కారును అడ్డగించి 1.2 కేజీల పసిడి దోపిడీ
మైసూరు: కన్నడనాట దోపిడీ పర్వాలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో నగదు తరలింపు వాహనం నుంచి రూ.7.11 కోట్ల దోపిడీ ఘటనను మరచిపోక ముందే బంగారు వ్యాపారి నుంచి 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర అడవిలోని మూలెహొళె చెక్‌పోస్టు వద్ద జరిగింది. కేరళలోని కాలికట్ నివాసి, నగల తయారీదారు విను (49) బాధితుడు. వివరాలు.. మండ్యలోని రాజేష్ జువెలర్స్ నుంచి నగల తయారీ కోసం 800 గ్రాముల 24 క్యారెట్ల బంగారు కడ్డీలు, 518 గ్రాముల 22 క్యారెట్ల బంగారాన్ని తీసుకుని కేరళలోని స్వస్థలానికి బయల్దేరాడు. ఘటనాస్థలి వద్ద రెండు ఇన్నోవాలు, ఒక ఇటియోస్ కారులో వచ్చిన దుండగులు విను కారును అడ్డుకుని బంగారాన్ని అపహరించారు. దుండగులు 10–12 మంది ఉన్నట్లు విను రెండురోజుల తరువాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. చామరాజనగర ఎస్పీ బీటీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో జరిగిన దోపిడీలను గమనిస్తే ఇది కేరళకు చెందిన దోపిడీ గ్యాంగ్ పనిగా కనిపిస్తోందని చెప్పారు.
బండీపుర అటవీ మార్గంలో ఘటన


