
కాస్త వేట తెలిసిన పెద్దపెద్ద పక్షులైతే మాంసం ముక్కకోసం వెతుకుతాయి చిన్నా చితకా పక్షులు గింజలు తింటాయి. దొరికితే పురుగుపుట్రను నోట్లో వేసుకుంటాయి. అయితే ష్రైక్ అనే పక్షి క్రూరత్వాన్ని చూస్తే మాంసాహారులకు కూడా మనసు చలిస్తుంది. దీని వేటలో అంత వ్యూహం ఉంటుంది మరి! ‘లానిడే’ కుటుంబానికి చెందిన అనేక రకాల పక్షులను ష్రైక్ పక్షులు అంటారు.
ఈ పక్షులు చూడటానికి చాలా మైల్డ్‌గా కనిపిస్తాయి గాని, వీటిని వైల్డ్ బర్డ్స్ అని కూడా అంటారు. వీటికి వేటాడే జంతువులకు ఉన్నట్లుగా బలమైన కాళ్లు, గోళ్లు ఉండవు. అందుకే ఇవి తన ఆహారాన్ని విలక్షణంగా సమకూర్చుకుంటాయి. చిన్న కీటకాలు, బల్లులు, కప్పలు, చిట్టెలుకలు, కాస్త బలహీనంగా ఉండే రామచిలుకలను వేటాడి, వాటిని నిర్దాక్షిణ్యంగా బతికి ఉండగానే ముళ్ళ పొదలపైన లేదా పదునైన కొమ్మలపైన, మొనలుదేరిన తీగలపైన గుచ్చి చంపుతాయి.
మాంసం దుకాణంలో మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసినట్లుగా ఈ పక్షులు తమ ఆహారాన్ని ముళ్లకంపలకు వేలాడదీస్తాయి. ఈ పద్ధతి వాటి మనుగడకు అత్యంత కీలకం. ష్రైక్ పక్షులు తమ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, తర్వాత అవసరమైనప్పుడు ముక్కలుగా చేసి తినడానికి ఈ విధానాన్నే ఎంచుకుంటాయి.
మనకు ఈ పద్ధతి క్రూరంగా అనిపించినా, ప్రకృతిలో ఈ జీవులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహం ఇదంతా. ఇక తినే ఆహారం విషతుల్యమైందనే అనుమానం వస్తే, ఈ పక్షులు తాము వేటాడిన ఆహారాన్ని అక్కడే వదిలిపెట్టి మరునాడు వచ్చి, అప్పటికి సురక్షితంగా ఉన్నట్లయితే తింటాయట!