రెండో ఎయిర్‌పోర్టుపై త్వరలో ఏఏఐ నివేదిక
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో రెండవ విమానాశ్రయం నిర్మాణానికి పలు ప్రాంతాల్లో స్థలాల పరిశీలన జరిపిన ఏఏఐ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మరో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఏంబీ పాటిల్ తెలిపారు. నివేదికను కేబినెట్ మీటింగ్‌లో ప్రవేశపెట్టి చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండవ ఎయిర్‌పోర్టు నిర్మించడానికి 2033 వరకూ అనుమతి లేదని, అయితే ఇప్పటినుండి ఆ ప్రక్రియను ప్రారంభిస్తే ఆ సమయానికి పనులు పూర్తవుతాయన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కనీసం 5, 6 వేల ఎకరాల భూమి, ఐదారు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో విమానాశ్రయం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు లెవెల్ 3
బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు ఏఐసీ (ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) లెవెల్ 3వ దశ గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ హోదా పొందిన తొలి విమానాశ్రయం ఇదేనని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సదరు ఎయిర్‌పోర్టులో టెక్నాలజీ వినియోగం, ప్రయాణికుల భద్రత, ఇలాంటి సౌకర్యాలను, ప్రయాణికులను సర్వే చేసి ఈ గుర్తింపు ఇస్తుంది.
సుపారి ఇచ్చి భర్త హత్య
● ఏడేళ్ల తరువాత భార్య గుట్టురట్టు
దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ కిల్లర్స్‌కి డబ్బులు ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య ఉదంతం 7 ఏళ్లకు గుట్టురట్టయింది. ఈ సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. వివరాలు... కలబుర్గి తాలూకా కణ్ణి గ్రామం నివాసి భీరప్ప 7 ఏళ్ల క్రితం చనిపోయాడు. సహజ మరణంగా భావించి అంత్యక్రియలు జరిపించారు. అయితే ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగు చూడడంతో హత్యగా తేలింది. భీరప్ప భార్య శాంతాబాయి, మహేశ్, సురేశ్, సిద్ధు, శంకర్ అనే వ్యక్తులకు సుపారి ఇచ్చి భర్తను హత్య చేయించింది. ప్రధాన నిందితుడు మహేశ్‌కు శాంతాబాయితో అక్రమ సంబంధం ఉంది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు భావించారు. అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. శాంతాబాయి తన భర్తను హత్య చేయాలని మాట్లాడిన దృశ్యాలను ప్రియుడు మహేశ్ తన మొబైల్లో వీడియో తీసి పెట్టుకున్నాడు. ఇటీవల సదరు వీడియో లీక్ కావడంతో వైరల్‌గా మారింది. దీంతో భీరప్ప తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదుమంది నిందితులను అరెస్టు చేశారు.
సొంత ఇంటికి యువతి టోకరా
మైసూరు: ఓ యువతి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటిలోని బంగారు ఆభరణాలు, డబ్బును తస్కరించి ప్రియునితో కలిసి పరారైన ఘటన మైసూరు నగరంలో జరిగింది. రాఘవేంద్ర బడావణె నివాసి అయిన యువతికి స్థానిక యువకునితో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల అతనిని ఆలయంలో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఇంటి బీరువాలో పరిశీలించగా పొలం కొనుగోలు కోసం భద్రపరిచిన రూ.1.85 లక్షల నగదు, రూ.7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె తండ్రి తన కుమార్తె, అల్లునిపై నజరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రెండో ఎయిర్‌పోర్టుపై త్వరలో ఏఏఐ నివేదిక


