
కేరళ మంత్రి అతి తెలివి!
అలప్పుళ (కేరళ): అడవి పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి కేరళ రైతులకు.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ వినూత్నమైన సలహా ఇచ్చారు. ఆయన శనివారం పాలమేల్ గ్రామ పంచాయతీలో మాట్లాడుతూ... ‘అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి కదా?. మీరంతా వాటి మాంసాన్ని తినండి!. ఈ సమస్య చాలా వేగంగా పరిష్కారమవుతుంది!‘ అని సెలవిచ్చారు. పంట పొలాల్లో హతమైన అడవి పందుల మాంసాన్ని ప్రజలు తినడానికి అనుమతించాలని అభిప్రాయపడ్డారు.
ఆయన దీనికి లాజిక్ కూడా చెప్పారు. ‘ప్రజలకు అడవి పందులను చంపి, వాటి మాంసాన్ని తినేందుకు అనుమతి ఉంటే, ఈ సమస్య చాలా తొందరగా పరిష్కారమవుతుంది. కానీ, ప్రస్తుత చట్టం దీనికి ఒప్పుకోవట్లేదు’.. అని వాపోయారు. ‘అడవి పంది ఏమంత అంతరించిపోతున్న జంతువు కాదు కదా!‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు.. రాష్ట్రంలో మానవ–జంతు సంఘర్షణలను తగ్గించేందుకు ఉద్దేశించిన వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను సవరించడానికి కేరళ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించిన కొద్ది రోజుల తర్వాత రావడం విశేషం.