శామీర్‌పేట్: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలం కొన్నేళ్ల క్రితం తూంకుంటకు వలస వచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మద్యానికి బానిçసయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను మద్యం తాగేందుకు భార్యను రూ. 200 అడిగాడు.
తన వద్ద డబ్బులు లేవని అతడి భార్య అందుకు నిరాకరించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆమె లోపలికి వెళ్లి చూడగా సింహాచలం సీలింగ్ హుక్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సాయంతో అతడిని కిందికి దించి 108కు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య కోనారి సుహాసిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


