'నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను' | How to overcome anger and tips for self restriction | Sakshi
Sakshi News home page

నాకున్న ఈ సమస్యకు పరిష్కారం ఉందా?

Feb 12 2026 1:41 PM | Updated on Feb 12 2026 1:52 PM

How to overcome anger and tips for self restriction

నా వయసు 34 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ. చిన్న విషయాలకే ఒళ్లు తెలియని కోపంతో చేతిలో ఏది ఉంటే దానితో కొట్టడం, ఖరీదైన ఫోన్లు, టీవీలు పగలగొట్టడం జరుగుతోంది. కోపావేశంలో నా ముందున్న వ్యక్తి ఎవరు అనే ఆలోచన లేకుండా దాడి చేసే పరిస్థితి వస్తోంది. దీనివల్ల నా భార్య, పిల్లలు చాలా భయపడుతున్నారు. కోపం తగ్గిన తరువాత చాలా బాధ, పశ్చాత్తాపం ఉంటాయి. కానీ ఆ సమయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నాకు ఇతర మానసిక, శారీరక సమస్యలు ఏవీ లేవు. ఒకసారి మానసిక వైద్యుడిని కలవాలని అనుకుంటున్నాను. నాకు ఉన్న ఈ సమస్యకు సరైన చికిత్స లేదా పరిష్కారం ఉందా?
– రవికుమార్, హిందూపూర్‌

మీ సమస్యను ఇతరుల మీద నెట్టకుండా, మీరే బాధ్యత తీసుకుని మారాలనుకోవడం నిజంగా అభినందనీయం. మీరు వివరించిన లక్షణాలను వైద్య పరిభాషలో ఇగో డిస్‌కంట్రోల్‌ సిండ్రోమ్‌ (ego dyscontrol syndrome) లేదా ఇంటర్మిటెంట్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డిసార్డర్‌ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారు చాలా చిన్న విషయాలకే అసాధారణమైన కోపం, ఆవేశానికి గురవుతారు. ఆ సమయంలో తనపై పూర్తిగా నియంత్రణ కోల్పోయి విలువైన వస్తువులను పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, మాటలతో లేదా చర్యలతో ఇతరులపై దాడి చేయడం వంటి ప్రవర్తనలు చేస్తాడు. కోపం తగ్గిన తరువాత మాత్రం పశ్చాత్తాపం, తప్పు చేశాననే భావన ఎక్కువగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం, ఇలాంటి వ్యక్తుల మెదడులో సెరటోనిన్‌ (Serotonin) అనే రసాయనం తక్కువ స్థాయిలో ఉండటం గమనించవచ్చు. ఇది చాలా సందర్భాల్లో జన్యుపరంగా వచ్చే సమస్యగా కూడా ఉండవచ్చు. అంటే, సెరటోనిన్‌ తయారు చేసే వ్యవస్థలోనే లోపం ఉండే అవకాశం ఉంది.

అలాగే వారు పెరిగిన వాతావరణం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, కొన్ని అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే అమీగ్డాలా, ఫ్రాంటల్‌ కార్టెక్స్‌ వంటి భాగాలు సరిగా పనిచేయకపోయినా కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమస్యకు పూర్తిగా చికిత్స ఉంది. సైకోథెరపీ, కోప నియంత్రణ చికిత్స లతోపాటు, మెదడులో సెరటోనిన్‌ స్థాయిని పెంచేందుకు తగిన మందులను, మనసుని స్థిమితపరిచే మూడ్‌ స్టెబిలైజర్స్‌ వంటి మందుల్ని వైద్యుల పర్యవేక్షణలో వాడడం వలన మంచి మెరుగుదల కనిపిస్తుంది.

చ‌ద‌వండి: కొలీగ్‌పై ఫీలింగ్స్ వ‌స్తున్నాయి.. ఏం చేయాలి?

సమయానికి చికిత్స తీసుకుంటే, కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యం అవుతుంది. దీనిద్వారా కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు. ఈ సందర్భంగా మనసుకవి ఆత్రేయ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా’. విరిగిన వస్తువుల్ని అతికించవచ్చు, లేదా మళ్ళీ సంపాదించొచ్చు. కానీ విరిగిన మనసులని, దూరం అయిన బంధాలని మళ్ళీ దగ్గరగా చేసుకోవాలంటే దానికి చాలా శ్రమ అవసరం. కోపాన్ని జయించినవాడే తన జీవితాన్ని జయిస్తాడు అనే విషయాన్ని అందరూ  గుర్తుపెట్టుకోవాలి. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement