రూటు మారిన ఓటు! | Errors in municipal voter list: Telangana | Sakshi
Sakshi News home page

రూటు మారిన ఓటు!

Jan 6 2026 2:18 AM | Updated on Jan 6 2026 5:38 AM

Errors in municipal voter list: Telangana

వీరు మంచిర్యాల కార్పొరేషన్‌లోని 12వ డివిజన్‌కు చెందిన ఓటర్లు. తమ ఇళ్లు 12వ డివిజన్‌లో ఉంటే, ఓట్లు మాత్రం 41 డివిజన్‌లోకి వెళ్లాయి. ఇలా ఆ డివిజన్‌కు చెందిన 75 మంది ఓట్లు మారిపోయాయి. దీంతో వారు తమ ఓట్లను తమ డివిజన్‌లోకి మార్చాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇల్లు ఒక వార్డులో ఉంటే.. ఓట్లు మరో వార్డులో  

తప్పులతడకగా మున్సిపల్‌ ఓటరు జాబితా  

మున్సిపాలిటీల్లో ఓటర్ల ఫిర్యాదుల వెల్లువ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 1,556 ఫిర్యాదులు

ఇతర జిల్లాల్లోనూ అదే స్థాయిలో అభ్యంతరాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా తప్పులతడకగా రూపొందించారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ అనేక పొరపాట్లు దొర్లాయి. నివాసం ఒక వార్డులో ఉంటే, ఓట్లు మరో వార్డులోకి వెళ్లాయి. ఒకే ఇంట్లో కొందరి ఓట్లు ఒక వార్డు పరిధిలో.. మరికొందరివి మరో వార్డు పరిధిలోకి వెళ్లాయి. మరికొన్ని చోట్ల అసలు ఓట్లే లేకుండా పోయాయి. దీంతో ఓటర్లంతా ఫిర్యాదులతో మున్సిపల్‌ కార్యాలయాల బాట పట్టారు. కార్పొరేషన్, పెద్ద మున్సిపాలిటీల్లో వందల కొద్దీ తప్పిదాలు చోటు చేసుకోగా, చిన్న మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఓటర్ల జాబితాలో తప్పులపై సుమారు 6 వేల ఫిర్యాదులు అధికారులకు అందాయి. దీంతో వాటిని పరిష్కరించేందుకు తల పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  

నల్లగొండలోనే అత్యధిక ఫిర్యాదులు 
ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయంటూ ఎనిమిది ఉమ్మడి జిల్లాల పరిధిలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 5,406 ఫిర్యాదులు అధికారులకు అందాయి. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిష్కరిస్తే తప్ప ఆ పొరపాట్లను సరిచేయలేమని అధికారులు చెబుతున్నారు.ఎంత మేరకు పరిష్కరిస్తారన్నది ఈ నెల 10వ తేదీన తుది ఓటరు జాబితా విడుదలైతేనే తెలియనుంది. ఇక ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు అత్యధికంగా 1,556 నల్లగొండ జిల్లాలోనే వచ్చాయి.  

ఒకే సీరియల్‌ నంబరు ఇళ్లు ఉండటంతోనే... 
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగానే వార్డులవారీ ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా వార్డుల వారీగా ‘టీ పోల్‌’యాప్‌ ద్వారా హద్దులు నిర్ణయించి, ఇంటి నంబర్ల ఆధారంగా వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను తయారు చేశారు. అయితే ఒక ఇంటి నంబర్‌ సీరియల్‌ ప్రారంభ డిజిట్‌ రెండు మూడు వార్డుల్లో ఉండటం, ప్రస్తుతం టీ పోల్‌ యాప్‌లో ఆ ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్ల జాబితా చేయడంతో పలు ఇళ్లకు చెందిన ఓటర్లు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిపోయారు. గతంలో ఉన్న వార్డు ఓటర్ల జాబితాను పరిశీలించుకుంటూ ఏ ఇంటి నంబర్‌ ఏ వార్డులో ఉందనేది తేల్చుతూ ఓటర్ల జాబితా తయారు చేస్తే ఇన్ని తప్పులు దొర్లేవి కావు.  

ఓటర్ల జాబితాల్లో తప్పులెన్నో.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ ఓట్లు వేరే వార్డుల్లోకి మారిపోయాయని 1,187 మంది ఓటర్లు ఫిర్యాదు చేశారు.  
⇒  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓటర్ల నుంచి 868 అభ్యంతరా­లు వచ్చాయి. వీటిలో అత్యధికంగా 629 మంది ఓటర్లు తమ ఓట్లు వేరే డివిజన్లలోకి వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. 

⇒  నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో 1, 2, 3, 28వ డివిజన్లలో 3,200 ఓట్లు గల్లంతయ్యాయి. ఆ డివిజన్లలోకి వేరే డివిజన్ల నుంచి మరో 2,500 ఓట్లు వచ్చి చేరాయి. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. 4, 43వ డివిజన్ల నుంచి మరో వెయ్యికి పైగా ఓట్లు ఇతర డివిజన్లలోకి వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. బోధన్‌లో ఓటర్ల పేర్లు గల్లంతు అయ్యాయని, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో 3 వేల ఓట్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లిపోయాయని ఫిర్యాదు చేశారు. 

⇒  భూపాలపల్లి జిల్లాలో గ్రామాల పరిధిలో రెండేళ్ల కిందట నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలోకి వెళ్లిపోయిన వారి ఓట్లను కూడా భూపాలపల్లి మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. 
⇒  కరీంనగర్‌ నగరంలోని 64వ డివిజన్‌లో 600కు పైగా ఇతర ప్రాంత (డివిజన్‌కు సంబంధం లేని) ఓట్లున్నట్లు అభ్యంతరాలు వచ్చాయి.  

ఇది ఎవరికీ పట్టని కాలనీ.. 449 మంది ఓట్ల తొలగింపు  
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొమ్మేపల్లి పునరావాస కాలనీని ఆరేళ్ల కింద ఏర్పాటు చేశారు. అక్కడ 449 మంది ఓటర్లు ఉన్నారు. వారు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ కిష్టారం పంచాయతీ పరిధిలో ఓట్లు వేశారు. మొన్నటి సర్పంచ్‌ ఎన్నికల్లో మాత్రం వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కారణం ఏంటంటే.. మున్సిపాలిటీ పరిధిలో ఆ కాలనీ ఉండటమే. అయి­తే ప్రస్తుతం వారికి మున్సిపాలిటీ పరిధిలో ఓట్లు లేకుండా చేశారు.

దీనిపై వారంతా ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపల్‌ కమిషనర్, కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా 449 మందికి ఓటు హక్కు ఇవ్వలేదు. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కాలనీని ఆనుకొని ఉన్న సింగరేణి క్వార్టర్స్‌ వారు 300 మంది ఓట్లు నమోదు చేసుకోగా, అదే మున్సిపాలిటీలోని 17వ వార్డులో కలిపారు. అయితే, కొమ్మేపల్లి పునరావాస కాలనీని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఈయన కడియం రమేశ్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 19వ వార్డు పరిధిలోని ముత్తిరెడ్డి కుంట. ఇంట్లో ఐదుగురు ఉంటారు. ఆయన భార్య జ్ఞానేశ్వరి, ఇద్దరు కూతుళ్లు జెన్నిఫ్లోరా, డివైన్‌ రోజ్‌ల ఓట్లు 19వ వార్డులో ఉన్నాయి. రమేష్ తోపాటు మరో కూతురు జెస్సికా ఫ్లోరెన్స్‌ ఓట్లు మాత్రం 38వ వార్డులోకి వెళ్లిపోయాయి. దీంతో వాటిని మార్చాలంటూ ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement