94 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లపై వేటు | 94 Doctors Dismissed for Absentism from Govt Hospitals in Telangana | Sakshi
Sakshi News home page

94 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లపై వేటు

Feb 26 2026 4:50 AM | Updated on Feb 26 2026 4:50 AM

94 Doctors Dismissed for Absentism from Govt Hospitals in Telangana

వైద్య కళాశాలల్లో ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్న వారిపై కొరడా

విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు 

డీఎంఈ నిర్ణయంపై వైద్యారోగ్య శాఖలో కలకలం

సాక్షి, హైదరాబాద్‌: బోధనాసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లో కీలక ప్రాత పోషించే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్న తీరుపై వైద్యశాఖ కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న జనరల్‌ ఆస్పత్రుల్లో సుదీర్ఘకాలంగా విధులు ఎగ్గొడుతున్న 94 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. ఈమేరకు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ ఎ.నరేంద్రకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామక ఉత్తర్వులు స్వీకరించి విధుల్లో చేరని వారు కొందరైతే... మరికొందరు రెండు నుంచి నాలుగేళ్లుగా విధులకు గైర్హాజరవుతున్న వారున్నారు. 

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనధికారిక గైర్హాజరీని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం తీవ్రంగా పరిగణించి నోటీసులు సైతం జారీ చేసింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారిని విధుల నుంచి శాశ్వతంగా టర్మినేషన్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1996 రూల్‌10(ఇ) ప్రకారం 94 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లను తొలగించింది.

టర్మినేషన్‌ అయిన డాక్టర్లు 15 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని డీఎంఈ స్పష్టం చేశారు. టర్మినేషన్‌కు గురైన వారిలో ప్లాస్టిక్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిషన్, రేడియాలజీ, అనస్తీషియా, జనరల్‌ మెడిసిన్, యూరాలజీ, పాథాలజీ, జనరల్‌ సర్జన్, ఫార్మకాలజీ విభాగాలకు చెందిన వారున్నారు. పెద్ద సంఖ్యలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డాక్టర్లను విధుల నుంచి తొలగించడం డీఎంఈ వర్గాల్లో కలకలం రేపుతోంది.

మెడికల్‌ కాలేజీ/ జనరల్‌ హాస్పిటల్‌లో టర్మినేట్‌ అయిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సంఖ్య:
ఉస్మానియా–3, నిలోఫర్‌–3, పేట్లబురుజు–6, సుల్తాన్‌బజార్‌–2, సంగారెడ్డి–10, వికారాబాద్‌–2, జీఎంసీ హనుమకొండ–1, జీఎంసీ సూర్యాపేట–1, కేఎంసీ వరంగల్‌–10, జీఎంసీ నల్లగొండ–3, జీఎంసీ/జీజీహెచ్‌ సిద్దిపేట–4, జీఎంసీ/జీజీహెచ్‌ సిరిసిల్ల–2, జీఎంసీ కరీంనగర్‌–2, జీఎంసీ మహబూబ్‌నగర్‌–3, జీఎంసీ ఖమ్మం–5, జీఎంసీ రామగుండం–8, జీఎంసీ మహబూబాబాద్‌–2, జీఎంసీ జనగామ–2, జీఎంసీ నిజామాబాద్‌–7, ఓజీహెచ్‌ హైదరాబాద్‌–1, జీఎంసీ భూపాలపల్లి–1, జీఎంసీ కొత్తగూడెం–4, ఉస్మానియా కాలేజీ/ఆస్పత్రి–8, జీఎంసీ వనపర్తి–1, గాంధీ మెడికల్‌ కాలేజీ–1, ఎంజీఎం–1, జీఎంసీ ఆసిఫాబాద్‌–1     

Advertisement
 
Advertisement
Advertisement