రూ.7 కోట్ల లూటీ కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

రూ.7 కోట్ల లూటీ కేసు ఛేదన

Nov 23 2025 5:59 AM | Updated on Nov 23 2025 5:59 AM

రూ.7

రూ.7 కోట్ల లూటీ కేసు ఛేదన

బనశంకరి: బెంగళూరులో నాలుగు రోజుల కిందట పట్టపగలు ఏటీఎంలకు నగదు రవాణా చేసే సీఎంఎస్‌ వాహనాన్ని అడ్డుకుని రూ.7.11 కోట్ల నగదును దోచుకోవడం దేశమంతటా తీవ్ర సంచలనం కలిగించడం తెలిసిందే. ఆ సంస్థ మాజీ, ప్రస్తుత సిబ్బంది, ఓ పోలీసు దోపిడీ వెనుక ఉన్నట్లు తేలింది. దోపిడీ ముఠాలోని ఈ ముగ్గురిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి రూ.6.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ తెలిపారు. దోపిడీ కేసు వివరాలను శనివారం ఆయన మీడియాకు వెల్లడించారు. సీఎంఎస్‌ ఉద్యోగి గోపి, గోవిందపుర పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ అణ్ణప్పనాయక్‌, సీఎంస్‌ మాజీ ఉద్యోగి జేవియర్‌ అలియాస్‌ పవన్‌ను అరెస్ట్‌ చేశారు. వీరు ఆప్త స్నేహితులు కాగా, డబ్బు కోసం దోపిడీకి పథకం పన్నారు. రూ.7.11 కోట్ల నగదుతో వెళుతున్న సీఎంఎస్‌ వాహనాన్ని డీజే.హళ్లి వద్ద ఆర్‌బీఐ అధికారులమని నటిస్తూ అడ్డుకుని తమకు అనుకూలంగా ఉండేలా డైరీ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ మీదకు తీసుకెళ్లారు. అందులోని సిబ్బందికి తుపాకీ చూపించి బెదిరించి నగదు బాక్సులను తీసుకుని ఇన్నోవా కారులో పారిపోయారు. స్థానిక సిద్దాపుర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

దొరకకుండా ట్రిక్కులు

ఆధారాలు లభించకుండా దోపిడీదారులు అనేక ట్రిక్కులు వేశారు. సీసీ కెమెరాలలో కనిపించని ప్రదేశాల్లో వాహనాన్ని నిలిపారు. మొబైల్‌ఫోన్లను వెంట తీసుకురాలేదు. తరచూ వాహనం మారుస్తూ వాటికి నంబరు ప్లేట్స్‌ను మార్చారు. సీఎంఎస్‌ వాహన సిబ్బంది సుమారు గంటకు పైగా ఆలస్యంగా పోలీసులకు సమాచారమిచ్చారు. పలు సవాళ్లు మధ్య టెక్నికల్‌ విశ్లేషణ, సీసీబీ బృందం ప్లాన్‌తో దోపిడీ కేసును త్వరితగతిన ఆచూకీ కనిపెట్టిన పోలీసులు పలుకోణాల్లో చేపట్టారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో సోదాలు జరిపారు. 30 మందిని పైగా విచారించారు. దోపిడీదారులు వినియోగించిన వాహనాల ఆధారంగా ఎక్కడ ఉన్నదీ కనిపెట్టామని పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఈ కేసులో 6 నుంచి 8 మంది భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు. దోపిడీ జరిగిన 60 గంటలలోనే నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.

3 నెలల నుంచి కుట్ర

లూటీకి నిందితులు గత 3 నెలలనుంచి ప్లాన్‌ చేశారు, గత 15 రోజులుగా సీఎంఎస్‌ వాహనం ఏయే మార్గాల్లో వెళుతోందీ అనేది నిఘా వేశారు. కేసును ఛేదించిన పోలీసులకు రూ.5 లక్షల నగదు బహుమతి అందిస్తామని కమిషనర్‌ తెలిపారు. విలేకరుల సమావేశంలో జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ వంశీకృష్ణ, అజయ్‌హిలోరి, డీసీపీలు గిరీశ్‌ లోకేశ్‌, ఏసీపీ నారాయణస్వామి పాల్గొన్నారు.

ముగ్గురు అరెస్టు, రూ.70 లక్షలు సీజ్‌

ఇక హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో నవీన్‌, నెల్సన్‌, రవి అనే మరో ముగ్గురు దోపిడీదారులను అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.70 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.6.45 కోట్లు సీజ్‌ చేయగా, ఇంకా రూ.67 లక్షలు దొరకాల్సి ఉంది. ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు

అణ్ణప్పనాయక్‌, గోపి, జేవియర్‌ను పోలీసులు బెంగళూరు రెండో ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచి 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఎప్పుడు అరెస్ట్‌చేశారని జడ్జి పోలీసులను ప్రశ్నించగా శుక్రవారం సాయంత్రమని తెలిపారు. డిసెంబరు 1వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతించారు.

పోలీసు, ఉద్యోగి, మాజీ ఉద్యోగి ప్లాన్‌

రూ.6.45 కోట్ల నగదు స్వాధీనం

బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ వెల్లడి

రూ.7 కోట్ల లూటీ కేసు ఛేదన 1
1/1

రూ.7 కోట్ల లూటీ కేసు ఛేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement