చెక్‌డ్యాం పేల్చివేతరూ.3 కోట్ల వరకు నష్టం...
యాసంగి సాగు ప్రశ్నార్థకం
ఓదెల(పెద్దపల్లి)/జమ్మికుంట: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల–తనుగుల గ్రామాల మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను శుక్రవారం రాత్రి కొందరు దుండగులు పేల్చివేశారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం మానేరుపై రూ.25 కోట్ల వ్యయంతో 737 మీటర్ల పొడవునా చెక్‌డ్యాం నిర్మించింది. దుండుగులు జిలెటిన్ స్టిక్స్ అమర్చి కంట్రోల్ బ్లాస్ట్ పద్ధతిన పేల్చివేయడంతో చెక్‌డ్యాం ధ్వంసమైంది.
దాదాపు 90 మీటర్ల పొడవున కుంగిపోగా, ప్లాట్‌ఫాం చెల్లాచెదురైంది. తొలుత చెక్‌డ్యాం గోడను కూల్చివేయడానికి దుండగులు ప్రయతి్నంచారని, అది సాధ్యం కాకపోవడంతో జిలెటిన్‌స్టిక్స్ అమర్చి పేల్చివేసినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇందులో పదిమంది వరకు పాల్గొన్నట్టు సమాచారం. పేల్చివేతతో రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్పారు. ఘటనపై నీటిపారుదల శాఖ డీఈ రవి జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇసుక మాఫియా పనేనా?
తవ్వకాలకు అడ్డుగా ఉందనే కారణంతోనే ఇసుక మాఫియా దీనిని పేల్చివేసినట్టు అనుమానిస్తున్నారు. చెక్‌డ్యాం కూలిపోవడంతో చుక్కనీరు లేకుండా దిగువకు వెళ్లిపోయింది. దీంతో గుంపుల, తనుగుల, శంభునిపల్లె, పోచంపల్లి, ఇందుర్తి గ్రామాల్లోని సుమారు 3 వేల ఎకరాల్లోని ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు లబోదిబో మంటున్నారు.
సంఘటన స్థలాన్ని మంథని ఇరిగేషన్‌శాఖ ఈఈ బలరాం సందర్శించారు. బాంబు, డాగ్‌స్క్వాడ్ పోలీసులు, ఫింగర్ ప్రింట్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విచారణ ప్రారంభించి, పేల్చివేతకు గల కారణాలపై అణువణువూ శోధిస్తున్నాయి.
ఇసుక మాఫియా పనే
పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల 16 చెక్‌డ్యాంలు నిర్మించాం. గుంపుల–తనుగుల మధ్య ఉన్న చెక్‌డ్యాంను కొందరు పేల్చి వేశారు. ఇది ఇసుక మాఫియా పనేనని భావిస్తున్నాం. – బలరాం, ఈఈ, ఇరిగేషన్
ఈసారి పంటలు లేనట్టే..
చెక్‌డ్యాంను ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులే పేల్చివేశారు. దీని పరిధిలో వేల ఎకరాల వ్యవసా య భూములు ఉన్నాయి. ప్రస్తు తం యాసంగి సీజన్. కొద్దిరోజు ల్లో నారుపోసి, నాట్లు వేసే అవకాశముంది. చెక్‌డ్యాంలో చుక్కనీరు లేదు. ఈసారి పంటలు పోయినట్టే. – ఉప్పుల సంపత్, మాజీ సర్పంచ్, గుంపుల


