చంద్రబాబు నేడు ఏ అంశాన్ని గట్టిగా విమర్శిస్తున్నారంటే నాలుగు రోజుల తరువాత అదే అంశాన్ని ఫాలో అవుతారని అర్థం. వైయస్ జగన్ ఆనాడు అమలు చేసిన సచివాలయ వ్యవస్థను విమర్శించిన బాబు.. నేడు మళ్లీ అదే వ్యవస్థపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు అయిన గ్రామ సచివాలయాలు నేడు పాలనకు పట్టుగొమ్మలైనాయి.
ఇది వందల కోట్లు పెట్టి కట్టిన ప్రాసాదం.. ఇది ప్రభుత్వ ఆస్తి కానే కాదు.. వైయస్ జగన్ విలాసాల కోసం నిర్మించుకున్న ప్యాలెస్. ఇందులో బోలెడు లొసుగులున్నాయి. నిబంధనల అతిక్రమణ ఉంది. పర్యావరణానికి విఘాతం కలిగించి.. కొండలు తొలిచి మరీ నిర్మించారు.. ఇలాంటి భవనాన్ని మనం నిర్వహించలేం. కరెంటు బిల్లులు ఎక్కువైనాయి.. ఇది ఎందుకు పనికొస్తుందో తెలియదు. దీన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలి అంటూ చంద్రబాబు ఏదేదో చెప్పడం.. దాన్ని ఎల్లో మీడియా మక్కికిమక్కీ ప్రసారం.. ప్రచారం చేయడం ఈ ఏడాదిన్నరలో చూస్తూ వస్తున్నాం. చూసే జనాలకు కూడా అదేదో వైయస్ జగన్ సొంత ఆస్తి అన్నట్లుగా అనుమానాలు.. కాదు ఏకంగా నమ్మకం కలిగించేలా చంద్రబాబు ఆయన అనుచరులు మాట్లాడారు.
ఏకంగా దాన్ని రుషికొండ జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసారు.. అయితే అదే ఇప్పుడు విశాఖ నగరానికి తలమానికం అయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన జాగాలో గతంలో ఉన్న కాటేజీల స్థానంలో ఈ అధునాతన భవంతిని తక్కువ బడ్జట్లో వైయస్ జగన్ నిర్మించారు. అయితే దాన్ని రకరకాలుగా వక్రీకరించి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత గొప్పగా వినియోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఋషికొండ భవనాలపైన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన , స్మార్ట్ మీటర్లపైన, తిరుమల లడ్డూపైన, వివేకా హత్య కేసుపైన, ముఖ్యంగా ఏపీ అప్పులపైన... పనిగట్టుకుని పుకార్లు.. అబద్ధాలు ప్రచారం చేసిన బాబు నేడు అదే రుషికొండ ప్యాలెస్‌పై ప్రభుత్వ ఆస్తిగా చూపుతూ దాన్ని ఇంకోరకంగా వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
దాన్ని లీజుకు ఇవ్వాలంటూ టాటా గ్రూపుకు చెందిన తాజ్ హోటల్స్.. లీలా గ్రూప్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్ల వారు ఈ ప్యాలెస్‌లను అడుగుతున్నారు. దాన్ని వారు స్టార్ హోటళ్లుగా మార్చుకుని ప్రభుత్వానికి నెలనెలా అద్దె చెల్లించే ప్రాతిపదికన ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఇన్నాళ్లూ తెలుగుదేశం.. తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చినట్లు ఇది నిరర్ధక భవనం కాదని.. అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే హోటల్ లేదా ప్రభుత్వ గెస్ట్ హౌస్ వంటి వాటికి ఎంతగానో పనికొస్తుందని అర్థమవుతోంది.
మరోవైపు ఈ భవనం మీద మరో రెండు అంతస్తులు నిర్మించడం ద్వారా దాన్ని మొత్తం 150 గదుల హోటల్‌గా మారిస్తే దానికి పూర్తి సార్థకత వస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అంటే వైయస్ జగన్ ఆనాడు నిర్మించిన భవనం ఇప్పుడు ఒక స్థిరమైన ఆస్తిగా మారి విశాఖకు వన్నె తెచ్చిందన్నమాట. మరి ఇన్నాళ్లుగా అది వైయస్ జగన్ సొంత ఆస్తిగా ప్రచారం చేస్తూ వచ్చిన మీడియా.. తెలుగుదేశం నాయకులూ.. దీనిపై ఏమంటారు.. అది జగన్ ఆస్తిగా చెప్పారు కదా మరి దాన్ని ఆయనకు ఇచ్చేస్తారా? లీజు డబ్బు జగన్ కుటుంబానికి అందజేస్తారు అంటూ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎదురుదాడి ప్రశ్నల పరంపర మొదలైంది. అప్పుడు ఈ భవనం మీద ఇష్టానుసారం మాట్లాడిన చంద్రబాబు నేడు మళ్ళీ అదే భవనాన్ని గొప్పగా వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించడం ఆయన అవకాశవాద తీరుకు నిదర్శనం అని అంటున్నారు
- సిమ్మాదిరప్పన్న


