పుష్కరఘాట్ల మెట్లపై నీడ లేక అవస్థ
స్నానఘట్టాల దగ్గర సౌకర్యాల లేమి
వచ్చే పుష్కరాలకైనా పరిస్థితి మారేనా?
భద్రాచలానికి పోటెత్తుతున్న భక్తజనం
భద్రాద్రి కొత్తగూడెం: వరుసగా వచ్చిన సెలవులతో భద్రాచలం క్షేత్రం కిటకిటలాడుతోంది. కరకట్ట కిందున్న రోడ్డుపై ప్రైవేటు బస్సులు, కార్లు బారులుదీరాయి. దైవదర్శనం పూర్తి చేసుకున్న తర్వాత భక్తులు గోదావరి కరకట్టపై సేదదీరుతున్నారు. క్రమంగా కరకట్టపై రద్దీ పెరుగుతున్నా భక్తులకు నిలువనీడ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
కనులారా వీక్షించారు
ముక్కోటి ఏకాదశికి ముందు రోజు గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. లక్ష్మణ సమేత సీతారామచంద్రుల ఉత్సవ విగ్రహాలను హంసాకృతిలో అలంకరించిన పడవలో వేంచేపు చేస్తారు. సుమారు గంటపాటు సీతారాములను జలవిహారం చేయిస్తారు. ఆ వేడుకలు చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇందుకోసం గోదావరి తీరంలో భక్తుల కోసం బాణాసంచా కాల్చేవారు. అయితే గతేడాది తొలిసారిగా గోదావరి తీరంలో భారీ స్టేజీ వేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో స్టేజీకి ఎదురుగా ఉన్న పుష్కరఘాట్ మెట్ల వరుసల మీద భక్తులు కూర్చుని ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు, అటు తెప్పోత్సవం వేడుకలను కనులారా వీక్షించారు. తెప్పోత్సవం ముగిసిన తర్వాత కూడా వేలాదిగా భక్తులు తీరంలో ఉండిపోయారు. పోలీసులే స్వయంగా కల్పించుకుని భక్తులను ఇళ్లకు వెళ్లమని చెప్పాల్సి వచ్చింది. గతేడాది వేడుకల్లో పుష్కరఘాట్ రామభక్తులతో నిండిన క్రికెట్ స్టేడియాన్ని తలపించింది. కనీస వసతులు, ఏర్పాట్లు కల్పిస్తే పుష్కరఘాట్ దగ్గర భక్తులు ఎక్కువ సమయం గడిపేందుకు ఆస్కారం కలుగుతుంది.
నిలువ నీడ కరువు
ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో వచ్చే శ్రీరామనవమి, డిసెంబర్, జనవరిలో జరిగే ముక్కోటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా భద్రాచలం క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో వచ్చి పోతుంటారు. ఇతర పండుగలు, సెలవు రోజుల్లోనూ వస్తారు. ఇక అయ్యప్ప మాల, హనుమాన్, భవానీ, గోవింద మాలధారులు సైతం పెద్ద సంఖ్యలో భద్రాచలం వస్తుంటారు. ఇలా వచ్చే భక్తులకు గోదావరి తీరం వెంబడి ఉన్న పుష్కరఘాట్ దగ్గర నిలువ నీడ కరువైంది. ఎండ, వాన, చలికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. వేసవి కాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 సెల్సియస్ డిగ్రీలకు పైకి చేరుకుంటాయి. ఇంత వేడిలో పట్టుమని పది నిమిషాలు కూడా పుష్కరఘాట్ల దగ్గర ఉండలేకపోతున్నారు. 2003లో పుష్కరఘాట్లు నిర్మించాక గడిచిన రెండు దశాబ్దాలుగా ఇక్కడ చెప్పుకోతగ్గ మరే అభివృద్ధి జరగలేదు.
ఇరవై ఏళ్లుగా ఇంతే
వందల ఏళ్లుగా భద్రాచలం సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేవారు. అదే విధంగా తెప్పోత్సవంతోపాటు ఇతర పర్వదినాల్లోనూ ఇక్కడ వేడుకలు జరిగేవి. 2003 పుష్కరాల సందర్భంగా భద్రాచలంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన నిర్మాణాలు గోదావరి తీరం వెంబడి కొత్త వెలుగులు తీసుకొచ్చాయి. 80 అడుగుల ఎత్తుతో కరకట్ట, ఆ కరకట్ట వెంబడి భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా మెట్లు, స్నానఘట్టాలు వచ్చాయి. ఆ తర్వాత 2015 పుష్కరాల సందర్భంగా ఈ స్నానఘట్టాలను విస్తరించారు. అంతకు మించి కొత్తగా మరే అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేకపోయారు.
పుష్కరఘాట్‌కు పైకప్పు..
గోదావరికి పుష్కరాలు 2027లో జరగబోతున్నాయి. తెలంగాణలో ప్రధాన పుష్కరఘాట్‌గా భద్రాచలం ఉంది. ప్రతీరోజు లక్షల్లో భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ మేరకు ఇక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రారంభమైతే బ్యాక్ వాటర్ భద్రాచలం వరకు ఉంటుందని కేంద్రం చెబుతోంది. అదే జరిగితే, ప్రస్తుతం ఏపీలోని పోచవరం నుంచి వెళ్తున్న పాపికొండలు టూర్ బోట్లు భద్రాచలం నుంచే మొదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కరఘాట్ మెట్ల మీద భక్తులకు ఎండ, వానల నుంచి రక్షణ కల్పించేలా స్టేడియం తరహాలో పైకప్పు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పుష్కర పనుల ప్రతిపాదనలు రూపొందించాలని భక్తులు కోరుతున్నారు.


