‘ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ను ఎవరో కొట్టి చంపారు’ | Writer Boggula Srinivas Car Accident Case Updates | Sakshi
Sakshi News home page

‘ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ను ఎవరో కొట్టి చంపారు’

Feb 16 2026 7:30 AM | Updated on Feb 16 2026 11:04 AM

Writer Boggula Srinivas Car Accident Case Updates

 కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి శనివారం కారు దూసుకెళ్లడంతో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ (48) మృతిచెందిన ఘటనపై ఆయన సోదరులు అబ్దుల్లా, సుధాకర్‌ ఆదివారం కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడు శ్రీనివాస్‌ తల, ముఖంతోపాటు ఎడమ చేతిపై గాయాలున్నాయని.. గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. 

శ్రీనివాస్‌ మృతదేహానికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోదరులకు అప్పగించగా వారు నంద్యాల జిల్లాలోని స్వగ్రామం అల్లూరుకు తీసుకెళ్లారు. కారులో నుంచి ఒడ్డుకు వచ్చి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్‌ నుంచి వస్తూ..  శ్రీనివాస్‌ ప్రయాణించిన ఏపీ 16 డీపీ 2345 కారు హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వైపు వచ్చినట్లు టోల్‌ప్లాజా సీసీ పుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కారు రిజిస్టేషన్‌ ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన వేణుమాధవరెడ్డిదిగా గుర్తించారని తెలిసింది. కారు జాతీయ రహదారిపై వెళ్లకుండా నాయకన్‌గూడెం నుంచి పాలేరు రాష్ట్ర రహదారిపై రావడం, రిజర్వాయర్‌లో పడిపోయాక కారు నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్‌ గతంలో హైదరాబాద్‌లో కండక్టర్‌గా ఉద్యోగం చేసేవాడని, ఆ తర్వాత ఉద్యోగం నచ్చక వదిలేసి పుస్తకాలు రాస్తున్నాడని సోదరులు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement