జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదన
ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపర్చుకోవాలి
ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ కార్యక్రమం ప్రారంభిద్దాం
గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేసుకుందాం
డ్రగ్స్–టెర్రర్ బంధాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని పిలుపు
జోహన్నెస్‌బర్గ్: ప్రపంచ అభివృద్ధి ప్రాధాన్యతలపై పునరాలోచన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రాధాన్యతల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమగ్ర, సుస్థిరాభివృద్ధి నమూనాలను ఆచరించాలని పేర్కొన్నారు. నాగరికత అందించిన విజ్ఞానం నుంచి అభివృద్ధి నమూనాను స్వీకరించాలని అన్నారు. జీ20 సభ్యదేశాల సౌభాగ్యమే లక్ష్యంగా నాలుగు కీలక సూత్రాలను ప్రతిపాదించారు.
ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని ఒకచోట భద్రపర్చి, భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. ఆఫ్రికా యువతలో నైపుణ్యాలు పెంచాలన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి సభ్యదేశాలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అలాగే మాదక ద్రవ్యాలు– ఉగ్రవాదుల భాగస్వామ్యాన్ని అంతం చేయడానికి సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఉద్ఘాటించారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం జీ20 దేశాల అధినేతల సదస్సు ప్రారంభౌత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ అభివృద్ధి విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సరైన వనరులు, పర్యావరణ సమతుల్యత లేని ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకంజలోనే ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు రావాలన్నారు. భారతీయ నాగరికత విలువల్లో అంతర్భాగమైన ‘సమీకృత మానవతావాదం’ ప్రపంచమంతటా అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతూకం సాధించడానికి దోహదపడుతుందని వివరించారు.
భవిష్యత్ తరాలకు సంప్రదాయ విజ్ఞానం
‘‘కాల పరీక్షకు నిలిచిన సుస్థిర జీవన విధానాలను పరిరక్షించుకోవాలి. ఇందుకోసం జీ20 ఆధ్వర్యంలో ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపర్చుకోవాలి. ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక సంబంధాలు వంటి అంశాలపై ప్రాచీన విజ్ఞానాన్ని రికార్డు చేసి, భవిష్యత్ తరాలకు అందించాలి. వాతావరణంపై ప్రతికూల ప్రభావాలు పెరగడంతోపాటు ప్రజల జీవన విధానాలు అనూహ్యంగా మారిపోతున్న నేటి తరుణంలో ఇది చాలా అవసరం.
సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేద్దాం
ప్రపంచ ప్రగతికి ఆఫ్రికా ప్రగతి అత్యంత కీలకం. ఆఫ్రికా యువత అభివృద్ధి, సాధికారత కోసం వారికి నైపుణ్యాలు నేరి్పంచాలి. ఇందులో భాగంగా జీ20 నేతృత్వంలో ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దీనికి జీ20 దేశాలన్నీ సహకరించాలి. తొలుత శిక్షకులకు శిక్షణ ఇవ్వాలి. వచ్చే పదేళ్లలో కనీసం 10 లక్షల
మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేద్దాం. ఈ ట్రైనర్లు ఆఫ్రికా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
సంక్షోభ సమయాల్లో సహకారానికి..
ఆరోగ్య సేవల కోసం జీ20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేద్దాం. జీ20 సభ్యదేశాల నుంచి సుశిక్షితులైన వైద్య నిపుణులు ఈ బృందంలో చేరాలి. సభ్యదేశాల్లో ఎక్కడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, ప్రకృతి విపత్తులు విరుచుకుపడినప్పుడు ఈ నిపుణులు తక్షణమే రంగంలోకి సేవలందిస్తారు.
మాదక ద్రవ్యాలతో పెనుముప్పు
ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ మానవాళికి పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక స్థిరత్వాన్ని, భద్రతను దెబ్బతీస్తున్నాయి. ఉగ్రవాద ముఠాలు డ్రగ్స్ వ్యాపారంలోనూ ఆరితేరిపోతున్నాయి. డ్రగ్స్–టెర్రర్ బంధాన్ని దీటుగా ఎదుర్కోవాల్సిందే. మాదక ద్రవ్యాల వ్వవస్థలను నాశనం చేయాలి. అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ఉగ్రవాదులకు నిధులందించే వనరులను బలహీనపర్చాలి. ఇవన్నీ జరగాలంటే ప్రపంచదేశాల ఐక్య కార్యాచరణ కావాలి. మాదక ద్రవ్యాలు–ఉగ్రవాదుల బంధాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ‘డెడికేటెడ్ జీ20 కార్యక్రమం’ ప్రారంభిద్దాం’’ అని మోదీ అన్నారు.
అరుదైన మూలకాలపై దృష్టిపెడదాం
‘అరుదైన మూలకాలు, సహజ భూఅయస్కాంత పదార్థాలపై దృష్టిపెట్టాలి. కొత్త బ్యాటరీలపైనే ఆధారపడకుండా రీసైక్లింగ్, పట్టణప్రాంతాల్లో వాడేసిన డిజిటల్ వస్తువులు, ఉపకరణాల నుంచి అరుదైన మూలకాల సేకరణతో అర్బన్ మైనింగ్ చేద్దాం. వాడేసిన బ్యాటరీలను గ్రిడ్ స్టెబిలైజర్, బ్యాకప్ పవర్ వంటి రంగాల్లో సది్వనియోగం చేయడంతోపాటు సంబంధిత రంగానికి అనువైన ఆవిష్కరణలపై దృష్టిసారిద్దాం’ అని మోదీ అన్నారు.
భారత్, ఆ్రస్టేలియా, కెనడా త్రైపాక్షిక భాగస్వామ్యం
సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నూతన ఆవిష్కరణల విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి భారత్, ఆ్రస్టేలియా, కెనడా జట్టుకట్టబోతున్నాయి. ఈ త్రైపాక్షిక భాగస్వామ్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఆయన శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, కెనడా ప్రధాని కారీ్నతో సమావేశమయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.


