పాలదిగుబడి పెంపునకు కొత్త పథకం
రూ.2వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన పశుసంవర్థక శాఖ
సగం ఖర్చు రైతు భరిస్తే మరో సగం చెల్లించనున్న ప్రభుత్వం
ప్రతి యూనిట్‌కు రూ.2.5 లక్షలు అవుతుందని ప్రతిపాదన
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాల దిగుబడి పెంపు కోసం కొత్త పథకం తెరపైకి వచ్చింది. రూ.2వేల కోట్ల వ్యయ అంచనాలతో 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రతి యేటా పెద్ద సంఖ్యలో ఆవులను రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని పశుసంవర్థ్ధక శాఖ ప్రతిపాదించింది. ఈ పథకాన్ని సబ్సిడీపై అమలు చేయాలని, ఆవుల కొనుగోలు నుంచి పోషణ వరకు యూనిట్‌గా లెక్కించి అందులో సగం రైతు భరిస్తే మరో సగం ప్రభుత్వం భరించేలా ఆర్థిక అంచనాలను రూపొందించింది. పశుసంవర్థ్ధక శాఖ ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు.
మూడు సంవత్సరాల కాలంలో ప్రతి ఏటా ప్రతి జిల్లాలో 830 మంది రైతులకు రెండు చొప్పున ఆవులను అందజేస్తారు. ఇందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 26,560 మంది చొప్పున మూడేళ్ల కాలంలో 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆవుల కొనుగోలు నుంచి పోషణ వరకు అన్ని ఖర్చులను లెక్కించి యూనిట్‌కు రూ.2,51,000 ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఈ మేరకు పథకం అమలు కోసం ప్రతి యేటా రూ.667.98 కోట్లు ఖర్చవుతాయని, మూడేళ్ల కాలంలో రూ. 2,003 కోట్లు అవసరమవుతాయని ప్రతి పాదించారు. అయితే, యూనిట్ కాస్ట్‌లో సగం రైతులు భరించాల్సి ఉన్నందున రైతు చెల్లించే వాటా పోను రూ.1,000 కోట్ల ప్రభుత్వ నిధులతో 1.6లక్షల ఆవులను మూడేళ్ల కాలంలో రాష్ట్ర రైతాంగానికి అందించవచ్చని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ పథకం అమలు ద్వారా పాల ఉత్పత్తి లక్ష్యం మరింత చేరువవుతుందని అధికారులు చెబుతున్నారు. మరి, పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే...!


