breaking news
booth level officer
-
బెంగాల్లో బీఎల్వో ఆత్మహత్య
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని నడియా జిల్లాలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్వో)గా వ్యవహరిస్తున్న రింకూ తరఫ్దార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శనివారం ఆమె తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన ఒత్తిడుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. బీఎల్వో రింకు సూసైడ్ నోట్‌ను సీఎం మమతా బెనర్జీ ఎక్స్‌లో షేర్ చేశారు. కృష్ణనగర్ జిల్లా చప్రాలోని వివేకానంద్ విద్యామందిర్‌లో పారా టీచర్‌గా పనిచేస్తున్న రింకు (52) తన నివాసంలో ఉరి వేసుకున్నారని ఆమె తెలిపారు. ఎస్ఐఆర్ కోసం ఇంకెందరు చనిపోవాలని ఈసీని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ఎన్నికల కమిషన్(ఈసీ) ఒత్తిళ్ల కారణంగా ఇప్పటి వరకు 30మందికిపైగా బీఎల్వోలు తనువు చాలించినట్లు అధికార టీఎంసీ పేర్కొంది. ఈ మరణాలకు ఈసీయే బాధ్యత వహించాలంది. ఎస్ఐఆర్ను తక్షణమే ఆపేయాలంటూ సీఎం మమత గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు. సీఎం మమత ఆరోపణలను బీజేపీ ఖండించింది. అది ఫేక్ సూసైడ్ నోట్ అని తెలిపింది. చేతనైతే ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించి, నిగ్గు తేల్చాలంది. రింకు తరఫ్దార్ టీఎంసీ ఒత్తిడుల వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారిని ఈసీ ఆదేశించింది. -
పోలింగ్‌కు..యంత్రాలు సిద్ధం
సాక్షి,నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ (మిక్సింగ్) మొదటి విడత పూర్తి చేశారు. పోలింగ్‌లో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లకు మూడు విడతల్లో ర్యాండమైజేషన్ చేయాల్సి ఉంది. బెల్ కంపెనీకి సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను గోదాముల్లోనే ఉంచి రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు. అనంతరం గట్టి బం దోబస్తుతో భద్రపర్చారు. ఆ యంత్రాలకు సం బంధించి ఆన్లైన్లో నంబర్లను అన్నింటినీ ర్యాం డమైజేషన్ చేశారు. ఆ విధంగానే ఓ బాక్స్‌లోని 10 యంత్రాలను మార్చివేరే బాక్స్‌లలోకి మార్చారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా యంత్రాలను సిద్ధం చేసి పెట్టారు. ఒక్కో బాక్సులో 10 ఓటింగ్యంత్రాలు ఉంటాయి. అందులో ఏ నియోజకవర్గానికి సంబంధించిన యంత్రం ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఆ విధంగా మొదటి విడత ర్యాండమైజేషన్ చేశారు. ఆయా బాక్సుల్లో ఉన్నవాటన్నింటినీ బార్కోడ్ ఆధారంగా ఆయా నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అనంతరం వాటిని నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరుస్తారు. అక్కడ రెండో విడత ర్యాండమైజేషన్ జరుగుతుంది. ఆ సందర్భంలో ఏయే యంత్రం ఎక్కడ వెళ్తుందో కూడా ఎన్నికల సిబ్బందికి తెలిసే అవకాశం లేదు. ఆ విధంగా అధికారులు ఆన్లైన్లో యంత్రాల బార్ కోడ్ఆధారంగా రాజకీయ పక్షాల ముందే మిక్సింగ్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి పోలింగ్‌ముందు రోజు డ్రిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ర్యాండమైజేషన్ చేసి ఏ పోలింగ్ బూత్‌కు ఏ ఈవీఎం, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ వెళ్లాల్సి ఉందో ఆ విధంగా ఆయా పోలింగ్‌బూత్‌లకు కేటాయించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు అందిస్తారు. అక్కడినుంచి నేరుగా ఎన్నికల విధులలో భాగంగా పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్తారు. అప్పటివరకు కూడా ఏ యంత్రం ఎటు వెళ్తుందో కూడా తెలియనివ్వరు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ యంత్రాల కేటాయింపు : దేవరకొండ 338 నాగార్జునసాగర్ 329 మిర్యాలగూడ 288 మునుగోడు 318 నకికరేకల్ 337 నల్లగొండ 316 18శాతం అదనంగా యంత్రాలు.. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్‌బూత్‌లను బట్టి అదనంగా ప్రతి నియోజకవర్గానికి 18 శాతం యంత్రాలను అందిస్తున్నారు. అదనంగా తీసుకున్న వాటిని నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ కార్యాలయంలో ఉంచుతారు. పోలింగ్ సమయంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తి ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడితే వీటిని ఉపయోగించనున్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరి«ధిలో అదే విధంగా ఉపయోగిస్తారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్‌లు, యంత్రాలు... దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 286 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం అదనంగా కలుపుకుంటే అదనంగా మరో 52 యంత్రాలు ఇవ్వనున్నారు. అంటే ఆ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్యూనిట్లు, వీవీ ప్యాట్లు 338 అందనున్నాయి. అదే విధంగా నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలో 278 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం కలుపుకుంటే అదనంగా మరో 51 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 329 యంత్రాలు సాగర్ నియోజకవర్గానికి అందనున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో 244 పోలింగ్‌బూత్‌లు ఉండగా అదనంగా 44 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 288 యంత్రాలు సాగర్ నియోజకవర్గానికి అందనున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 269 పోలింగ్‌బూత్‌లు ఉండగా 49కలుపుకొని మొత్తం 318 యంత్రాలు కేటాయించారు. నకికరేకల్లో నియోజకవర్గంలో 285 పోలింగ్‌బూత్‌లు ఉండగా 337 యంత్రాలు కేటాయించారు. నల్లగొండ నియోజకవర్గానికి సంబం«ధించి 267 పోలింగ్ స్టేషన్లకు 316 బ్యాలెట్, కంట్రోల్, వీవీ ప్యాట్లను కేటాయించారు. -
ఎన్నికల విధులకు 14 ఏళ్ల కుర్రాడు!!
ఎక్కడైనా 14 ఏళ్ల కుర్రాడికి ఓటు హక్కే రాదు. అలాంటిది ఏకంగా బూత్ లెవెల్ అధికారిగా నియమితుడు కావడమంటే!! ఈ ఉదంతం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వెలుగుచూసింది. మహ్మద్ షేక్ యూసుఫ్ (14) అనే బాలుడిని అక్కడ బీఎల్వోగా నియమించారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, మొత్తం హైదరాబాద్ లోక్‌సభ స్థానంలోని 1405 బీఎల్వోల నియామకంపై విచారణకు ఆదేశించారు. ఎవరో వ్యక్తి ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు ఇక్కడ ఉన్న బీఎల్వోలు అందరూ ఒక పార్టీకి చెందినవాళ్లేనని అతడు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు.


