అధిష్టానానికి తేల్చి చెప్పిన డీకే శివకుమార్
బెదిరింపులకు ఎదురొడ్డి పార్టీని అధికారంలోకి తెచ్చాను
ఇచ్చిన మాట మేరకు అధికార మార్పిడి జరగాల్సిందేనని పట్టు
2028 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామన్న ప్రతిపాదనకూ నో!
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ సందేహం
సాక్షి, బెంగళూరు: ఇన మాట ప్రకారం, ముందస్తు ఒప్పందంలో భాగంగా మిగిలిన పదవీ కాలంలో తనకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని, లేదంటే తనదారి తాను చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య సీఎం కుర్చీని వదిలేందుకు ఏమాత్రం సిద్ధంగా లేకపోగా, మిగిలిన కాలమంతా తానే సీఎంనంటూ పదేపదే వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సిద్ధరామయ్యతో రాజీనామా చేయించాలని డీకే శివకుమార్ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగించి తనను జైలుకు పంపించినా బేషజాలకు పోకుండా, బెదిరింపులకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా పని చేశానని అధిష్టానం వద్ద గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో.. డీకే శివకుమార్ సమావేశమై చర్చించారు.
కేపీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. హైకమాండ్ మాటకు కట్టుబడి ప్రారంభంలో సీఎం పదవిని వదులుకుని డిప్యూటీ సీఎం పదవితో సర్దుకున్నానని తెలిపారు. ఇప్పటివరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని భిన్న స్వరాలు వినిపించినా తాను పార్టీకి విధేయుడిగానే వ్యవహరించానని తెలిపారు. సంపూర్ణంగా హైకమాండ్‌పై విశ్వాసాన్ని కనపరిచానని, ఇలాంటి తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది.
ఢిల్లీలో రహస్య మంతనాలు
ఢిల్లీలో డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌తో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇదివరకే సమావేశమై చర్చించారు. అధికార మార్పిడిపై వీరిద్దరి మధ్య సుమారు 45 నిమిషాలకు పైగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర చేపట్టారు. బెంగళూరులోని కొందరు ఎమ్మెల్యేలు డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్య ఇళ్లకు క్యూలు కడుతున్నారు. ఇద్దరితో మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
శివకుమార్ మాత్రం ఎవరి మాట వినేందుకు సిద్ధంగా లేన్నట్లు తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి సీఎం అభ్యరి్థగా ప్రకటిస్తామని ఏఐసీసీ కొందరు నేతల ద్వారా శివకుమార్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అందుకు కూడా శివకుమార్ అంగీకరించలేదని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించినట్లు సమచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 140 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజారిటీ ఉందని, 2023 జూలైలో హైకమాండ్ ఇన మాటకు కట్టుబడి ఉండాలని డీకే శివకుమార్ తేల్చి చెప్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రెండున్నరేళ్ల వరకు సిద్దరామయ్య సీఎంగా, తాను ఉప ముఖ్యమంత్రిగా.. లోకసభ ఎన్నికల వరకు కేపీసీపీ అధ్యక్షుడిగా కొనసాగాలని హైకమాండ్ తీర్మానించిన విధంగా జరగాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఇన మాట ప్రకారం నడుచుకోవాలని, తనను ముఖ్యమంత్రి చేయాలని భీషి్మంచుకుని కూర్చొన్నారు. మరో వైపు డీకే శివకుమార్‌కు మద్దతుగా ఒక్కో ఎమ్మెల్యే ఢిల్లీకి తమ గొంతు వినిపిస్తున్నారు. తక్షణమే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని, రహస్య ఓటింగ్ కూడా నిర్వహించాలని కూడా డీకే శివకుమార్ వర్గం వాదిస్తోంది.


