మాకూ కావాలి ప్రమోషన్‌..! | Hyderabad Police Officials Consider Mass Leave Or Resignation Over Seniority List Controversy, More Details Inside | Sakshi
Sakshi News home page

మాకూ కావాలి ప్రమోషన్‌..!

Feb 16 2026 8:59 AM | Updated on Feb 16 2026 11:35 AM

senior police officers plan mass leave or resign over seniority promotion row

ఇవ్వకపోతే  సామూహిక సెలవు లేదా రాజీనామా ? 

1989, 1991 బ్యాచ్‌లకు చెందిన పోలీసుల యోచన 

సీనియారిటీ జాబితా తయారీలో రాజకీయ జోక్యం 

కొందరి కోసం చక్రం తిప్పుతున్న కీలక నాయకుడు  

 

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు విభాగంలోకి 1989, 1991ల్లో ఎస్‌ఐలుగా ఎంపికై ప్రస్తుతం డీఎస్పీ, అదనపు ఎస్పీ హోదాల్లో పని చేస్తున్న అధికారుల్లో కొందరు ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితా ఖరారులో రాజకీయ జోక్యం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సామూహికంగా సెలవులో వెళ్లాలని.. లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని భావిస్తున్నారు. ఓ కీలక నాయకుడు చక్రం తిప్పుతూ ఓ రేంజ్‌కు చెందిన వారికి లబ్ధి చేకూర్చడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయకుంటే త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
  
ఇక్కడే పదోన్నతులకు అవకాశాలెక్కువ... 
పోలీసు విభాగంలో వివిధ క్యాడర్‌ పోస్టులు ఉంటాయి. వీటిలో ఉండే ఖాళీలు, కొత్తగా కేటాయించే పోస్టుల ఆధారంగానే పదోన్నతులు జరుగుతుంటాయి. ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌ సైతం జోనల్‌ విధానంలో, అక్కడి ఖాళీలను బట్టి జరుగుతుంది. వీళ్లు ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందాలంటే ఆ జోన్‌లో ఉన్న అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరో రేంజ్‌గా పరిగణించే హైదరాబాద్‌ రేంజ్‌లోకి ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్‌లో 1978 బ్యాచ్‌ అధికారులు లేకపోవడం, 1985 బ్యాచ్‌లో కేవలం 16 మందే ఉండటంతో పాటు సైబరాబాద్‌ కమిషనరేట్, ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో పోస్టులు పెరిగాయి. ఇలా ఈ రేంజ్‌కు చెందిన వారికి మిగిలిన వాటికి చెందిన వారి కంటే ముందు ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతులు వచ్చాయి.  

డీఎస్పీ ప్రమోషన్‌కు ఇదే ఆధారంగా... 
ఎవరైనా ఓ అధికారికి డీఎస్పీగా పదోన్నతి ఇవ్వాలంటే ఆయన ఏ బ్యాచ్‌కు చెందినప్పటికీ ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతి పొందిన తేదీనే ప్రామాణికం అవుతుంది. దీని ఆధారంగానే డీఎస్పీ పదోన్నతి జాబితా రూపొందుతుంది. హైదరాబాద్‌ రేంజ్‌లో ఉన్న అవకాశాలతో ఇక్కడి వారు ఇతర రేంజ్‌లకు చెందిన వారి కంటే త్వరగా డీఎస్పీలు అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్‌ కంట్రోలింగ్‌ అ«థారిటీగా ఉన్న ఏపీ పోలీసు విభాగం డీఎస్పీల సీరియారిటీ జాబితా రూపొందించింది. దీన్ని ఖరారు చేస్తూ 2018లో జీవె నెం.153 జారీ అయింది. దీనికి కొనసాగింపుగా 2022 డిసెంబర్‌ 29న జీవో నెం.74తో మరో జాబితా వచి్చంది. దీని ఆధారంగానే 80 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతులు రావడంతోపాటు కొందరికి ఐపీఎస్‌ కూడా ఖరారైంది. ఈ రెండు సందర్భాల్లోనూ కొందరు అధికారులు తాము మిగిలిన వారికంటే సీనియర్లమంటూ అభ్యంతరాలు చెప్పినా పసలేని కారణంగా పోలీసు విభాగం పరిగణలోకి తీసుకోలేదు.  

ఏడు నెలల్లో మారిపోయిన వ్యవహారం... 
ఇక్కడి వరకు వ్యవహారం పెద్దగా ఇబ్బందులు లేకుండా సాగిపోయినా.. ఆపై ఓ కీలక నేత జోక్యంగా కథ అడ్డం తిరిగింది. అనివార్య కారణాల నేపథ్యంలో ఓ రేంజ్‌కు చెందిన వారికి లబ్ధి చేకూర్చడానికి నడుంబిగించిన సదరు నేత గత ఏడాది జూలై 3న మరో పదోన్నతుల జాబితా రూపొందించారు. జీవో నెం.74కు కాస్త భిన్నంగా ఇది రూపొందటంతో హైదరాబాద్‌ రేంజ్‌ అధికారులు వెనుకబడిపోయారు. అప్పటికీ సంతృప్తి చెందని ఆ నేత ఈ నెల 9న మరో జాబితా వెలువడేలా చేశారు. దీంతో హైదరాబాద్‌ రేంజ్‌ అధికారుల పేర్లు మరింత కిందికి చేరిపోయారు. ఈ రెండు జాబితాలూ ఒకే డీఐజీ రూపొందించడం గమనార్హం. ఇందులో కొందరు అధికారులు ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతులు తేదీలు మార్చేశారు. దానికి ప్రామాణికం ఏమిటన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దీని ప్రభావంతో హైదరాబాద్‌ రేంజ్‌కు చెందిన అనేక మంది పదోన్నతి పొందకుండా పదవీ విరమణ చేసే పరిస్థితులు తలెత్తాయి. కేవలం 1989, 1991 బ్యాచ్‌లకే కాకుండా 1996, 1998, 2002, 2004 బ్యాచ్‌లకు చెందిన అధికారుల పైనా ఈ రాజకీయ క్రీనీడ ప్రభావం పడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement