24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవం..
అన్ని అలంకార సేవల్లో పాల్గొనేందుకు రూ.20 వేల టికెట్
విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఆలయ ఈవో భవానీ శంకర్
యాదగిరిగుట్ట: ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ఆదివారం యాదగిరికొండపైన ప్రధాన కార్యా లయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధా నార్చకులు కాండూరి వెంకటాచార్యు లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరీశుడి క్షేత్రంలో కొనసాగుతా యన్నారు. 18న ఉదయం విష్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రాత్రి అంకురార్పణతో ఉత్సవాలను అర్చకులు పాంచ రాత్ర ఆగ మశాస్త్రా నుసారంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
20న ఉద యం 9గంటలకు మత్సా్యలంకారంతో అలంకార సేవలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 24న రాత్రి 8 నుంచి 8.45 గంటల వరకు ఆలయ తూర్పు మాడ వీధిలో శ్రీస్వామి అమ్మవార్లకు ఎదు ర్కోలు ఉత్సవం జరుగుతుందన్నారు. 25న రాత్రి శ్రీస్వామి అమ్మ వార్ల తిరుకల్యాణ మహోత్సవం ఆలయ ఉత్తర మాడ వీధిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 26న దివ్య విమాన రథోత్సవం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవు తుందన్నారు. 27న విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థ స్నానం, 28న ఉదయం 10గంటలకు అష్టో త్తర శత ఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు.
100 మంది యజ్ఞాచార్యులు, పారాయ ణీకులు, రుత్వికులు ఉత్సవాల్లో పాల్గొంటారన్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు ఆలయ సంప్రోక్షణ నేపథ్యంలో దర్శనాలు కొంత సమయం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్త దంపతులు పాల్గొనేందుకు రూ. 20వేల రుసుము చెల్లిస్తే అన్ని సేవల్లో పాల్గొనే అవకాశంతో పాటు అంతరాలయ దర్శనం, అభిషేకం లడ్డూ, కనుమ, శ్రీస్వా మి శెల్లా ఇస్తామన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవస్థానం ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ముందుకు వెళ్తున్నామని ఈవో వెల్లడించారు.


