రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు స్వయంగా రావాల్సిందే
వీధి కుక్కల బెడద కేసుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: వీధి కుక్కల బెడద నివారణకు ఏం చర్యలు తీసుకున్నదీ తెలపాలంటూ తామిచ్చిన ఉత్తర్వును అత్యధిక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. న్యాయస్థానం ఉత్తర్వులంటే గౌరవం లేదంటూ ఆక్షేపించింది. ఈ నెల 3న జరిగే విచారణ చీఫ్ సెక్రటరీలు వివరణతో సహా రావాలనే ఆదేశాల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు స్వయంగా రావాల్సిందేనని శుక్రవారం కుండబద్దలు కొట్టింది. ‘ఇది ఆ కుక్కల బెడద అంశం. మా పొరపాటు కారణంగా, గౌరవ న్యాయమూర్తులు ప్రధాన కార్యదర్శులను పిలవాల్సి వచ్చింది. మా అభ్యర్థన ఏమిటంటే, వారు భౌతికంగా కాకుండా, వర్చువల్‌గా హాజరు కావచ్చా?’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వినతిపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
‘మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా ఏళ్లుగా నానబెడుతున్న సమస్యలపై ఈ న్యాయస్థానం సమయాన్ని వృథా చేసుకోవాల్సి రావడం ఎంతో దురదృష్టకరం. పార్లమెంట్ స్వయంగా ఏనిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) కోసం రూపొందించిన నిబంధనలున్నాయి. వాటి అమలు పరిస్థితిని తెలుసుకునేందుకు సమన్లు జారీ చేశాం. పట్టించుకోకుండా చీఫ్ సెక్రటరీలు నిద్రపోతున్నారు. న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా పోయింది. వాళ్లని రానివ్వండి. ఆ విషయం మేం చూసుకుంటాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నందున తనకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు కల్పించాలంటూ బిహార్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేసిన వినతిని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించడం తెల్సిందే.


