breaking news
wild boars
-
అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి చిరుతలు
-
ఆకలితోనే.. జనావాసాల్లోకి చిరుతలు
నల్లమల అటవీ అంతర్భాగంలో ఉన్న ప్రధాన శైవాలయ పట్టణాలైన శ్రీశైలం, మహానందిలో తరచూ చిరుత పులులు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం పాతాళగంగ మార్గంలో ఒక అర్చకుడి ఇంట్లో రాత్రి పూట చిరుత తిరుగాడటం ఆందోళన రేకెత్తించింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. చిరుతలు అడవులలో అత్యంత ఇష్టపడే ఆహార జంతువు అడవి పంది, దాని పిల్లలు. ఒక ఈతకు పదికి పైగా పిల్లలను ఈనే అడవి పందుల సంఖ్య నియంత్రణలో ఉంచడానికి ప్రకృతి చేసిన ఏర్పాటే చిరుత ఆహారపు అలవాటు. శ్రీశైలం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటి సంఖ్య హఠాత్తుగా తగ్గిపోయింది. దీంతో తరువాతి ఆహార ప్రాధాన్యత అయిన ఊరకుక్కల కోసం చిరుతలు శ్రీశైలం, సున్నిపెంటల వైపు రాసాగాయి. మరోపక్క శ్రీశైలం ఆలయ పట్టణంలో కుక్కల సంఖ్య పెరగడంతో ఆలయం అధికారులు వాటిని పట్టి, దూరంగా వదలి పెట్టారు. కుక్కలూ లభించకపోవడంతో చిరుత పులులు పెంపుడు కుక్కల కోసం ఇళ్లలోకి వస్తున్నాయి. – ఆత్మకూరు రూరల్అడవి పందులకేమైంది? నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో అడవి పందులు హఠాత్తుగా చనిపోవడం మొదలైంది. అడవిలో పందుల మృత కళేబరాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండడంతో ఎన్ఎస్టీఆర్ వన్యప్రాణి వైద్య నిపుణులు వాటికి పోస్ట్‌మార్టం చేశారు. కొన్ని శాంపిళ్లు ల్యాబ్‌లో పరిశీలించగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ఏఎస్ఎఫ్వీ) కారణమని తేలింది. శ్రీశైలం ఆలయ పట్టణానికి ఆనుకుని ఉండే సున్నిపెంట గ్రామంలో ఉన్న పెంపుడు పందుల ఫారాల నుంచి ఈ వైరస్ అడవి పందులకు సోకినట్లు తేలింది. బెంగళూరు వంటి నగరాల నుంచి పెంపకానికి తెచి్చన సీమ పందులలో ఉన్న ఏఎస్ఎఫ్ వైరస్ తొలుత వారి ఫారాలు, సమీపంలో ఉన్న ఊర పందులకు సోకింది. అవి అడవిలో ఆహారానికి వెళ్లినప్పుడు అడవి పందులకు సోకినట్లు చెబుతున్నారు.ఏమిటీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ ఏఎఫ్ఎస్వీ అన్నది ఆస్ఫరి్వరిడే కుటుంబానికి చెందిన ఒక పెద్ద డబుల్ స్టాండర్డ్ డీఎన్ఏ వైరస్. ఉప సహారా ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఈ వైరస్ పేలు, పందులు, బుష్పిగ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన పందులు అంతర్గత రక్తస్రావంతో (ఇంటర్నల్ బ్లీడింగ్) కూడిన జ్వరంతో మరణిస్తాయి. ఇది మానవులకు సోకదు.వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట 2003 డిసెంబర్ చివర్లో ఇది బయటపడింది. వెంటనే పశు సంవర్ధకశాఖ రంగంలోకి దిగింది. ప్రభుత్వం శ్రీశైలానికి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో మెడికల్ ఎమర్జెన్సీ విధించింది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (యానిమల్ హజ్బెండరీ) దృష్టికి కూడా వెళ్లింది. దీంతో శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు, చిన్నారుట్ల, నెక్కంటి, పాలుట్ల, పెచ్చెర్వు, తుమ్మలబయలు వంటి గిరిజన ప్రాంతాలను వైరస్ ఇన్ఫెక్టెడ్ ఏరియాగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న పందుల ఫారాలను తొలగించారు. ఊర పందులను దూరప్రాంతాలకు తరలించారు. చనిపోయిన అడవి పందుల కళేబరాలను తగలబెట్టడం ద్వారా వైరస్ విస్తరించకుండా చేయగలిగారు. దీంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. సంవత్సర కాలంగా చిరుత పులులు ఎక్కువగా జనవాసాల్లోకి వస్తుండటంతో ఇప్పుడు ఈ వైరస్ విషయం బయటకు వచి్చంది.ఆహారం కోసమే చిరుతలు ఊర్లోకి.. చిరుతలు అడవి పంది పిల్లలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌తో అవి ఎక్కువగా చనిపోవడంతో రెండో ప్రాధాన్యత అయిన కుక్కల కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ క్రమంలోని శ్రీశైలం, సున్నిపెంటలోకి తరచూ వస్తున్నాయి. – వి.సాయిబాబా, డిప్యూటి డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగాం అడవి పందులు పెద్ద సంఖ్యలో చనిపోవడానికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ కారణమని ఉన్నతాధికారులతో కలిసి చేసిన పరిశోధనలలో తేలింది. జనావాసాల్లో ఉన్న పందులలో కూడా మరణాలు కనిపించడంతో ఇది పూర్తిగా వాటివల్లే విస్తరించిందని స్పష్టమైంది. అన్నిరకాల చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తిని నియంత్రించ గలిగాం. ఈ వైరస్ గాలిలో మూడు సంవత్సరాల వరకు జీవించ గలుగుతుంది. ఆ తర్వాత వాతావరణంలో వేడికి చనిపోతుంది. – డాక్టర్ జుబేర్, వన్యప్రాణి వైద్య నిపుణులు, ఆత్మకూరు -
అడవి పందులు అంత డేంజరా?
మెల్బోర్న్: అడవి పందులు.. పంటలకు ఇవి కలిగించే నష్టం అంతా ఇంతా కాదు. అంతేకాకుండా స్థానిక వన్యప్రాణులకు ఇవి ముప్పుగా మారుతున్నాయి. భూగోళంపై జీవజాతుల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారుతున్న వాతావరణ మార్పులకు సైతం అడవి పందులు కారణమవుతున్నట్లు ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ట్రాక్టర్లతో నేలను దున్నినట్లుగా అడవి పందులు నేలను తవ్వేస్తుంటాయి. ఒక్క అంటార్కిటికా తప్ప ప్రపంచవ్యాప్తంగా అడవి పందులు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్రతి ఏటా తవ్వుతున్న భూవిస్తీర్ణం ఎంతో తెలుసా? తైవాన్ దేశ విస్తీర్ణంతో సమానం. భూమిలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అడవి పందుల తవ్వకం వల్ల ఏటా 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ భూమి నుంచి వెలువడి వాతావరణంలో కలుస్తోంది. ఇది 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్తో సమానం. ఒకప్పుడు యూరప్, ఆసియాకే పరిమితమైన అడవి పందులు క్రమంతా ఇతర ఖండాలకు సైతం విస్తరించాయి. ఆస్ట్రేలియాలో 30 లక్షల అడవి పందులు ఉన్నట్లు అంచనా. ఆస్ట్రేలియాలో ఇవి ఏటా 10 కోట్ల డాలర్ల మేర పంట నష్టం కలుగజేస్తున్నాయి. ఇక అమెరికాలో వీటి కారణంగా కేవలం 12 రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 27 కోట్ల డాలర్ల విలువైన పంట నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 672 రకాల వన్యప్రాణులు, మొక్కలకు అడవి పందులు పెద్ద ముప్పుగా తయారయ్యాయి. రాబోయే దశాబ్దాల్లో వీటి ఆవాస ప్రాంతాలు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాయి. వీటి సంతతి పెరిగితే మనుషుల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అడవి పందుల వల్ల పెరుగుతున్న కర్బన్ ఉద్గారాలపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. -
అడవి పంది.. ఆగమైతంది!
జూలై ఒకటిన తెల్లవారుజామున సిద్దిపేట మీదుగా వస్తున్న టాటా ఏస్ వాహనం జనగామ పట్టణంలోకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టింది. అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు వాహనంలో అడవి పందులను చూసి నివ్వెరపోయారు. వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చనిపోయిన 3 పందులను ఖననం చేసి, మిగిలిన 9 పందులను సమీపంలోని అడవుల్లో అధికారులు వదిలేశారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా కరీంనగర్–వరంగల్–ఖమ్మం రహదారిపై పోలీసులు ఓ వాహనాన్ని ఆపారు. అందులో 2 వరుసలుగా పందులున్నాయి. తొలుత సాధారణ పందులు అనుకున్న పోలీసులు తర్వాత దగ్గరగా చూసి ఆశ్చర్యపోయారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు వద్ద ఉండే వేటగాళ్ల నుంచి ఒక్కో అడవి పందిని రూ. 5 వేల చొప్పన కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని.. బెంగళూరు, హైదరాబాద్‌లోని రెస్టారెంట్లకు సరఫరా చేస్తారని విచారణలో తేలింది. సాక్షి, హైదరాబాద్: పంటలను నాశనం చేస్తున్నాయనే కారణంతో అడవి పందులను చంపేందుకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును కొందరు అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అడవి పందుల మాంసానికి అంతటా డిమాండ్ ఉండటంతో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు, తనిఖీలకు ఆస్కారంలేని హైదరాబాద్‌లోని హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. రోజూ సగటున 25 వాహనాలు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. పకడ్బందీగా రవాణా అడవి పందుల అక్రమ రవాణా వ్యాపారులు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. పందులను వేటాడి ప్రాణాలతోనే గమ్య స్థానాలకు చేర్చేలా ప్రత్యేక వ్యవస్థ నిర్మించుకున్నారు. పందులను వేటాడే నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి వారంలో ఓ రోజు కచ్చితంగా పందులను తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. వారి భాష, యాస కూడా వ్యాపారానికి ఉపయోగపడేలా జాగ్రత్త పడుతున్నారు. పందులు అరవకుండా మూతిని తాళ్లతో కట్టేస్తున్నారు. జిల్లా దాటగానే వాహనాలను మార్చేందుకు ప్రతి ప్రాంతానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూటే ఈ అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఆరాతీస్తే సాధారణ పందులని చెప్పి దాటవేస్తున్నారు. కొన్ని చోట్ల వారిని మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. రవాణాకు సాంకేతిక నైపుణ్యాన్నీ వాడుకుంటున్నారు. వేటాడి బంధించిన పందుల ఫొటోలను వ్యాపారులకు పంపండంతో పని మొదలవుతుంది. వ్యాపారులు అంగీకరించగానే ఒక్కో జిల్లా దాటుతూ, వాహనాలను మార్చుతూ అసలు సూత్రధారులు ప్రత్యక్షంగా లేకుండానే పని పూర్తవుతుంది. ఆహారం కోసం చంపితే నేరం అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా నుంచి పందుల రవాణా ఎక్కువగా జరుగుతోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలు ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లోని వ్యవసాయ పంటల్లోకి నిత్యం అడవి పందులు వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పంటలకు నష్టం చేస్తున్న సందర్భాల్లో అడవి పందులను చంపడం నేరం కాదు. ఆహారం కోసం చంపితే శిక్షార్హులు. చట్టంలోని 9, 39, 48, 49, 51 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. కానీ పంట నష్టం కారణం చూపి అక్రమార్కులు పందులను వేటాడుతున్నారు. వాట్సాప్‌లోనే అంతా.. అడవి పంది మాంసానికి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. పెద్ద పెద్ద హోటళ్లలోనూ అడవి పంది మాంసాన్ని ప్రత్యేక వంటకంగా చేస్తున్నారు. కొన్ని పెద్ద నగరాలు, పట్టణాల్లో ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి ఉదయమే వాటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో కిలో రూ. 500.. నగరాల్లో కిలో రూ. 800 చొప్పున మాంసాన్ని విక్రయిస్తున్నారు. బెంగళూరు నుంచి కవ్వాల్ వరకు అడవి పంది ఎలా ఉంది, దాని ధర ఎంత విషయాలన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయని, ఒప్పందం కుదరగానే రవాణా మొదలవుతుందని పోలీసులు చెబుతున్నారు. -
వన నర్సరీపై అడవి పందుల దాడి
ధారూరు : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల మొక్కలు పనికిరాకుండా పోయాయి. విత్తనం మొలకెత్తి పాలిథిన్ కవర్లలో మొక్కగా రూపుదిద్దుకుంటున్న ఈత మొక్కలను అర్ధరాత్రి అడవి పందులు గుంపు నాశనం చేసింది. అడవిలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వన నర్సరీలో జరిగిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. ధారూరు మండలంలోని రుద్రారం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ వన నర్సరీలో ఈ ఘటన చోటుసుకోగా అటవీశాఖ సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఫారెస్టు ఉన్నతాధికారులకు మాత్రం సమాచారం అందించారు. వివరాలిలా ఉన్నాయి. రుద్రారం సెంట్రల్ వన నర్సరీలో అల్లనేరేడు 50 వేలు, ఈత 50 వేలు, పండ్ల రకం, ఇతర రకాలకు చెందిన లక్ష మొక్కలను నాటేందుకు పాలిథిన్ కవర్లలో విత్తనాలను పెట్టి పెంచుతున్నారు. 5బై6 సైజు పాలిథిన్ కవర్లలో వేసిన విత్తనాలు అరడుగు వరకు మొక్కలుగా పెరిగాయి. అయితే అర్ధరాత్రి అడవి పందుల గుంపు వన నర్సరీపై దాడిచేసి కవర్లలో ఉన్న అన్ని రకాల విత్తనాలను తినేందుకు ప్రయత్నిస్తూ మొక్కలున్న ప్రతి కవర్‌ను చిందర ‡వందరగా చేసేశాయి. పాలిథిన్ కవర్లలో ఉన్న మొక్కలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పందులు నాశనం చేసిన విషయం తెలియని సిబ్బంది, పనులు చేసే కూలీలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎవరైనా గిట్టని వారు చేసిన పనేనని తొలుత భావించినా అడవి పందుల కాలి గుర్తులు ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ధారూరు ఫారెస్టు రేంజర్ సీహెచ్ వెంకటయ్యగౌడ్ సిబ్బందితో వెళ్లి పాలిథిన్ కవర్లలో ఉన్న మొక్కలన్ని ధ్వంసం కావడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విత్తనాలతో మొక్కలను పెంచుతున్న వన నర్సరీపై ఇలాగే అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేస్తే పరిస్థితి ఏంటనే మీమాంసలో అధికారులు పడినట్లు తెలిసింది. ఆందోళనలో రైతులు ఇటీవల వేసిన వివిధ రకాల విత్తనాలు వర్షాలు లేక మొలకెత్తకుండా భూమిలోనే ఉన్నాయి. అడవి పందులు సాళ్లను మూతితో తోస్తూ భూమిలోని విత్తనాలను తినేస్తున్నాయి. దీంతో అసలే వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు పందుల బెడద నిద్ర లేకుండా చేస్తోంది. భూమిలో ఉన్న విత్తనాలు వర్షాలు పడితే మొలకెత్తుతాయని ఆశిస్తున్న రైతులకు అడవి పందుల బెడద ఆశనిపాతంలా దాపురించిందని వాపోతున్నారు. అడవి పందులు భూమిలోనే మట్టిని వదిలేసి వేసిన విత్తనాలే తినేస్తున్నాయని రైతులు తెలిపారు. ఉన్నతాధికారికి చెప్పాం.అడవి పందుల గుంపులు వన నర్సరీలోని 2 లక్షల పాలిథిన్ కవర్లలో ఉన్న మొక్కలను ధ్వంసం చేశాయి. వాటి గురించిన వివరాలను ఉన్నతాధికారులకు చెప్పాం. అడవి పందులు సమీపంలో ఉన్న వన నర్సరీలోకి తరచూ ప్రవేశించి ధ్వంసం చేస్తున్నాయి. పందులు గుంపులు గుంపులుగా రావడంతో కాపలా సిబ్బంది ఏం చేయలేని పరిస్థితి. అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే దాడి చేస్తున్నాయి. – రేంజర్, సీహెచ్ వెంకటయ్యగౌడ్ రుద్రారం -
అడవి పందులు, కోతుల పీడ విరగడయ్యేదెలా?
అడవిలోని పందులు, కోతుల వంటి జంతువులకు ఆహార కొరత ఏర్పడితే ఏమవుతుంది? అవి దగ్గర్లోని పంట పొలాలపై వచ్చి పడుతూ ఉంటాయి. అడవి బలహీనమవుతున్న కొద్దీ పంటల మీద వీటి దాడి తీవ్రమవుతూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో రైతులకు అడవి పందులు, కోతుల బెడద గత ఐదారేళ్ల నుంచి పెను సమస్యగా పరిణమించింది. వీటిని పారదోలి పంటలను కాపాడుకునే పద్ధతులపై ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్నది. విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అడవి పందులు, కోతులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలేందుకు అనేక పద్ధతులను రూపొందించింది. ఇవి రైతులకు ఊరటనిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెంచుకుంటున్న అడవి పందులు, కోతులను నిర్మూలిస్తే తప్ప తమ కష్టాలు తీరవని కొందరు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటి కాల్చివేత నేరం. కిం కర్తవ్యం?! అడవి పందులు, కోతుల సంఖ్య ఎంత? వీటి వల్ల ఏయే పంటల్లో జరుగుతున్న నష్టం ఎంత? స్పష్టంగా తెలియదు! గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకావడం లేదన్నది ఒక వాదన. సమస్య తీవ్రతపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించినప్పుడే వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొనే మరింత సమర్థవంతమైన మార్గాలు వెదకడం సాధ్యమవుతుందని అఖిల భారత సకశేరుక చీడల(వెర్బట్రేట్ పెస్ట్) యాజమాన్య విభాగం అధిపతి డా. వాసుదేవరావు స్పష్టం చేస్తున్నారు. పాలకులారా వింటున్నారా..?! అడవి పందులు పంటల వాసనను పసిగట్టి పొలాలపై దాడి చేస్తుంటాయి.. అడవి పల్చబడిపోవటం వల్ల వ్యవసాయం కూడా దెబ్బతింటున్నది. అడవిలో మానులు నరికివేతకు గురవడంతో అడవి జంతువులు, పక్షులకు ఆహారం దొరకడం లేదు. దాంతో అవి ఆకలి తీర్చుకోవడానికి రైతుల పంట పొలాలపైకి దాడి చేస్తున్నాయి. ఇందువల్లనే అడవి పందులు, కోతుల వంటి జంతువుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులకు జరుగుతున్న పంట నష్టం ఏటేటా పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. అయితే, ఈ సమస్యపై పాలకులు అంతగా దృష్టి పెట్టకపోవటంతో రైతులకు కష్టనష్టాలే మిగులుతున్నాయి. ∙మన దేశంతోపాటు బర్మా, అమెరికా, రష్యా తదితర దేశాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో వీటిని కాల్చి లేదా విషం పెట్టి చంపుతున్నారు. కానీ, మన దేశంలో వివిధ కారణాల వల్ల వన్యప్రాణి సంరక్షణకే అధికంగా మొగ్గు చూపుతున్నాం ► అడవి పందులు సామాన్యంగా వర్షాకాలం ముగిసిన తర్వాత పంట పొలాలపై ఎక్కువగా దాడి చేస్తుంటాయి. గడ్డి భూములు, అటవీ పరిసర ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, పంట పొలాల సమీపంలో రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉంటాయి ► అనేక రకాల పంటలు, దుంపలు, మట్టిలోని వేరు పురుగులు, పాములు, చిన్న జంతువులను తింటాయి. కలుపు మొక్క తుంగ గడ్డలను ఇష్టపడతాయి ► పరిపక్వ దశలోని మొక్కజొన్నకు 23–47%, వేరుశనగకు 20–48%, చెరకుకు 18–36%, వరికి 11–30%, జొన్నకు 10–20% చొప్పున పంట దిగుబడి నష్టం కలిగిస్తాయి. కంది, పెసర, వరి, శనగ, కూరగాయ పంటలకు కూడా అడవి పందులు నష్టం చేస్తాయి ► ఘాటైన వాసనను వెదజల్లే పసుపు, అల్లం, వాము, ఆవాలు.. ముళ్లను కలిగి ఉండే వాక్కాయ, కుసుమ, ఆముదం పంటల జోలికి అడవి పందులు రావు ► పంటలకు నష్టం కలిగించడంతోపాటు వైరస్ సంబంధమైన జబ్బులను ఇతర జంతువుల్లో వ్యాపింప చేస్తాయి ► అడవి పందుల్లో వాసన పసిగట్టే గుణం ఎక్కువ. కాబట్టి, దూరం నుంచే ఎక్కడ ఏ పంట ఉందో గ్రహిస్తాయి. చూపు, వినికిడి శక్తి తక్కువ ► ఆహార సేకరణకు 15–35 వరకు కలసి గుంపులుగా సంచరిస్తాయి. ఆడ పందులు నాయకత్వం వహిస్తాయి ► అడవి పందులు వర్షాకాలంలో 4–12 పిల్లలను కంటాయి ∙అడవి నుంచి బయటకు వచ్చిన అడవి పందులు సర్కారు తుమ్మ చెట్లలో నివాసం ఏర్పాటు చేసుకొని.. రాత్రుళ్లు పంటల పైకి దాడి చేస్తున్నాయి. ఆర్తనాదాల యంత్రంతో అడవి పందులకు చెక్ అడవి పందులను సమర్థవంతంగా పారదోలేందుకు శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను రూపొందించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినది ‘ఆర్తనాదాల యంత్రం’(బయో అకౌస్టిక్స్). బెంగళూరుకు చెందిన గ్రుస్ ఎకోసైన్సెస్ సంస్థతో కలసి దీన్ని రూపొందించారు. గత మూడేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో 155 మంది రైతుల క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. రైతుల అనుభవాలు, సూచనలకు అనుగుణంగా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచారు. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున త్వరలో కంపెనీతో అవగాహన ఒప్పందం జరగబోతోంది. పులి, అడవి పంది తదితర అటవీ జంతువులు ఆపదలో ఉన్నప్పుడు బిగ్గరగా అరిచే ఆర్తనాదాలను 33 నిమిషాలపాటు రికార్డు చేశారు. ప్రతి జంతువు ఆర్తనాదాలకు మధ్యలో కొద్ది నిమిషాలపాటు.. ఇవి నిజమైన ఆర్తనాదాలేనని భ్రమింపజేయటం కోసం.. విరామం ఇచ్చారు. ఆర్తనాదాల యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి లేదా మరేదైనా కర్రకు బిగించవచ్చు. విద్యుత్‌తో నడుస్తుంది. కరెంట్‌పోతే సౌరశక్తితో నడుస్తుంది. బ్యాటరీ 12–14 గంటలు పనిచేస్తుంది. జీఎస్ఎం సిమ్ టెక్నాలజీని వాడారు. రైతు పొలానికి వెళ్లకుండానే సెల్ ద్వారా ఆన్/ ఆఫ్ చేయొచ్చు. అరుపులు బాగా బిగ్గరగా (42–37 డెసిబుల్స్) 10–15 ఎకరాల వరకు వినిపిస్తాయి. అడవి పందులను అరికట్టే జీవకంచెలు: మొక్కజొన్న, జొన్న పంటల చుట్టూ ఆముదం మొక్కలను 4 వరుసలు దగ్గర దగ్గరగా విత్తుకొని అడవి పందులు లోపలికి రాకుండా చూడవచ్చు. ఆముదం పంటపై ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. వేరుశనగ పొలానికి చుట్టూ కుసుమ పంటను 4 వరుసలు వత్తుగా విత్తుకోవాలి. పొలం చుట్టూతా దగ్గర దగ్గరగా వాక్కాయ చెట్లు పెంచటం ద్వారా పొలంలోపలికి అడవి పందులు రాకుండా అడ్డుకోవచ్చు. వాక్కాయ చెట్టుకు ఉండే ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. ఈ పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఇనుప ముళ్ల కంచెలు: చిన్న కమతాల్లో పంటలు పండించుకునే రైతులు ముళ్ల కంచెలు వేసుకోవడం ద్వారా అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. బార్బ్‌డ్ వైర్‌తో 3 వరుసలుగా పంట చుట్టూ కంచెగా నిర్మించాలి. 2 అడుగుల గుండ్రటి కంచెను పంట చుట్టూ వేయాలి. దీన్నే పోలీస్ కంచె అని కూడా అంటారు. చైన్ లింక్ ఫెన్స్‌ను పొలం చుట్టూ వేసుకొని పంటను రక్షించుకోవచ్చు. భూమి లోపలికి 9 అంగుళాల మేరకు దీన్ని పాతాలి. లేకపోతే కంచె కింద మట్టిని తవ్వి.. కంత చేసుకొని పొలంలోకి పందులు వస్తాయి. హెచ్.డి.పి.ఇ. చేపల వలను పొలం చుట్టూ వేసుకోవచ్చు. 3 ఇంచుల కన్ను ఉండే వలను వాడాలి. 3 అడుగుల ఎత్తు, 2 అడుగుల వలను భూమి మీద పరచి.. మేకులు కొట్టాలి. ఈ వలలో అడవి పందుల గిట్టలు ఇరుక్కుంటాయి. కందకాలు: పొలం చుట్టూ కందకాలు తవ్వటం ద్వారా అడవి పందులను అడ్డుకోవచ్చు. కందకం 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు ఉండాలి. పొలం చుట్టూతా ఒకటే కందకం తవ్వాలి. ఎక్కడా గట్టు వదలకూడదు. పొలం గట్టుకు అడుగు దూరంలో తవ్వాలి. పందులు దూకి రాలేవు. వాన నీటి సంరక్షణ జరుగుతుంది. పక్క పొలాల నుంచి పురుగులు కూడా మన పొలంలోకి రావు. విషగుళికలు: పొలం చుట్టూ కర్రలు పాతి ఫోరేట్ గుళికలను గుడ్డ మూటల్లో వేలాడగట్టాలి. 200 గ్రా. గుళికలను కిలో ఇసుకలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 100 గ్రా. చొప్పున తీసుకొని చిన్న, చిన్న రంధ్రాలు పెట్టిన గుడ్డలో మూట గట్టాలి. 3 – 5 మీటర్ల దూరంలో కర్రలు పాతి వాటికి వేలాడ గట్టాలి.ఈ గుళికల ఘాటు వాసన పందులు పంట వాసనను పసిగట్టకుండా గందరగోళపరుస్తాయి. కాబట్టి పొలంలోకి రావు. కోడిగుడ్డు ద్రావణం పిచికారీ: పంట చుట్టూ అడుగు వెడల్పున నేలపై గడ్డిని తవ్వేసి.. కోడిగుడ్డు ద్రావణాన్ని పిచికారీ చేస్తే పొలంలోకి పందులు రావు. కుళ్లిన లేదా మామూలు కోడిగుడ్లను పగలగొట్టి ఒక పాత్రలో పోసుకోవాలి. 25 మి.లీ. కోడిగుడ్డు ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పొలం చుట్టూ పిచికారీ చేయాలి. పంది కొవ్వు + గంధకం పూత: పొలం చుట్టూ 3 వరుసల నిలువు కంచె మాదిరిగా కొబ్బరి తాళ్లు కట్టాలి. పంది కొవ్వులో గంధకాన్ని 3:1 నిష్పత్తిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని తాళ్లకు పూయాలి. పందులైనా ఇతర జంతువులైనా ఒక గుంపు ఉన్న చోటకు మరొక గుంపు రావు. పంది కొవ్వు–గంధకం వాసన తగలగానే ఇక్కడ వేరే గుంపు ఉందని భ్రమపడి పందులు వెళ్లిపోతాయి. వెంట్రుకలు: మనుషులు క్షవరం చేయించుకున్నప్పుడు రాలే వెంట్రుకలు తీసుకువచ్చి.. పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పున వేయాలి. గడ్డిని చెక్కి శుభ్రం చేసిన నేలపై వెంట్రుకలు వేయాలి. అడవి పందులు ముట్టెతో వాసన చూసినప్పుడు ఈ వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి గుచ్చుకుంటాయి. దాంతో వెనుదిరిగి వెళ్లిపోతాయి. కోతులకు తిండి పెట్టటం మానితే 30% పంట నష్టం తగ్గుతుంది! తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు అడవి పందులతోపాటు కోతుల బెడద ఎక్కువగా ఉంది. వీటి సంతతి వేగంగా పెరుగుతుండటంతో పంట నష్టం ఏటేటా పెరుగుతున్నది. అడవుల్లో, రోడ్ల పక్కన వివిధ రకాల పండ్ల చెట్లను అభివృద్ధి పేరిట నరికివేస్తుండటం వల్ల కోతులు ఆహారం కోసం పంటల మీదకు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో కొన్ని రకాల సెంటిమెంట్ల కారణంగా కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తినిపించడం కూడా కోతుల సంతతి తామరతంపరగా పెరిగి సమస్యాత్మకంగా తయారవుతున్నదన్నది నిపుణుల మాట. కోతులకు మనుషులు ఆహారం వేయటం మానేస్తే వీటి మూలంగా జరుగుతున్న పంట నష్టం 30% మేరకు తగ్గిపోతుందని గత రెండేళ్లుగా ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్న ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యశాస్త్రవేత్త డా. వాసుదేవరావు చెప్పారు. మన ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కోతులకు తోక పొట్టిగా, ముడ్డి ఎర్రగా ఉంటుంది. ఆగస్టు – అక్టోబర్ నెలల మధ్య ఇవి పిల్లలను పెడుతూ ఉంటాయి. ఆడ కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వీటి సంతతి వేగంగా పెరగటానికి ప్రధాన కారణమవుతోంది. సాధారణంగా ఒక మగ కోతికి 2.8 ఆడ కోతుల చొప్పున ఉండాలి. కానీ, తాము నిర్వహించిన సర్వేలో ప్రతి మగ కోతికి 6.7 ఆడకోతులు ఉన్నాయని తేలినట్లు డా. వాసుదేవరావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కోతులు తినని పంటలు: కోతుల బెడద బాగా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాటికి నచ్చని పంటలను సాగు చేయటం మేలని డా. వాసుదేవరావు సూచిస్తున్నారు. పసుపు, అల్లం, కంద, చేమగడ్డ, బంతి, మిర్చి, ఆవాలు, సజ్జ వంటి పంటల జోలికి కోతులు రావని ఆయన తెలిపారు. ఇతర పంటలను సాగు చేసే రైతులు కోతులు తినని పంటలను సరిహద్దు రక్షక పంటలుగా వత్తుగా కొన్ని సాళ్లు వేసుకోవటం వల్ల ప్రయోజనం ఎంత వరకూ ఉంటుందన్న కోణంలో అధ్యయనం జరుగుతోంది. రోడ్ల వెంట చెట్ల నరికివేతతో సమస్య తీవ్రం..: మన పూర్వీకులు రోడ్లకు ఇరువైపులా నేరేడు, చింత, మద్ది, రావి తదితర పండ్ల జాతులు, మోదుగ, బూరుగ వంటి మకరందాన్ని అందించే పూల చెట్లను ఎంతో ముందు చూపుతో నాటేవారు. ఆ చెట్లపై ఆధారపడి కోతులు ఆకలి తీర్చుకుంటుండేవి. అయితే, రోడ్ల విస్తరణలో భాగంగా మన ముందు తరాల వారు నాటిన పెద్ద చెట్లన్నిటినీ నరికేశాం. అదే విధంగా అడవిలో కూడా పెద్ద మాన్లు నరికివేతకు గురయ్యాయి. చిన్న చెట్లతో కూడిన అడవులే పల్చగా మిగిలాయి. దీంతో కోతులకు చెట్ల ద్వారా ఆహారం లభించక పంటల మీదే ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి వచ్చిందని డా. వాసుదేవరావు అంటున్నారు. హరితహారం, సామాజిక అడవుల పెంపకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతర పరాయి ప్రాంతపు వృక్ష జాతులకు బదులు సంప్రదాయక పండ్ల జాతుల మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన సూచిస్తున్నారు. వాణిజ్యదృష్టితో టేకు, యూకలిప్టస్ వంటి మొక్కలను నాటడం కన్నా పండ్లు, పూల జాతి చెట్లను ఎక్కువగా పెంచి, కోతులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. ప్రణాళికలన్నీ మనుషుల ఆర్థిక అవసరాలు, సౌలభ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచిస్తున్నారని.. సకల జీవరాశి మనుగడను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ఆయన సూచన. సోలార్ ఫెన్సింగ్: కోతులు, అడవి పందులు పంటను పాడు చేయకుండా పొలం చుట్టూ జీఏ వైరుతో సోలార్ ఫెన్సింగ్ వేసుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న పొలాలకు ఇది ఉపకరిస్తుంది. ఇది షాక్ కొడుతుంది, అయితే చనిపోయే అంత తీవ్రత ఉండదు. కాబట్టి, జంతువులు బెదిరి పారిపోతాయి. ఎకరానికి రూ. 15 వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్తనాదాల యంత్రాన్ని కూడా ఈ సోలార్ ఫెన్సింగ్‌కు అనుసంధానం చేసే యోచన ఉందని డా. వాసుదేవరావు తెలిపారు. కోతులను, పక్షులను పారదోలే గన్: కోతులను, పక్షులను బెదరగొట్టి పారదోలటానికి నల్లని పెద్ద తుపాకీని డా. వాసుదేవరావు రూపొందించారు. అనేక పరీక్షల అనంతరం, ప్రయోగాత్మకంగా వాడి చూసిన రైతుల అనుభవాలను బట్టి దీన్ని మెరుగుపరుస్తున్నారు. కోతుల మీదకు ఈ తుపాకీతో పేపర్ బాల్స్‌ను ప్రయోగిస్తే.. దాని నుంచి పెద్ద శబ్దం వస్తుంది. బాల్స్ దెబ్బ తిన్న కోతులు మళ్లీ ఆ పొలం వైపు రావని చెబుతున్నారు. ప్రయోగాలు పూర్తయిన తర్వాత రైతులకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. అడవి పందులు కోతుల లెక్కలు తీయాలి అడవి పందులు, కోతులు తదితర అటవీ జంతువులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం మనుషులమే. కాబట్టి వాటి ఆవాస ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ ఆహార పంటలను పండిస్తూ వన్య జీవుల పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా గుర్తించి నిర్వర్తించటం మన కర్తవ్యం. జంతువులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలే పద్ధతులపై పరిశోధనలు చేపట్టాం. వన్య ప్రాణులకు ముప్పు కలిగించని పర్యావరణ హిత పద్ధతులను రూపొందిస్తున్నాం. వాటికి పునరావాస ప్రాంతాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా వివిధ వన్యజాతులు మనుగడ సాగించడానికి అనువైన పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా రైతులోకానికి కూడా మేలు జరుగుతుంది. అభివృద్ధి పేరిట వన్యజీవుల ఆవాసాలలోకి చొచ్చుకొని పోయిన మానవులు వన్య జీవుల ఉనికిని ప్రశ్నిస్తున్నారు. సమస్త జీవకోటికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కును కాలరాసే అధికారం మానవునికి నిక్కచ్చిగా లేదు. మానవజాతి ఇప్పటికైనా వన్యజీవుల ఆవాస ప్రాంతాలను ధ్వంసం చెయ్యకుండా.. వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలి.. అడవి పందులు, కోతులు ఎన్ని ఉన్నాయి? వీటి వల్ల పంటలకు జరుగుతున్న నష్టం ఎంత? వంటి విషయాలపై ఇప్పటి వరకు అధికారిక అంచనాలు అందుబాటులో లేవు. ప్రభుత్వాలు పూనికతో కచ్చితమైన గణాంకాలను సేకరిస్తే.. అడవి పందులు, కోతుల బారి నుంచి పంటలను పూర్తిగా కాపాడుకోవటం సాధ్యమవుతుంది. అడవిలో పులులు, చిరుత పులుల మాదిరిగా అడవి పందులు, కోతుల కచ్చితమైన గణాంకాల సేకరణ అసాధ్యమేమీ కాదు. గణాంకాలు సేకరిస్తే.. పంట నష్టాలను పూర్తిగా నివారించటం సాధ్యమవుతుంది. ఆర్తనాదాల యంత్రం వరి పంటను కాపాడింది! 4 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశాను. పంట వేసిన 30 రోజుల తర్వాత ప్రొ. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదం యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి బిగించాను. అడవి జంతువుల ఆర్తనాదాలను వినిపించటం ద్వారా అడవి పందులు పంట జోలికి రాకుండా ఇది కాపాడింది. ఈ యంత్రం లేకపోతే ఎకరానికి కనీసం రూ. 5 వేల పంట నష్టం జరిగి ఉండేది. పదేళ్ల నుంచి అడవి పందులతోపాటు కోతుల సమస్య కూడా బాగా పెరిగిపోయింది. మూసీ నదికి అటూ ఇటూ ఉన్న గ్రామాల్లో సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోవటానికి కూడా కోతుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప్పు చేపల వాసనకు కోతులు పరారీ! మా ఇంటి పెరట్లో జామ, మామిడి, సీతాఫలం, నిమ్మ వంటి అనేక పండ్ల చెట్లున్నాయి. కాయలను కోతులు బతకనివ్వటం లేదు. ఐదారు ఉప్పు చేపలను గుడ్డలో మూటలు కట్టి నెల క్రితం 6 చోట్ల వేలాడదీశాను. కోతులు ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయో అక్కడ కట్టాను. అప్పటి నుంచి కోతులు ఆప్రాంతానికి వచ్చినా మా చెట్ల మీదకు రాలేదు. ఉప్పు చేపల వాసనతో తమకు ముప్పు పొంచి ఉందని భీతిల్లి కోతులు వెళ్లిపోతున్నాయి. ఈ చేపలను వాసన తగ్గిపోయిన తర్వాత రెండు నెలలకోసారి మార్చాలి. వర్షాకాలంలో నెలకోసారి మార్చాలి... మా తోటకు అడవి పందుల బెడద ఉంది. పంది కొవ్వు+గంధకం మిశ్రమంలో తాడును ముంచి.. ఆ తాళ్లను వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న ముళ్ల కంచెకు కట్టాం. తల వెంట్రుకలను సేకరించి పొలం చుట్టూ వేసిన తర్వాత అడవి పందులు రావటం లేదు. అడవి పందులు పంటలను బతకనివ్వటం లేదు.. ఎమ్మే, బీఈడీ చదివా. ఉద్యోగం రాలేదు. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఐదారేళ్ల నుంచి అడవి పందుల సమస్య పెరుగుతూ వచ్చింది. అడవిలో తినటానికి గడ్డల్లేక పొలాల మీదకు వస్తున్నాయి. ఏ పంట వేసినా కష్టంగానే ఉంది. మొదట్లో మొక్కజొన్న కంకులను మాత్రమే తినేవి. ఇప్పుడు వరి కంకులను, చివరికి పత్తి కాయలను కూడా నమిలేస్తున్నాయి. అన్ని ఊళ్లలో వీటి సంఖ్య బాగా పెరిగిపోయింది. సంవత్సరం క్రితం శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదాల యంత్రాన్ని 8 ఎకరాల వరి పొలంలో పెట్టా. అడవి పందులు రాలేదు. పొలం చుట్టూ వేసుకోవటానికి ఫెన్సింగ్ జాలీని ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వాలి. కొరకరాని కొయ్యలుగా మారిన అడవి పందులను చంపటమే శాశ్వత పరిష్కారం. – తోట రఘు (81848 60707), రైతు, కుంటాల, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం – డా. వైద్యుల వాసుదేవరావు (94404 11166), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ – కాల్య రవికుమార్ (80749 19204), రైతు, శోభనాద్రిపురం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం – ప్రవీణ్‌కుమార్ రెడ్డి, రైతు, (94924 23875), పెబ్బేరు, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రం కథనం: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అడవి పందితో ఒళ్లు గగుర్పొడిచే..
సికావావో, ఇండోనేషియా : సాధారణంగా గొడవపడుతుంటే సర్దుమణిగేలా చేయడం మానవ నైజం. కానీ, అదే మనుషులు తమ వెర్రి ఆనందం కోసం వింత వినోదాల పేరిట అటవీ జంతువులకు పెంపుడు జంతువులకు ఘర్షణ పెట్టి వాటి మధ్య రక్తం ఏరులై పారుతున్నా చూసి ఆనందిస్తుంటే దానికి ఏమని పేరుపెట్టాలి. ఇండోనేషియాలోని పశ్చిమ జావా దీవుల్లో ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతుందట. వన్యమృగ ప్రేమికులు, సామాజిక ఉద్యమకారులు వద్దని వారిస్తున్నా అలాగే ఒక సంప్రదాయంగా చేస్తుంటారట. తమ పొలాలను నాశనం చేసే అడవి పందులను బంధించి ఓ చిన్న నీటి మడుగులో పెట్టి చుట్టూ కంచె ఏర్పాటుచేస్తారు. వెర్రెత్తిన కోపంతో ఉన్న కుక్కలకు, అడవి పందులకు మధ్య పోరాటం పెడతారు. ఇందుకోసం తమ కుక్కలకు ప్రత్యేకంగా తర్ఫీదునివ్వడంతోపాటు గెలిచే కుక్కలకు పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ కూడా ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే అక్కడి వారు తమ కుక్కలను మన తెలుగు ప్రాంతాల్లో పందెం కోళ్లను మేపినట్లు మేపుతుంటారన్నమాట. అలా పెంచిన కుక్కలను రిజిస్ట్రేషన్ చేసుకొని వంతులవారిగా సీరియల్లో ఉండి అప్పటికే దెబ్బతిని ఉన్న అడవి పందులపైకి వదులుతారు. దాంతో వాటి మధ్య భీకర పోరు జరుగుతుంతూ చప్పట్లు విజిల్స్‌తో ఆనందిస్తుంటారు. ఈ పోరాటంలో పందులైనా చనిపోవచ్చు.. లేదా కుక్కలైనా చనిపోవచ్చు. ఏది చనిపోయినా వీరి కేరింతలు మాత్రం అస్సలు ఆగవు. దీనిపై ఎన్నిసార్లు సామాజిక ఉద్యమకారులు పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. 1960లో బోర్ ఫైటింగ్ పేరుతో బాంబూలు ఏర్పాటుచేసిన రాక్షస క్రీడ ఇప్పటికీ కొనసాగుతోంది. -
అడవి పందులు దూసుకురావడంతో..
అడవి పందులు అకస్మాత్తుగా జీపును ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ విషాదం నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం సంభాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొంతగల్ నుంచి బీర్కూట్ వరకూ కొత్త కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది.. పనులు ముగించుకొని జీపులో తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా.. అడవి పందులు రోడ్డుపైకి దూసుకొచ్చి జీపును ఢీకొన్నాయి. జీపు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టుంది. ఈ ప్రమాదంలో మనోహర్(26) అనే యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. సురేష్ కుమార్, ఆదిత్య లకు తీవ్ర గాయాలయ్యయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పందులను ఢీకొన్న స్పైస్‌జెట్ విమానం
సరిగ్గా రన్‌వే మీద దిగబోతుండగా.. అడవి పందులు అడ్డు రావడంతో వాటిని ఢీకొన్న స్పైస్‌జెట్ విమానం ఒకటి దారుణంగా దెబ్బతింది. 49 మంది ప్రయాణికులతో కూడిన ఈ విమానం జబల్పూర్లోని డుమ్నా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రన్‌వే మీద నుంచి విమానం పక్కకు వెళ్లిపోతున్నా, దాన్ని పైలట్ ఎలాగోలా నియంత్రించగలిగారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. కెప్టెన్ అమర్త్య బసుకు 10 వేల గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉందని, ఆయనవల్లే భారీ ప్రమాదం తప్పిందని స్పైస్ జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 49 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, విమానానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని తెలిపారు. ముంబై నుంచి జబల్పూర్ వస్తున్న ఈ విమానం ల్యాండ్ అవుతుండగా అడవిపందుల గుంపు ఒకేసారి రన్‌వే మీదకు వచ్చేసిందని, దాంతో విమానం రన్‌వే నుంచి పక్కకు దిగిపోయిందని తెలిపారు. కొన్ని అడవిపందులు ఈ ప్రమాదంలో చనిపోయాయి. రాత్రిపూట కావడం, విమానాశ్రయం సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్‌కు రంధ్రం ఉండటంతో అడవిపందులు లోపలకు వచ్చేశాయని చెబుతున్నారు. ఇంతకుముందు 2014 నవంబర్ నెలలో సూరత్ విమానాశ్రయం రన్‌వే మీద స్పైస్ జెట్ విమానం ఓ గేదెను ఢీకొంది.