కాషాయంలో సంబరం
కాంగ్రెస్‌లో ఇరకాటం..
సాక్షి బళ్లారి/ శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌లో అధికార మార్పిడి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల ప్రచ్ఛన్న యుద్ధం దాదాపు వీధుల్లోకి ఎక్కింది. ఈ పరిణామాల మధ్య తుమకూరు మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ తనయుడు, ఎమ్మెల్సీ రాజేంద్ర కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో భేటీ చేశారు. ఇది కొత్తగా చర్చకు కారణమైంది. సిద్ధరామయ్య వర్గానికి చెందిన కేఎన్ రాజణ్ణ తనయుడు అమిత్ షాతో భేటీ కావడంపై రకరకాలుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
రాజకీయాల గురించి మాట్లాడా
రాజేంద్ర, అమిత్‌షా సుమారు అర్ధ గంటకు పైగా చర్చించారు. భేటీ తరువాత రాజేంద్ర మాట్లాడుతూ ఇది రాజకీయ సమావేశం కాదని అన్నారు. ఆయనతో అర్ధగంట సేపు మాట్లాడినట్లు మీరు చెబుతున్నారు, నేను అంత పెద్ద రాజకీయ నాయకుడిని కానని, రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడానని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడిన మాట వాస్తవమని అంగీకరించారు. సెప్టెంబర్ క్రాంతి వస్తుందని మొదట తెలిపింది రాజణ్ణ అయితే ఇప్పుడు నవంబర్ వచ్చినా ఏమీ మార్పు జరగలేదని, ఈ సమయంలో ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వస్తున్నారని మీడియా ప్రశ్నించగా, ఆ విషయం నాకు తెలియదని, దీనిపై తన తండ్రినే అడగాలని సూచించారు.
బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు వట్టిదే: జోషి
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలతో జత కలిసి తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది కేవలం ఊహాగానాలు మాత్రమేనని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలతో బీజేపీ జత కట్టి ఆ వచ్చే నాయకునికి సీఎం పదవిని కేటాయించి, బీజేపీ ప్రభుత్వం ఏర్పరుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రి శనివారం హుబ్లీలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ఎంత మాత్రం ప్రయత్నించడం లేదన్నారు. ఆ పార్టీ నాయకుల మధ్య విభేదాలే వారి పతనానికి కారణమవుతాయన్నారు. అవినీతి కూపంలో ఇరుక్కుపోయిందని, ఈ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగాలని తాము భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలతో కలిసి తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే వార్తల్లో కూడా నిజం లేదన్నారు. ఎమ్మెల్యేల కోసం ఏ హోటల్‌లో కూడా గదులు బుక్ చేయలేదని, ఎమ్మెల్యేలను ఎక్కడికీ తరలించ లేదని ఆయన అన్నారు.
వేచిచూస్తున్న బీజేపీ పెద్దలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేంద్ర మంతనాలు
ఎమ్మెల్యేల తరలింపు ఏదీ లేదన్న
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
పతాకస్థాయికి సీఎం కుర్చీ వివాదం
సిద్దరామయ్యా.. ఆ రోజు మాటిచ్చావు
కాంగ్రెస్‌నే అంతం చేస్తావా?
ఎమ్మెల్సీ విశ్వనాథ్
మైసూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అధికార మా ర్పిడి చేయకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముక్కలవుతుందని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ హెచ్చరించారు. ఆయన శనివారం నగరంలోని జలదర్శిని అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికార మార్పిడి విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే సురేష్‌ల సమక్షంలో సీఎం సిద్దరామయ్య ప్రమాణం చేశారన్నారు. ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలన్నారు. మల్లికార్జున ఖర్గె జోక్యం చేసుకుని డీకే శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టాలన్నారు. జేడీఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు సిద్దరామయ్యకు షెల్టర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీనే అంతం చేయబోతున్నారని ఆరోపించారు. తమ కులానికి చెందిన సిద్దరామయ్య మాట తప్పి మొత్తం కురుబ సమాజానికి చెడ్డపేరు తెస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆడిన మాట తప్పిన వారు ఎవరూ మిగలలేదని అన్నారు. ఆర్థికమంత్రి కూడా అయిన సిద్దరామయ్య అప్పుల మీద అప్పులు చేసి గ్యారంటీ పథకాలను నడుపుతున్నారన్నారు. మరో వైపు మద్యం ధరల పెరుగుదలతో వాటిని కొనలేక యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కోమాలో రాష్ట్ర ప్రభుత్వం
బీజేపీ పక్ష నేత అశోక్
బనశంకరి: ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న కుమ్ములాటతో పాలనా యంత్రాంగం స్తంభించిందని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ దుయ్యబట్టారు. శనివారం బెంగళూరు పద్మనాభనగరలోని తమ కార్యాలయం ముందు వందేమాతరం వందేళ్ల వేడుకలను నిర్వహించి విలేకరులతో అశోక్ మాట్లాడారు. ఎవరు సీఎం అనేది కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టంగా తెలపాలన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సీఎం పదవి కోసం కుమ్ములాటలతో పరిపాలన పడకేసిందన్నారు. డీసీఎం డీకే.శివకుమార్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని ఆయన తరఫు ఎమ్మెల్యేలు పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటం అంతిమ దశకు చేరుకుందన్నారు. రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే తీర్మానం తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వం కోమాలోకి వెళుతుందని హేళన చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు లేదన్నారు. ఒక ముఠా సిద్దరామయ్య ను కాపాడటానికి, మరో గ్యాంగ్ ఆయనను తప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది, శివకుమార్ విషయంలోనూ ఇదే జరుగుతోందన్నారు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో ఇటీవల నేరకార్యకలాపాలు ఎక్కువైనట్లు, రాజకీయంగా అథోగతి ఏర్పడిందని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ బలహీనమైన నాయకుడని కనబడుతోందన్నారు. ఈ గేమ్ మధ్య రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారన్నారని ఆయన పేర్కొన్నారు.
కాషాయంలో సంబరం


