breaking news
eating meat
-
అడవి పందిని తింటే పంట సేఫ్!
అలప్పుళ (కేరళ): అడవి పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి కేరళ రైతులకు.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ వినూత్నమైన సలహా ఇచ్చారు. ఆయన శనివారం పాలమేల్ గ్రామ పంచాయతీలో మాట్లాడుతూ... ‘అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి కదా?. మీరంతా వాటి మాంసాన్ని తినండి!. ఈ సమస్య చాలా వేగంగా పరిష్కారమవుతుంది!‘ అని సెలవిచ్చారు. పంట పొలాల్లో హతమైన అడవి పందుల మాంసాన్ని ప్రజలు తినడానికి అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ఆయన దీనికి లాజిక్ కూడా చెప్పారు. ‘ప్రజలకు అడవి పందులను చంపి, వాటి మాంసాన్ని తినేందుకు అనుమతి ఉంటే, ఈ సమస్య చాలా తొందరగా పరిష్కారమవుతుంది. కానీ, ప్రస్తుత చట్టం దీనికి ఒప్పుకోవట్లేదు’.. అని వాపోయారు. ‘అడవి పంది ఏమంత అంతరించిపోతున్న జంతువు కాదు కదా!‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు.. రాష్ట్రంలో మానవ–జంతు సంఘర్షణలను తగ్గించేందుకు ఉద్దేశించిన వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను సవరించడానికి కేరళ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించిన కొద్ది రోజుల తర్వాత రావడం విశేషం. -
ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేస్తే....
లండన్: మాంసాహారానికి స్వస్తి చెప్పి శాకాహారాన్ని ఆశ్రయించాలని ప్రపంచవ్యాప్తంగా విజిటేరియన్లు ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. అందరూ శాకాహారాన్ని ఆశ్రయించడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్న కొత్త వాదన కూడా శాకాహార ప్రోత్సహానికి దోహద పడుతోంది. ఈ మేరకు ప్రపంచమంతా మాంసాహారానికి స్వస్తి చెబితే ఏమవుతుంది? పళ్లు, కూరగాయల పెంపకం వల్ల వాతావరణంలో కలిసే కార్బన్డయాక్సైడ్ కన్నా కోళ్లు, మేకలు, ఆవులు, పందుల మాంసం వల్ల ఎక్కువ కార్బన్డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తోంది. 226 గ్రాముల బంగాళ దుంపలు విడుదలచేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 0.2 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానం. అదే 226 గ్రాముల ఆవు మాంసం విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఓ చిన్నకారు 12.7 కిలోమీటర్లకు విడుదల చేసే కర్బన ఉద్గారాలతో సమానమని ‘సైంటిఫిక్ అమెరికన్’ పత్రిక వెల్లడించింది. ప్రపంచమంతా మాంసాహారాన్ని మానేసి శాకాహారానికి మారితే పర్యావరణంలో కర్బన ఉద్గారాలు మూడింట రెండు వంతులు తగ్గుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని ఆక్స్ఫర్డ్ మార్టిన్ స్కూల్ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. మాంసాహారాన్ని వదులుకోవడం వల్ల అపారంగా నీటి వనరులు కూడా మిగులుతాయి. చెరకు, కూరగాయలు, పళ్లు, పప్పు దినుసులు పండించడం కన్నా కోళ్లు, మేకలు, గొర్రెలు, ఆవుల పెంపకానికి ఎక్కువ నీటి వనరులు అవసరమవుతాయి. అన్నింటి కన్నా ఆవులకు ఎక్కువ నీరు అవసరం. శాకాహారం ఫలితంగా ప్రపంచమంతా పచ్చదనం అలుముకుంటుందని, పర్యావరణంతోపాటు మానవుల ఆరోగ్యం కూడా బాగుపడుతుందన్నది ఈ పరిశోధనల సారాంశం. మాంసాహారానికి స్వస్తి చెప్పడం వల్ల లాభాలే తప్ప నష్టాలే లేవా? ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 400 కోట్ల నెమరువేసే జంతువులను, లక్షలాది కోట్ల కోళ్లను మాంసం కోసం పోషిస్తున్నారు. వీటికి స్వస్తి చెప్పడం వల్లన జీవవైవిద్యం దెబ్బతింటుంది. పేదలకు పౌష్టికాహారం మాంసం రూపంలోనే ఎక్కువగా దొరకుతుంది. అది వారికి దూరమైతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మరో పక్క ప్రపంచంలో మాంసాహారంపై ఆధారపడి కోట్లాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. మాంసాహారానికి స్వస్తి చెబితే వారంతా ఒక్కసారిగా రోడ్డున పడడమే కాకుండా కొన్ని జాతుల ప్రజల సంస్కతి, సంప్రదాయాలు కూడా దెబ్బతింటాయని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఓ అధ్యయనంలో తెలిపింది. నిరుద్యోగ సమస్య పెరిగి ప్రజల మధ్య అసమానతలు పెరుగుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైషమ్యాలు కూడా పెరుగుతాయని యూనివర్శిటీ అందులో హెచ్చరించింది. పలు ప్రాణాధార ఔషధాల్లో జంతు ఉత్పత్తులను వాడుతున్నారు. వాటికి కూడా స్పస్తి చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారం గురించి ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తున్న మాంసాహారం మానేసే వారు తక్కువే ఉన్నారు. కనుక ఇప్పట్లో మాంసాహారాలకు వచ్చే ముప్పేమి లేదు.


