హైదరాబాద్ నగరం ఎప్పుడూ కొత్త ట్రెండ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఇందులో భాగంగానే మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న స్ట్రెస్, వేగవంతమైన సిటీ లైఫ్ మధ్య నగరవాసులు ఇప్పుడు సెలబ్రేషన్స్‌కే కొత్త అర్థం ఇస్తున్నారు. ముఖ్యంగా 2025కి బైబై.. చెప్పే ఇయర్ ఎండ్ వేడుకలను ఈసారి సరికొత్త కోణంలో జరుపుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోలా లౌడ్ మ్యూజిక్, పబ్బులు, డీజే నైట్స్, భారీ జన సమీకరణతో సందడిగా కాకుండా ప్రశాంతతకే ప్రధాన్యం ఇస్తూ.. థీమాటిక్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ అంటే నగరంలోని స్టార్ హోటల్స్, పబ్బులు, ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్‌లు, రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, హడావుడి వాతావరణం గుర్తుకొస్తాయి. కానీ ఈసారి మాత్రం చాలా మంది నగరవాసులు ఈ రద్దీకి దూరంగా ప్రకృతి ఒడిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కుటుంబంతోనో, సన్నిహితులతోనో, మిత్రులతోనో కలిసి నిశ్శబ్దంగా, ఆహ్లాదకరంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలన్న ఆలోచన పెరుగుతోంది.
హోమ్ స్టైల్.. పక్కా లోకల్..
ఫుడ్ విషయంలోనూ ఈసారి ట్రెండ్ మారుతోంది. హెవీ బఫేలు, ఫాస్ట్ ఫుడ్ కంటే ఆర్గానిక్, లోకల్ వంటకాలు, హోమ్‌స్టైల్ మెనూకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని రిసార్టుల్లో ఫాం–టు–టేబుల్ కాన్సెప్‌్ట్స అమలు చేస్తూ, అక్కడే పండిన కూరగాయలతో వంటకాలు అందిస్తున్నారు. డ్రింక్స్ విషయంలోనూ లిమిటెడ్, సాఫ్ట్ సెలబ్రేషన్స్‌కే ఓటు వేస్తున్నారు. లైఫ్ స్టైల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాకుండా, నగరవాసుల్లో పెరుగుతున్న మెంటల్ హెల్త్ అవగాహనకు సూచికగా భావిస్తున్నారు. ఏడాది పొడవునా పని ఒత్తిడి, ట్రాఫిక్, డిజిటల్ లైఫ్ మధ్య గడిపిన ప్రజలుం ఏడాది చివర్లో కనీసం రెండు రోజులు ప్రకృతితో కనెక్ట్ కావాలన్న కోరికతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
రష్ కంటే రిలాక్సేషన్ ఉత్తమం..
యువత ఈసారి న్యూ ఇయర్‌ను పూర్తి స్థాయి అనుభూతిని ఆస్వాదించాలనే తలంపుతో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ గ్రూప్‌లుగా విడిపోయి ప్రైవేట్ ఫామ్ హౌస్‌లు/అగ్రీ క్యాంప్స్ బుక్ చేసుకుని మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బార్బిక్యూ, ట్రెక్కింగ్ వంటి యాక్టివిటీస్‌తో సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. సొంత ఫామ్ హౌస్‌లు ఉన్నవారు మాత్రం పరిమిత అతిథులతో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తూ హోమ్ స్టైల్ గ్యాదరింగ్స్ నిర్వహిస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వారు పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా నేచర్ రిసార్టులు, ప్రైవేట్ విల్లాల్లో ప్రశాంతంగా వేడుకలు జరుపుతుండగా, వ్యాపారస్థులు రిలాక్సేషన్‌తో పాటు నెట్‌వర్కింగ్ కలిసిన ఎక్స్‌క్లూజివ్ గెట్ టు గెదర్‌లను ఎంచుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టు న్యూఇయర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి, హైదరాబాద్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతతను, ప్రకృతి అనుభూతులను, రిలాక్సేషన్‌ను ఎంచుకుంటున్నారు. 2025కి బై బై చెప్పే ఈ ప్రయాణంలో నగరవాసులు ప్రకృతితో చేతులు కలిపి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు. ఇది హైదరాబాద్ లైఫ్ స్టైల్‌లో కనిపిస్తున్న ఒక అందమైన మార్పు అని చెప్పవచ్చు.
నేచర్ థీమ్.. బెస్ట్ స్పాట్..
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈసారి ట్రెక్కింగ్ ఉన్న నేచర్ స్పాట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. న్యూ ఇయర్ డే ఉదయం ట్రెక్కింగ్ చేసి, ప్రకృతితో కలిసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలన్న ఆలోచన యువతను భారీగా ఆకర్షిస్తోంది. వికారాబాద్ అడవులు, షామీర్‌పేట్ పరిసర ప్రాంతాలు, నగరానికి సమీపంలోని హిల్ స్టేషన్స్ ఉన్న ప్రాంతాలతో పాటు అగ్రీ బేస్డ్ క్యాంప్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.



