తల్లిదండ్రులను విస్మరించిన తనయులకు ఝలక్
వలిగొండ/తిప్పర్తి: కన్నవారి సంరక్షణను పట్టించుకోని కుమారుల నుంచి ఆస్తులను తిరిగి తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు చోట్ల ఈ ఘటనలు జరిగాయి.
» యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన కొమిరెల్లి జనార్దన్‌రెడ్డి–భారతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అందరి వివాహాలు చేశారు. జనార్దన్‌రెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేసి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్నారు. చాలాకాలం కిత్రం హైదరాబాద్ వెళ్లిపోయి కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు.
ఆయనకు అరూర్‌లో, హైదరాబాద్‌లోనూ ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను కూతుళ్లకు రాసి ఇవ్వగా, అరూర్‌లో ఉన్న 18 ఎకరాల 16 గుంటల భూమిని 2007లో కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి పేరున గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చి, వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పాడు. దీంతో జనార్దన్‌రెడ్డి ఇటీవల కలెక్టరేట్‌లోని వయోవృద్ధుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన కలెక్టర్ హనుమంతరావు.. గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి ఆస్తిపై జనార్దన్‌రెడ్డికి హక్కులను పునరుద్ధరించారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు తీసుకునే హక్కుతోపాటు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా బిడ్డలకు ఉంటుందని స్పష్టం చేశారు.
» నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేట గ్రామానికి చెందిన లోకాని కోటయ్యకు ఇద్దరు కుమారులు. తనకున్న 13 ఎకరాల భూమిని సమానంగా వారి పేరున రిజిస్ట్రేషన్ చేశాడు. కోటయ్య భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఒక కుమారుడు తన ఆలనాపాలనా చూసుకోవడం లేదని ఇటీవల నల్లగొండ ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ఇద్దరు కుమారులు తండ్రికి రూ.8 వేల చొప్పున నెలకు రూ.16 వేలు ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించారు. అవి కూడా ఒక కొడుకు ఇవ్వడం లేదు. దీంతో కోటయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ స్పందించి ఇద్దరు కుమారుల భూమిలో నుంచి రెండు ఎకరాల 34 గుంటల భూమిని తిరిగి కోటయ్య పేరున రికార్డు చేయించారు.


