‘‘మన పాలనను జనం మెచ్చడం లేదు.. బాగానే పని చేస్తున్నామని మనం అనుకుంటున్నా ఎండ్ రిజల్ట్ రావడం లేదు..’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన ఒక వ్యాఖ్య ఇది. కుమారుడు, మంత్రి లోకేశ్ చేస్తున్న బెదిరింపు రాజకీయాలను తెలుసుకుంటే బాబుగారికి ‘ఎండ్ రిజల్ట్’ ఎందుకు రావడం లేదో తెలిసొచ్చేదేమో. ‘రెడ్‌బుక్‌లో మూడు పేజీలే అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఎవరికి, ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు’’ అని లోకేశ్ చేసిన వ్యాఖ్య అర్థమేమిటి? ప్రభుత్వాన్ని, విధానాలను ప్రశ్నించేవారిని వేధిస్తామనడమేగా? అధికారంలో వచ్చింది మొదలు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్ధులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారనే కదా? ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలు మెచ్చుకుంటారని ఎలా అనుకున్నారు? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. అయితే లోకేశ్ వంటి నేతలు అధికారం రాగానే తాము ఏమి చేసినా చెల్లిపోతుందని భ్రమపడుతున్నారు. నిజమే..ఈ మధ్య ఎవరో చెప్పారు. చంద్రబాబుకు పాలనపై పట్టు తగ్గుతోందట. అంతా ఆయన కుమారుడే ఆదిపత్యం చెలాయిస్తున్నారట.
చంద్రబాబు కూడా లోకేశ్‌ను పొగడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. గతంలో చంద్రబాబు పాలన మరీ ఇంత అధ్వాన్నంగా ఉందని ఆయన ప్రత్యర్దులు సైతం చెప్పరు. ఈ విషయం ఆయకూ తెలుసు. రెడ్‌బుక్ అంటూ ఎవరినైనా పోలీసుల ద్వారా వేధించే అధికారం లోకేశ్‌కు ఎలా వచ్చింది? ఆయన కనీసం హోం మంత్రి కూడా కాదు! అయినా మొత్తం పోలీసు వ్యవస్థను ఆయనే ఎందుకు నడుపుతున్నారు? చివరికి కొంతమంది పోలీసులు కిడ్నాపర్లుగా మారుతున్నారని కొంతమంది సాక్షాత్తూ హైకోర్టుకు ఫిర్యాదు చేశారే! లేదంటే గంజాయి అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది.
సోషల్ యాక్టివిస్ట్ సవిందర్ రెడ్డిపై పెట్టిన గంజాయి కేసుపై న్యాయ వ్యవస్థ మండిపడింది కదా! ఫ్యాక్షనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చేలా లోకేశ్ మాట్లాడడమంటే ఇంతకంటే ఏమి చెప్పాలి. ఫ్యాక‌్షన్ గొడవల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య తనకు ఆదర్శమంటే ఏం చెబుతాం? హత్యను సమర్థించరు కానీ.. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం దుష్ట సంప్రదాయానికి తెరదీసిందా? లేదా? కందుకూరులో జరిగిన మరో హత్యకు టీడీపీ నేత కారణమన్న ఆరోపణలున్నాయి. అది కులపరమైన వివాదంగా మారడంతో హతుని కుటుంబానికి భారీగా పరిహారం, భూమి ఇవ్వడాన్ని టీడీపీని సమర్థించే ఒక మాజీ డీజీపీ స్థాయి అధికారే విమర్శించారే. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు ఆంజనేయులును కొందరు నేరస్తులు హత్య చేస్తే ఈ ప్రబుత్వం పట్టించుకోలేదు.
మాచర్ల ప్రాంతంలో రెండు టీడీపీ వర్గాలు ఘర్షణ పడి హత్యలు జరిగితే దానిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరులకు పులిమి జైలుకు పంపించడం రెడ్‌బుక్‌లో భాగమైతే ప్రజలు అంగీకరిస్తారా? చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో గత ప్రభుత్వం అరెస్టు చేయడంపై లోకేశ్, ఇతర నేతలు విమర్శలు చేశారు. ఇది అక్రమ అరెస్టు అని చెబుతున్నారే తప్ప, అందులో అవినీతి జరగలేదని రుజువు చేసే విధంగా ఒక్కసారైనా మాట్లాడలేకపోయారే! పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ కేసును దర్యాప్తు చేసిన అధికారులపై కేసులు పెట్టి వేధించి ఇది రెడ్‌బుక్ అని చెబితే ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు? ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఉద్యమం నడుపుతున్నారు.
ఆ క్రమంలో గవర్నర్‌ను కలిశాక ఈ ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, ఆ కాలేజీలు పొందే వారిపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెట్టి జైలుకు పంపుతామని ఆయన అన్నారు. ఈ అంశంపై లోకేశ్ రాజకీయ విమర్శ చేయవచ్చు. కాని అంతకు ముందు తాను ఈ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురంచి ఏమి చెప్పింది? అసలు ప్రభుత్వ వైద్యం గురించి ఎంత గంభీర ప్రకటనలు యువగళం సభలలో చేసింది గుర్తుకు తెచ్చుకుని బదులు ఇవ్వాలి కదా! అది చేయకుండా రెడ్‌బుక్ మూడులో పేజీలే అయ్యాయని, ఇంకా చాలా ఉన్నాయని చెప్పడం ద్వారా ఇది అహంభావ ప్రభుత్వమని, మూర్ఖంగా వ్యవహరిస్తోందన్న విమర్శలక ఆస్కారం ఇవ్వడం లేదా? ఇప్పుడే హుందాతనం లేకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే, భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని జనం అనుకోరా?
లోకేశ్ యువగళం టీమ్ ఒకటి ఉంటుందట. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆయా శాఖలను పర్యవేక్షిస్తుంటారట. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ వారిని ఎలా వేధించాలి?వారి ఆర్థిఖ మూలాలను ఎలా దెబ్బకొట్టాలి? అధికారులను అడ్డం పెట్టుకుని ఎలా డబ్బులు సంపాదించాలి అన్నవాటిపైనే దృష్టి పెడుతుంటారట. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉన్నా అది లోకేశ్‌కే పెద్ద సమస్య అవుతుంది. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టోలని 150 హామీలను అమలు చేయలేదు.రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్న సంగతి అందరికి తెలుస్తూనే ఉంది. అందువల్లే జనం ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూ మాఫియా గురించి ఏమి చెప్పారు? పేకాట క్లబ్లుల గురించి ఏమని తెలిపారు.ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది? అప్పుడప్పుడూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా, ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని అంటూ పవన్ చిటికెలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చెణుకులు వస్తున్నాయి. అది వేరే సంగతి. కేంద్ర హోం శాఖ నుంచి ఏపీకి ఏ రకమైన ఉత్తరం వచ్చింది? పది జిల్లాలలో నేరాల రేటు పెరిగిందని పోలీసు నివేదికే వెల్లడిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎన్నికైన నియోజకవర్గాలు ఉన్న జిల్లాలలోనే శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఈ నివేదిక చెబుతోంది కదా! టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే ఈ అరాచకాలకు కారకులవుతున్నారని అనేక మంది వాపోతున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తమ పార్టీవారు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నది వివరంగా చెబితే ప్రభుత్వం ఏమి చేసింది? ఎదుటి వారిపై తప్పుడు కేసులు పెట్టడం, అదే టీడీపీ వారు ఎంత విశృంఖలంగా ప్రవర్తించినా వారి జోలికి వెళ్లకపోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయా? లేదా? ఇదంతా రెడ్‌బుక్ ప్రభావమని లోకేశ్ సంతోషిస్తే సంతోషించవచ్చు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు దీని ఫలితం తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలుసు.ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవడం ధర్మం. అలా కాకుండా ఏకపక్షంగా సాగుతున్న ఈ ప్రభుత్వ పాలనను జనం ఎందుకు మెచ్చుకుంటారు.
అసలు ఈ ప్రభుత్వం ఆరంభమైందే ఈ రకమైన అరాచకాలతో. దానికి రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ బృందం చేసిన నిర్వాకమే కారణమన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. మొత్తమ్మీద జనం తన ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోవడానికి ప్రధాన కారణం తన కుమారుడి లోకేశ్ పెత్తనం, పిచ్చి రెడ్‌బుక్ అరాచకాలు, హామీలు అమలు చేయయకుండా ప్రజలను భ్రమలలో ఉంచాలన్న యత్నం వంటివి అన్న సంగతిని చంద్రబాబు గుర్తించి సకాలంలో జాగ్రత్తపడకపోతే అదే రెడ్‌బుక్ ఏదో రోజు టీడీపీ నేతల మెడకే చుట్టుకుంటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తమ పాలనను జనం మెచ్చడం లేదన్న సంగతి తెలుసుకోవడం కొంతలో కొంత బెటర్ అని చెప్పాలి.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


