అందెశ్రీ ఇక లేరు | Telangana state anthem lyricist Andesri dies at 64 | Sakshi
Sakshi News home page

అందెశ్రీ ఇక లేరు

Nov 11 2025 5:54 AM | Updated on Nov 11 2025 5:56 AM

Telangana state anthem lyricist Andesri dies at 64

ఇంట్లో కుప్పకూలిన సాహితీ దిగ్గజం

ఆస్పత్రికి తరలించే సరికే కన్నుమూత 

ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్‌ సహా

ప్రముఖుల సంతాపం 

నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు 

చిరస్థాయిగా నిలిచే కవిత్వం రాసిన అందె ఎల్లయ్య 

పశువులు మేపుతూనే ఆశువుగా పాటలు

సాక్షి, హైదరాబాద్‌/లాలాపేట/మద్దూరు (హుస్నాబాద్‌):  తెలంగాణ సాహితీ దిగ్గజాలలో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రజా, ప్రకృతి కవి, గాయకుడు అందెశ్రీ (64) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌ లాలాపేటలోని తన ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీని కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి వచ్చేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు వల్ల చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన అందెశ్రీకి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం ఉదయం ఘట్‌కేసర్‌ మండలంలోని ఎన్‌ఎఫ్‌సీ ప్రాంతంలో అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎంతో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఘట్‌కేసర్‌ బైపాస్‌ రోడ్డు వద్ద ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి సమీపంలోని హెచ్‌ఎండీఏకు చెందిన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. అందెశ్రీ మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తదితర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.  

ప్రముఖుల శ్రద్ధాంజలి 
అందెశ్రీ భౌతిక కాయాన్ని గాంధీ ఆస్పత్రి నుంచి ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం లాలాపేటలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంకు తరలించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పద్మారావు గౌడ్, ఎంపీ ఈటల రా జేందర్, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, గోరటి వెంకన్న, ప్రొఫెసర్‌ కోదండరాం, కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు, డిప్యూటీ మేయర్‌ ఎం. శ్రీలత శోభన్‌రెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీక చంద్రారెడ్డి, కవి జయరాజ్‌తో పాటు పలువురు కవులు, కళాకారులు అందెశ్రీ భాతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అందెశ్రీ సాహిత్య సేవలను, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు.  

రేబర్తి దిగ్భ్రాంతి 
అందెశ్రీ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కన్నుమూత వార్త వినగానే సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామస్తులు, ఆయన స్నేహితులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అందెశ్రీ రేబర్తి గ్రామానికి చెందిన అందె ఎల్లమ్మ, బొడ్డయ్య దంపతులకు 1961 జూలై 18న రెండో సంతానంగా జని్మచారు. ఆయనకు అక్క రాజమ్మ, తమ్ముడు రాములు ఉన్నారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. అయితే గ్రామస్తులు ఎల్లన్న అని పిలిచేవారు. కడు పేదరికం కారణంగా తల్లిదండ్రులు అందెశ్రీని చిన్నప్పుడు పశువుల పాలేరుగా చేర్చారు.

పశువులను మేపుతూనే ప్రకృతి ఒడిలో ఆశువుగా పాటలు పాడేవారు. తన 18వ ఏట నిజామాబాద్‌కు వెళ్లి తాపీమేస్త్రీగా పని చేశారు. అదే సమయంలో శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్‌ మహరాజ్‌ ఆయనలోని ప్రతిభను గుర్తించి, భవిష్యత్తులో గొప్ప కవి అవుతావని చెప్పి అందె ఎల్లయ్యగా ఉన్న పేరును అందెశ్రీగా మార్చారు. కాగా అందెశ్రీ చేర్యాల మండలం బండపల్లికి చెందిన మల్లమ్మను వివాహం చేసుకున్నారు. తాపీ మేస్త్రీగానే కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ తార్నాక లాలాపేట వినోభానగర్‌కు వలస వచ్చారు. తన ఆశు కవిత్వంతో స్థానికులను అలరించేవారని లాలాపేట వాసులు చెప్పారు.   

స్వగ్రామంపై గేయం 
అందెశ్రీకి తన స్వగ్రామమైన రేబర్తితో మంచి అనుబంధం ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం గ్రామంలో జరుగుతున్న బీరప్ప పండుగ కోసం వచి్చన సమయంలో ‘సూడ సక్కాని తల్లి.. సుక్కల్లో జాబిల్లి’ అంటూ తన ఊరు గొప్పతనంతో పాటు కులవృత్తుల వైభవాన్ని చాటేలా పాట రాశారు. గ్రామంలోని పాఠశాలను పలుమార్లు సందర్శించి విద్యార్థులకు దిశానిర్దేశం చేసేవారు. 1988లో రేబర్తి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. గతంలో ప్రభుత్వం ఆయనకు 500 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వగా, ఇటీవల గ్రామంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని తన శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు తన మిత్రులకు తెలిపారు.  

ప్రపంచమే పాఠశాలగా.. 
అందె ఎల్లయ్య చదువుకోనప్పటికీ కవిత్వాన్ని అలవోకగా చెప్పేవారు. జనం నాల్కలపై చిరస్థాయిగా నిలిచిపోయేలా కవితలు రాశారు. ఆయనకు గురువులు లేరు. ఆయనకు ప్రపంచమే పాఠశాల. జీవన అనుభవ మూలాల నుంచి తాతి్వకత నిండిన చిక్కని కవిత్వాన్ని చెప్పటం అందెశ్రీకే చెల్లింది. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..’ అన్న పాట నేటి సమాజాన్ని, మానవ సంబంధాల్ని మనకు అద్దంలా చూపుతుంది. ఈ ఒక్క పాదం లక్షలాది మంది ప్రజల సెల్‌ఫోన్‌ రింగ్‌టోన్‌గా మారింది. ఆయన కంఠమే ఒక ధూంధాం అన్నట్టుగా అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై రాసిన ‘జయ జయహే తెలంగాణ..’ గీతం కోట్లాదిమందిని ఉర్రూతలూగించింది. తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా నిలిచి కోట్లాది మంది గుండెల్లో ప్రతిధ్వనించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత ఆ గేయాన్ని కొన్ని మార్పులతో రాష్ట్ర గీతంగా ప్రకటించింది.  

మది నిండా నదులు 
మానవ జీవన పరిణామ క్రమం మీద, నదుల మీద సుదీర్ఘ కావ్యం రచించారు. నదులు పుట్టిన చోటుకు వెళ్లి అక్కడ అలల మీద తిరుగాడుతూ కవిత్వాన్ని అల్లుకుంటూ పద్యమై, పాటై పల్లవించారు. నైలు నదిని చూశారు. అమెజాన్‌ నది పుట్టిన ప్రదేశానికీ వెళ్లారు. మిసిసిపి, కాంగో, జాంబేజీ నదుల దగ్గరకు వెళ్లి వాటి ప్రవాహ సవ్వడిని, అలల తాకిడిని విన్నారు. ‘నది నడిచిపోతున్నదమ్మా.. నన్ను నావనై రమ్మన్నదన్నా..’ అంటూ రమ్యమైన పాటను రచించారు.  

పాటలు.. పురస్కారాలు 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్‌ 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. ‘బతుకమ్మ’ సినిమాకు మాటలు రాశారు. అనేక సినిమాలకు పాటలు రాశారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా..’, ‘గలగల గజ్జెల బండి..’, ‘పల్లె నీకు వందనాలు..’, ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు..’ వంటి అనేక పాటలు రాశారు. పలు అవార్డులను అందుకున్నారు.

‘లోకకవి’ అవార్డు, విశాఖ లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ నుంచి ‘లోక్‌నాయక్‌’ అవార్డు, డాక్టర్‌ రావూరి భరద్వాజ పురస్కారం, సుద్దాల హన్మంతు పురస్కారం, వంశీ ఇంటర్నేషనల్‌ దాశరథి పురస్కారం తదితరాలు అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆయన పాటలు అనేక విశ్వవిద్యాలయాల సిలబస్‌లో చోటు చేసుకున్నాయి. ‘గంగా’ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. గణపతి సచి్చదానంద స్వామి నుంచి స్వర్ణ కంకణం పొందారు. ఆయన కవిత్వం, పాటలు కలిపి ఇటీవలే ‘నిప్పుల వాగు’ అన్న బృహత్‌ సంకలనాన్ని అందెశ్రీ సంపాదకత్వంలో వెలువరించారు.

సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు – ప్రధాని మోదీ సంతాపం 
అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా తెలుగులో ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు. ‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన.. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు, అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే.. ప్రజల సాంఘిక హృదయ స్పందనకు రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన.. సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను..’ అని మోదీ పేర్కొన్నారు.

అందెశ్రీ మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు 
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి  
సాక్షి, అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ ప్రత్యేకతను చాటారని తెలిపారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కారి్మకుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

బాధాకరం: అమిత్‌ షా 
తెలుగు కవి, గేయ రచయి త అందెశ్రీ మరణం బాధాకరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నా రు. ‘అందెశ్రీ చిరస్మరణీ యుడు. తెలంగాణలోని ప్రజల గొంతులను శక్తివంతం చేయడానికి, తన సృజనాత్మకత ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన మరణం మన సాహిత్య, సాంస్కృతిక రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం..’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.  

నిజమైన భూమి పుత్రుడు: మల్లికార్జున ఖర్గే 
‘అందెశ్రీ మరణం తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య ఆత్మలో లోతైన శూన్యతను మిగిలి్చంది. పేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన నిజమైన భూమి పుత్రుడు ఆయన. గొప్ప కవిగా ఆయన మాటలు తెలంగాణ ఉద్యమానికి హృదయ స్పందనగా మారాయి. ఆయన కుటుంబానికి, స్నేహితులు, అభిమానులకు నా హృదయ పూర్వక సంతాపం..’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

సాహితీ శిఖరం నేల కూలింది: సీఎం 
అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.  

సాంస్కృతిక దిగ్గజాన్ని కోల్పోయాం: రాహుల్‌గాంధీ 
‘అందెశ్రీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన స్వరం ‘జయ జయహే తెలంగాణ’ ద్వారా తెలంగాణకు ఆత్మను ఇచి్చంది. ఇది గుర్తింపు, స్థితిస్థాపకత, సామూహిక గర్వానికి చిహ్నంగా మారింది. ఆయన మరణంతో మనం ఒక సాంస్కృతిక దిగ్గజాన్ని కోల్పోయాము. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు.  

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు
త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: అందెశ్రీ మరణం పట్ల త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తంచేశారు. సాహితీ లోకా నికి అందెశ్రీ లేని లోటు తీర్చలేనిదని, తన కలం, గళంతో ప్రజానీకాన్ని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని నివాళులర్పించారు. ప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు.. యావత్‌ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి పేర్కొన్నారు.  

సాహిత్యానికి తీరని లోటు: కేటీఆర్‌ 
అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటని మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అందెశ్రీ పారి్థవదేహానికి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. 

ప్రముఖుల దిగ్భ్రాంతి: అందెశ్రీ మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క సంతాపం తెలిపారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు, వివిధ పారీ్టల ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ సంతాపం తెలిపారు.

తెలంగాణకు తీరనిలోటు: కేసీఆర్‌ 
అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో.. కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఒకే పాటై పయనించాం: గోరటి
తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం ఒకే పాటై పయనించామని, ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆవేదన వ్యక్తంచేశారు. లాలాపేట్‌లోని జీహెచ్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియంలో అందెశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పద సాహిత్యం, పద్య కవిత్వం నుంచి తనదైన దారి వేసుకొని సాగిపోయిన గొప్ప కవి అందెశ్రీ అని కొనియాడారు.

మూడు రోజులుగా అస్వస్థత: ప్రొఫెసర్‌ సునీల్‌కుమార్‌ 
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): అందెశ్రీని గాంధీ ఆస్పత్రికి తెచి్చనప్పటికే ఆయన మృతి చెందారని, దీంతో బ్రాట్‌ డెడ్‌గా డిక్లేర్‌ చేశామని గాంధీ ఆస్పత్రి జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సునీల్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. ఆదివారం రాత్రి భోజనం చేసి పడుకున్నారని, ఉదయం చూసేసరికి బాత్‌రూమ్‌ వద్ద పడి ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారని చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో ఆయన మృతి చెంది ఉంటారని భావిస్తున్నామని, సోమవారం ఉదయం 7.18 గంటలకు గాంధీ ఆస్పత్రికి తెచ్చినప్పటికే ఆయన శరీరం గట్టి పడి ఉందని పేర్కొన్నారు.

అందెశ్రీ ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. గత ఐదేళ్లుగా హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నారని, నెలరోజుల నుంచి బీపీ మాత్రలు వేసుకోవడం లేదని చెప్పారు. గత మూడు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నా వైద్యుని సంప్రదించలేదని, ఛాతీలో స్వల్పంగా వచి్చన నొప్పిని గ్యా్రస్టిక్‌ సమస్యగా భావించి ఉండొచ్చునని అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement