ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు.. ప్రపంచాన్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకసారి సైనిక చర్యకు సిద్ధమని.. మరోసారి శాంతి చర్చలని.. ఇంకోసారి ఇరాన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే అందుకు కారణం. దీంతో ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన సరిగా అంచనా వేయలేకపోయారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో..
పోటస్(President of the United States) ట్రంప్ ఫేస్ చూసి ఇరాన్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమ దేశంలో తలెత్తిన సంక్షోభంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని.. ఖమేనీని గద్దె దించుతుందని.. తమకు స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు బలంగా నమ్మారు. ఆ ఆశతోనే నిరసనల్లో ఉవ్వెత్తున పాల్గొని మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా.. అరెస్టులు జరిగినా లెక్క చేయలేదు. అయితే తమను ఇంతలా రెచ్చగొట్టిన ట్రంప్.. చివరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని తిట్టిపోస్తున్నారు.
ఆ ప్రకటన తర్వాతే..
మతపరమైన పాలనపై ఎప్పటి నుంచో ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ఆర్థిక సంక్షోభం తోడైంది. సోషల్ మీడియా ప్రచారం ద్వారా డిసెంబర్ 28న రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. అదే సమయంలో వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్లింది. ఇది సాధారణంగానే ఇరాన్ ప్రజలకు ఆశలు పుట్టించింది.
అగ్నికి ఆజ్యం తోడైనట్లు.. అప్పటికే రోడ్డెక్కిన ఆందోళనకారులకు ట్రంప్ ప్రకటనలు బలాన్ని ఇచ్చాయి. ‘‘సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి’’ అని.. ‘‘లాక్డ్ అండ్ లోడెడ్’’ అంటూ చేసిన సో.మీ. పోస్టులు చూసి వేల మంది రోడ్డెక్కారు. అయితే నిరసనలు మళ్లీ ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం పాత పద్ధతులను అనుసరించింది. కమ్యూనికేషన్లు నిలిపివేయడం, భద్రతా బలగాలను మోహరించడం, కాల్పులు జరపడం. దేశవ్యాప్తంగా స్నైపర్ దాడులు, మెషిన్ గన్ కాల్పులు, వందలాది మరణాలు, అదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ప్రజలు ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని బలంగా ఫిక్సయ్యారు. సరిగ్గా అప్పుడే..
అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ నుంచి ఇరాన్‌కు యుద్ధ విమానాలు రెడీ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఏ క్షణమైనా అమెరికా తమ భూభాగంపై దాడులు జరుపుతుందని ఆకాశం వంక చూడసాగారు. అనూహ్యంగా ట్రంప్ వెనక్కి తగ్గి.. ‘‘ఇరాన్ నాయకత్వం ఆందోళనకారుల ఉరి శిక్షలు ఆపుతామని హామీ ఇచ్చింది.. అందుకు కృతజ్ఞలు అని చెబుతూ సైనిక చర్య జరగదని పరోక్షంగా చెప్పేశారు. ఈ ప్రకటన ఇరాన్ నిరసనకారులకు గట్టి షాక్ ఇచ్చింది.
ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ నిరసనలను కొందరు అధికారులు ఎగతాళి చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నవాళ్లకు ఇక చుక్కలు చూపిస్తామంటూ కొందరు బాహటంగానే ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఇరాన్‌లో నిరసనలు చాలా వరకు చల్లారాయి. మళ్లీ జరుగుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బలిపశువుల్ని చేశారా?
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని ట్రంప్ కచ్చితంగా ఏదో ఒకటి చేస్తారని భావించామని.. కానీ, చివరకు ఆయనొక బిల్డప్ బాబాయ్‌గా తేలిపోయిందని గాలి తీస్తున్నారు ఇరాన్ ప్రజలు. ఓ అంతర్జాతీయ మీడియా అక్కడి ప్రజలను ఇంటర్వ్యూ చేసింది. ఆందోళనల్లో వేలమంది మరణించారు. ఆ మరణాలకు ట్రంపే బాధ్యుడు అంటూ ఓ వ్యాపారి తెలిపాడు. అమెరికా అధ్యక్షుడి పిలుపుతోనే వేలమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చివరికి ఆయన మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మమ్మల్ని మోసం చేశాడు అని ఆరోపించింది మరో మహిళ. మరికొందరేమో.. ట్రంప్ తమను బలిపశువుల్ని చేశాడంటూ తిట్టిపోస్తున్నారు.
అయితే, కొంతమంది మాత్రం ట్రంప్ వెనకడుగు వ్యూహాత్మకమని.. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసి దెబ్బ తీస్తాడని చెబుతుండడం కొసమెరుపు.


