ఈసీయే కారణమంటూ సూసైడ్ నోట్: సీఎం మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్‌వో)గా వ్యవహరిస్తున్న రింకూ తరఫ్దార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శనివారం ఆమె తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)కు సంబంధించిన ఒత్తిడుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు.
బీఎల్‌వో రింకు సూసైడ్ నోట్‌ను సీఎం మమతా బెనర్జీ ఎక్స్‌లో షేర్ చేశారు. కృష్ణనగర్ జిల్లా చప్రాలోని వివేకానంద్ విద్యామందిర్‌లో పారా టీచర్‌గా పనిచేస్తున్న రింకు (52) తన నివాసంలో ఉరి వేసుకున్నారని ఆమె తెలిపారు. ఎస్‌ఐఆర్ కోసం ఇంకెందరు చనిపోవాలని ఈసీని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ఎస్‌ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ఎన్నికల కమిషన్(ఈసీ) ఒత్తిళ్ల కారణంగా ఇప్పటి వరకు 30మందికిపైగా బీఎల్‌వోలు తనువు చాలించినట్లు అధికార టీఎంసీ పేర్కొంది.
ఈ మరణాలకు ఈసీయే బాధ్యత వహించాలంది. ఎస్‌ఐఆర్‌ను తక్షణమే ఆపేయాలంటూ సీఎం మమత గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు. సీఎం మమత ఆరోపణలను బీజేపీ ఖండించింది. అది ఫేక్ సూసైడ్ నోట్ అని తెలిపింది. చేతనైతే ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించి, నిగ్గు తేల్చాలంది. రింకు తరఫ్దార్ టీఎంసీ ఒత్తిడుల వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారిని ఈసీ ఆదేశించింది.


