అడవి పంది.. ఆగమైతంది!

Illegally Moving Wild boars Are In telangana - Sakshi

యథేచ్ఛగా వేట.. అక్రమ రవాణా 

మాంసానికి డిమాండ్‌ పెరగడంతో

 హైదరాబాద్, బెంగళూరు హోటళ్లకు స్మగ్లింగ్‌ 

వాహనాలు మార్చుతూ రాత్రిపూట రవాణా 

వేట వివరాలు, వ్యాపారం అంతా వాట్సాప్‌లోనే

కేజీ మాంసం గ్రామాల్లో రూ. 500, నగరాల్లో రూ. 800

జూలై ఒకటిన తెల్లవారుజామున సిద్దిపేట మీదుగా వస్తున్న టాటా ఏస్‌ వాహనం జనగామ పట్టణంలోకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టింది. అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు వాహనంలో అడవి పందులను చూసి నివ్వెరపోయారు. వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చనిపోయిన 3 పందులను ఖననం చేసి, మిగిలిన 9 పందులను సమీపంలోని అడవుల్లో అధికారులు వదిలేశారు. 

రోజువారీ తనిఖీల్లో భాగంగా కరీంనగర్‌–వరంగల్‌–ఖమ్మం రహదారిపై పోలీసులు ఓ వాహనాన్ని ఆపారు. అందులో 2 వరుసలుగా పందులున్నాయి. తొలుత సాధారణ పందులు అనుకున్న పోలీసులు తర్వాత దగ్గరగా చూసి ఆశ్చర్యపోయారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు వద్ద ఉండే వేటగాళ్ల నుంచి ఒక్కో అడవి పందిని రూ. 5 వేల చొప్పన కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని.. బెంగళూరు, హైదరాబాద్‌లోని రెస్టారెంట్లకు సరఫరా చేస్తారని విచారణలో తేలింది.

సాక్షి, హైదరాబాద్‌: పంటలను నాశనం చేస్తున్నాయనే కారణంతో అడవి పందులను చంపేందుకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును కొందరు అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అడవి పందుల మాంసానికి అంతటా డిమాండ్‌ ఉండటంతో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు, తనిఖీలకు ఆస్కారంలేని హైదరాబాద్‌లోని హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. రోజూ సగటున 25 వాహనాలు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి.  

పకడ్బందీగా రవాణా 
అడవి పందుల అక్రమ రవాణా వ్యాపారులు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. పందులను వేటాడి ప్రాణాలతోనే గమ్య స్థానాలకు చేర్చేలా ప్రత్యేక వ్యవస్థ నిర్మించుకున్నారు. పందులను వేటాడే నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి వారంలో ఓ రోజు కచ్చితంగా పందులను తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. వారి భాష, యాస కూడా వ్యాపారానికి ఉపయోగపడేలా జాగ్రత్త పడుతున్నారు. పందులు అరవకుండా మూతిని తాళ్లతో కట్టేస్తున్నారు. జిల్లా దాటగానే వాహనాలను మార్చేందుకు ప్రతి ప్రాంతానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూటే ఈ అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఆరాతీస్తే సాధారణ పందులని చెప్పి దాటవేస్తున్నారు. కొన్ని చోట్ల వారిని మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. రవాణాకు సాంకేతిక నైపుణ్యాన్నీ వాడుకుంటున్నారు. వేటాడి బంధించిన పందుల ఫొటోలను వ్యాపారులకు పంపండంతో పని మొదలవుతుంది. వ్యాపారులు అంగీకరించగానే ఒక్కో జిల్లా దాటుతూ, వాహనాలను మార్చుతూ అసలు సూత్రధారులు ప్రత్యక్షంగా లేకుండానే పని పూర్తవుతుంది.  

ఆహారం కోసం చంపితే నేరం 
అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి పందుల రవాణా ఎక్కువగా జరుగుతోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలు ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లోని వ్యవసాయ పంటల్లోకి నిత్యం అడవి పందులు వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పంటలకు నష్టం చేస్తున్న సందర్భాల్లో అడవి పందులను చంపడం నేరం కాదు. ఆహారం కోసం చంపితే శిక్షార్హులు. చట్టంలోని 9, 39, 48, 49, 51 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. కానీ పంట నష్టం కారణం చూపి అక్రమార్కులు పందులను వేటాడుతున్నారు.  

వాట్సాప్‌లోనే అంతా.. 
అడవి పంది మాంసానికి ఇటీవల డిమాండ్‌ పెరుగుతోంది. పెద్ద పెద్ద హోటళ్లలోనూ అడవి పంది మాంసాన్ని ప్రత్యేక వంటకంగా చేస్తున్నారు. కొన్ని పెద్ద నగరాలు, పట్టణాల్లో ముందుగా ఆర్డర్‌ ఇచ్చిన వారికి ఉదయమే వాటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో కిలో రూ. 500.. నగరాల్లో కిలో రూ. 800 చొప్పున మాంసాన్ని విక్రయిస్తున్నారు. బెంగళూరు నుంచి కవ్వాల్‌ వరకు అడవి పంది ఎలా ఉంది, దాని ధర ఎంత విషయాలన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయని, ఒప్పందం కుదరగానే రవాణా మొదలవుతుందని పోలీసులు చెబుతున్నారు.  

    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top