అన్వేషకులను తిరిగి పంపుతున్న పోలీసులు
నంద్యాల జిల్లా: మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని గాజులపల్లె సమీపంలో ఉన్న వజ్రాలవంకలో వజ్రాన్వేషణ కోసం జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివస్తున్నారు. వజ్రాలు దొరకకపోయినా వజ్రాలు దొరుకుతున్నాయి.. రూ. లక్షల విలువైనవంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
వజ్రాలు దొరకడం దేవుడెరుగు...వజ్రాన్వేషణ మాటున అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అప్రమత్తమయ్యారు. వజ్రాల కోసం అంటూ కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్ప డం గుర్తించినట్లు తెలిసింది. వంక వెంట కంపచెట్లు, పొదలు ఉండటం కొందరికి కలిసొస్తుంది. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వారు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే కొన్ని ప్రేమ జంటలు సైతం అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. వజ్రాల వంక దగ్గర జరుగుతున్న వ్యవహారాలపై ఇంటలిజెన్స్ విభాగం, ఎస్‌బీ పోలీసుల ద్వారా అన్ని వివరాలు సేకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వజ్రాల వంక వద్దకు ఎవరిని రానివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగి ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, రంగురాళ్లు, సూదిముక్కు రాళ్ల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ హితవు చెబుతూ అక్కడి నుంచి పంపించేస్తున్నారు.


