తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం కోర్టు అల్టిమేటం | Supreme Court Last Warn To Telangana Speaker | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుల వ్యవహారం.. తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం కోర్టు అల్టిమేటం

Jan 16 2026 12:14 PM | Updated on Jan 16 2026 1:06 PM

Supreme Court Last Warn To Telangana Speaker

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చేందుకు తగిన సమయం ఇచ్చినా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఫిరాయింపుల ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ వేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఇప్పటికే ఏడుగురి విషయంలో స్పీకర్‌ ఓ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్‌ తరఫున అభిషేక్‌ సంఘ్వీ వాదనలు వినిపించారు. మరో ముగ్గురిని విచారణ జరపాల్పి ఉందని నివేదించారు. 

‘‘ఏడుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్‌కు కంటి సర్జరీ జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మారారు. అందువల్ల విచారణ కొంత ఆలస్యమైంది. నాలుగు వారాల సమయం ఇవ్వండి విచారణ పూర్తి చేస్తాం’’ అని కోర్టుకు తెలిపారు. 

బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా అధికార పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ తాను పార్టీ మారలేదని అంటున్నారు. ఈ వాదనలో న్యాయమేమైనా ఉందా?. స్పీకర్ వారిని ఇప్పటికీ విచారించడం లేదు. మూడు నెలలకు పైగా  గడిచిపోయాయి. ప్రతిసారి విచారణకు గడువు పెంచమని  అడుగుతున్నారు’’ అని వాదించారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ తరఫు లాయర్‌ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.. 

‘‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం.. ఈ పాటికే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. ఇదే చివరి అవకాశం. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి. లేకుంటే పరిణామాలు ఉంటాయి’’ అని స్పీకర్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన ఎమ్మెల్యేల విచారణను నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వీ కోరారు. అయితే రెండు వారాల్లోపురోగతి చూపిస్తే.. నాలుగు వారాల సమయం ఇస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

తమ పార్టీ సింబల్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే..  ఈ ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్‌ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్‌ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో.. ఇప్పుడు సుప్రీం కోర్టు అల్టిమేటంతో ఎమ్మెల్యేలను స్పీకర్‌ విచారించాల్సిన పరిస్థితి ఎదురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement