైపు కొన్ని డిపోలు  నైట్‌ హాల్ట్‌ సరీ్వసులకు సైతం స్వస్తి చెబుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ప్రధానంగా మహిళలు, విద్యార్థులు, ఆలస్యంగా విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రయాణికులు అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇదే అదనుగా ఆటోవాలాలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు.  

ప్రతిరోజూ తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు, కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీ మేరకు రాత్రి 12 తర్వాతా ఆఖరి ట్రిప్పులు తిరగాలి. కానీ.. కొన్ని రూట్లలో ప్రయాణికులు లేరనే సాకుతో డ్రైవర్లు, కండక్టర్‌లే ఆఖరి ట్రిప్పులను రద్దు చేస్తున్నారు. మరికొన్ని డిపోల పరిధిలో బస్సుల నిర్వహణ ఖర్చును తగ్గించుకొనే నెపంతో ట్రిప్పుల్లో కోత విధిస్తున్నట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, గండిమైసమ్మ, మొయినాబాద్, శామీర్‌పేట్,  తదితర  ప్రాంతాల్లో చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలకు రాత్రి వేళల్లో ట్రిప్పులను నిలిపివేస్తున్నారు. నైట్‌హాల్ట్‌ సర్వీసులను కూడా అధికారులు రద్దు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నైట్‌డ్యూటీ సిబ్బందికి అదనపు  అలవెన్సులను భారంగా భావించడంతోనే నైట్‌హాల్ట్‌ సరీ్వసులు నిలిచిపోతున్నాయని  డ్రైవర్లు, కండక్టర్‌లు చెబుతున్నారు.  

నిత్యం 20 లక్షల మంది ప్రయాణికులు.. 
గ్రేటర్‌ పరిధిలో 25 డిపోల నుంచి నిత్యం సుమారు 2,850 బస్సులకుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్టీసీ అంచనా ప్రకారం 20 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. కానీ  మహా నగర విస్తరణకు అనుగుణంగా సిటీబస్‌ సేవలు విస్తరించకపోవడంతో ప్రజా రవాణా సదుపాయం తగ్గుముఖం పడుతోంది. బస్సు ట్రిప్పుల కొరత మరింత ఆజ్యం పోస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement