పెంచికల్‌పేట్(సిర్పూర్): అడవుల జిల్లా కుమురంభీం ఆసిఫాబాద్‌లో అడవి పందులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలను ధ్వంసం చేయడంతోపాటు మనుషులపైనా దాడులకు తెగపడుతున్నాయి. రైతులు తమ విలువైన పంటలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అటవీశాఖ పరిహారం అందిస్తున్నామని చెబుతున్నా.. బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
పంటలు ధ్వంసం
జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగు చేస్తారు. పత్తి చేలు అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయి. దీంతో పందులు సీజన్ ముగిసే వరకు దాడులు చేస్తూ పత్తి చేలను ధ్వంసం చేశాయి. పలు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అడవి జంతువుల స్వైర విహారంతో చేతికందిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో సాగు చేసిన వరి కోతలు పూర్తయ్యాయి. దీంతో అడవి పందులు పత్తి, కంది పంటలపై పడ్డాయి. ఈ క్రమంలో పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాపలా కాస్తున్న సమయంలో రైతులపైనా దాడులు చేస్తున్నాయి.
పరిహారం కోసం ఎదురుచూపులు
పంటలకు కాపలా వెళ్లే సమయంలో అన్నదాతలు ఎక్కువగా అడవి పందుల దాడుల్లో గాయపడుతున్నారు. రెండు నెలల క్రితం పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన రైతు దూగుంట నారాయణ వరిపొలానికి వెళ్లిన సమయంలో అడవి పంది దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా తిర్యాణి మండలం గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్‌పైనా పందుల గుంపు దాడిచేసింది. వీటి భయంతో అన్నదాతలు, కూలీలు పంట చేలకు వెళ్లడానికి జంకుతున్నారు. నష్టపోయిన పంటలు, గాయపడిన వారికి అటవీశాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. క్షతగాత్రులకు గాయాల తీవ్రత ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పంట నష్టాన్ని వ్యవసాయాధికారులు అంచనా వేస్తే బాధితులకు సాయం అందించాలి. కానీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
దరఖాస్తు ఇవ్వాలి
అడవి పందుల దాడిలో పంటనష్టపోయిన రైతులు అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు పరిహారం కోసం నివేదిస్తాం. గాయపడిన వారికి పరిహారం అందించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరాలు అందించాం. నిధులు మంజూరు కాగానే బాధితులకు అందిస్తాం.
– అనిల్‌కుమార్, ఎఫ్‌ఆర్‌వో, పెంచికల్‌పేట్
పంట కాపలాకు వెళ్లిన రైతుపై దాడి
తిర్యాణి: అడవి పందుల దాడిలో ఒకరికి గాయాలైన ఘటన తిర్యాణి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్ గురువారం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా అడవి పందుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భీమేశ్ అరవడంతో పక్క చేనులో ఉన్న రైతులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.


