సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(అందె ఎల్లయ్య) అంత్యక్రియలు ముగిశాయి. ఘట్‌కేసర్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలి వచ్చారు.
అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, కవులు, కళాకారులు, మేధావులు, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ హాజరయ్యారు. అందెశ్రీ పార్థీవ దేహానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఓదార్చారు. అందెశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోయ్యారు. ఆపై అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు.
అందెశ్రీ(64) సోమవారం ఉదయం ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణ..తో పాటు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని రగల్చిన అనేక పాటలను రాశారాయన. సాహితీ లోకానికి గర్వకారణమైన అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.


నిన్నటి నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు అందెశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ ఉదయం సీనియర్ నేత కే కేశవరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సీనియర్ నేత వీహెచ్‌లు నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా.. ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. దారిపొడవునా అభిమానులు పూలు జల్లి అందెశ్రీకి నివాళులు సమర్పించారు.


