నిజామాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ మహిళ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. రైల్వేహెడ్‌కానిస్టేబుల్ సహకారంతో వారికి కుచ్చుటోపి పెట్టింది. లక్షలాది డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిందితురాలు స్వరూప, ఆమెకు సహకరించిన రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కుబేర్ పై నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్, 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటనల్లో మహిళపై కేసులు నమోదైనట్లు తెలిసింది.
శానిటేషన్ సిబ్బంది..
నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లోని శానిటేషన్ సిబ్బంది 18 మంది నుంచి స్వరూప రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వసూలు చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న మహిళ పోలీస్‌శాఖ క్లూస్‌టీమ్‌లో పనిచేస్తున్న ఇద్దరు, సీసీఎస్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుళ్ల నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో పర్సంటేజీలు ఇప్పిస్తానంటూ ముందుగా పెట్టుబడి పెట్టాలని చెబుతూ కానిస్టేబుల్ నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ వ్యవహారంలో రైల్వేహెడ్‌కానిస్టేబుల్ సహకారం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌లోని శానిటేషన్ సిబ్బంది నుంచి డబ్బుల వసూళ్లలో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ముఖ్యపాత్ర పోషించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. స్వరూప హెడ్‌కానిస్టేబుల్‌ను వెంట తీసుకుని వెళ్లేదని, దీంతో తేలికగా డబ్బులు వసూ లు చేసేదని బాధితులు చెబుతున్నారు. శాఖల వా రీగా ఉద్యోగాలు కలి్పస్తామంటూ మహిళ మోసాని కి గురి చేసింది. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, జిల్లా పరిషత్‌లో అటెండర్ పోస్టుల పేరిట రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది నుంచి రూ.2.50 లక్ష లు వసూలు చేసింది. జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ పోస్టులకు, ఇతర శాఖలలో జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది.
నిందితుల అరెస్టు
స్వరూపతోపాటు కుబేర్‌ను అరెస్టు చేసినట్లు మూ డవ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వీరిపై 3వ టౌన్ స్టేషన్‌లో మూడు కేసులు, 4వ టౌన్‌లో మూడు కేసులు, నిజామాబాద్ రూరల్‌లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.
నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు
నిందితురాలు స్వరూప నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ నియామక పత్రాలను అందజేసింది. ఇందులో జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ సంతకాలు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. తన కారుకు ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన నెమ్‌ప్లేట్ వేసుకోవడం గమనార్హం.


