సాక్షి, తిరుపతి: టీటీడీ నిర్లక్ష్యంతో.. ఈ ఏడాది ప్రారంభంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాట భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలిపిరి వద్ద గురవారం దాదాపు తొక్కిసలాట మాదిరి పరిస్థితులే కనిపించాయి.
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్ల జారీ నేపథ్యంలో భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో.. క్యూలైన్‌లో తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. భక్తుల్ని అదుపు చేసే పేరుతో లాఠీఛార్జ్‌కి దిగారు. అయితే..

పోలీసుల దురుసు ప్రవర్తనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపటికి భక్తులే నియంత్రించుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూసుకున్నారు. టీటీడీ నిర్లక్ష్య ధోరణితోనే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని భక్తులు ఈ సందర్భంగా వాపోయారు.

టీటీడీపై భక్తుల ఆగ్రహం..
తోపులాట ఘటనతో భక్తులు టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీటీడీ మేనేజ్‌మెంట్ సరిగా లేదు. వీఐపీల సేవల్లో అధికారులు మునిగిపోతున్నారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోవడం లేదు. స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఉండకూడదా?.. భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకు ఇచ్చే సర్వదర్శనం టికెట్లు పెంచాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి సిబ్బందిపై దౌర్జన్యం..
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పరిస్థితులను కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి సిబ్బందితో పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. సాక్షి ఫోటో గ్రాఫర్ కృష్ణను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకోగా.. అక్కడికి వచ్చిన అలిపిరి ఎవీఎస్వో రమేష్ ఫొటోగ్రాఫర్ కృష్ణ ఫోన్ లాక్కుని దురుసుగా ప్రవర్తించారు.

అంత విషాదం జరిగినా.. నిర్లక్ష్యమా?
ఈ ఏడాది ప్రారంభంలో.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట తిరుమల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర విషాదానికి దారి తీసింది. బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్యూలైన్లో ఉన్నవాళ్లను ఒక్కసారిగా ఏదో పశువుల మాదిరి విడిచిపెట్టారని.. అందుకే తోపులాట జరిగిందని ఆ సమయంలో భక్తులు టీటీడీ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.


