మధ్యవర్తిత్వానికి మద్దతిస్తా
నా దృష్టంతా కీలక సమస్యలపైనే
కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టికరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల నెత్తిన గుదిబండగా తయారైన కేసుల సత్వర పరిష్కారంపై దృష్టిసారిస్తానని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టికరించారు. నవంబర్ 24వ తేదీన సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సూర్యకాంత్ శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు పిచ్చాపాటీ మాట్లాడారు.
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రాధాన్యాలకు సంబంధించిన ఆయన తన మనసులోని మాటలను బయటపెట్టారు. ‘‘నా ముందున్న తొలి, అత్యంత ముఖ్యమైన సవాల్ ఏదైనా ఉందంటే అది పేరుకుపోయిన కేసుల కొండ. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించడంపై దృష్టిసారిస్తా.
ఒక్క సుప్రీంకోర్టులోనే ఏకంగా 90,000 కేసులు పరిష్కారం కోసం ఫైళ్లలో మూలుగుతున్నాయి. అసలు ఇన్ని కేసులు పెరిగేదాకా ఏం చేస్తున్నట్లు? అపరిష్కృతంగా పడి ఉండటానికి కారకులు ఎవరు? బాధ్యతారహితంగా వ్యవహరించింది ఎవరు? అనే అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదు. కానీ వీటిని సత్వరం పరిష్కరించాల్సిందే. పేరుకుపోయిన పెండింగ్ కేసుల సంగతేంటి? అని హైకోర్టులు, ట్రయల్ కోర్టుల నుంచి నివేదికలు తెప్పిస్తా’’అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమం
‘‘కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ బాటలో పయనించడం చాలా మంచిది. వాస్తవానికి మధ్యవర్తి త్వం అనేది సమస్యలు, కేసులు పరిష్కృతం కావడా నికి అత్యంత చక్కటి మార్గం. కేసుల కొండ కరగాలంటే మధ్యవర్తిత్వ అస్త్రాన్ని ప్రయోగించక తప్ప దు. ఇది కేసుల పరిష్కార వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
ఈమధ్యే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఇప్పు డు దేశం మొత్తం ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. భారత్‌లోని బహుళజాతి సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థలు సైతం ఇదే బాటలో పయనించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి’’అని అన్నారు.
నా ఒక్క తీర్పుతో 1,200 కేసులు పరిష్కారం
‘‘ఢిల్లీలో భూ సమీకరణకు సంబంధించి ఒకే తరహా కేసులు చాలా ఉండిపోయాయి. నేనిచి్చన ఒక్క తీర్పుతో ఏకంగా 1,200 కేసులు ఒకేసారి పరిష్కారమయ్యాయి. కీలకమైన చట్టపర, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన చాలా కేసులు హైకోర్టుల వద్ద పేరుకుపోయాయి. వీటికి నేను సుప్రీంకోర్టులో విస్తృతస్థాయిలో రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటుచేసి పరిష్కారం చూపుతా’’అని అన్నారు.
ఈస్థాయికి వచ్చాక అవి ఏపాటి?
తమకు వ్యతిరేకంగా వచి్చన తీర్పులపై రాజకీయనేతలు లేదా కొన్ని వర్గాల వాళ్లు చేసే విమర్శలపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘‘ఇటీవలికాలంలో న్యాయమూర్తులపైనా నిందలు వేస్తున్నారు. కోర్టుల తీర్పులను సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుబడుతున్నారు. జడ్జీలను ఎగతాళి చేస్తూ ట్రోలింగ్ పెరిగింది. అయినాసరే వృత్తి ధర్మం పాటిస్తూ న్యాయమూర్తులు ముందుకు సాగిపోతారు.
సుప్రీంకోర్టు జడ్జి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన మేం ఇలాంటి చవకబారు అంశాలను అస్సలు పట్టించుకోము. నా దృష్టిలో సామాజికమాధ్యమం అనేది అసమాజ మా ధ్యమంగా తయారైంది. ఆన్‌లైన్ వేధింపులు, వ్యాఖ్యానాలను పట్టించుకోను. ఇవి నాపై ప్రభా వం చూపబోవు. వీటి వల్ల అస్సలు ఒత్తిడికి గురికాను. జడ్జీలు, తీర్పులపై సది్వమర్శను మాత్రమే నేను లెక్కలోకి తీసుకుంటా’’అని అన్నారు.
కాలుష్యమున్నా కాలు బయటపెడతా
‘‘దేశరాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. పొగచూరినా సరే పాదం కదపాల్సిందే. వాతావరణం ఎలాగున్నా సరే రోజు ఉదయం మారి్నంగ్‌వాక్ చేస్తా. ఖచి్చతంగా దాదాపు గంటసేపు బయట నడుస్తా’’అని అన్నారు.


