వినియోగ, మన్నికైన వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు
దేశంలోని నగరాలే కాదు పల్లె ప్రజలదీ ఇదే తీరు
మెరుగైన జీవన ప్రమాణాలపై భారతీయుల మక్కువ
దుస్తులు, పాదరక్షలు, టీవీలు, ఫ్రిజ్‌ల కొనుగోళ్లపై వ్యయం
గృహ వినియోగ వ్యయ సర్వేలో ఆసక్తికర అంశాలు
మూడు పూటలా భోజనం. మధ్యమధ్యలో టీ. సాయంత్రం అయ్యిందంటే బజ్జీలు, చాట్ ఏదైనా కడుపులో పడాల్సిందే. అంతేనా? పండ్లు, బిస్కెట్లు వంటివి కూడా ఉంటాయిగా. దాదాపు ప్రతి ఇంటా కథ ఇలాగే ఉంటుంది. ఈ లెక్కన ఓ నలుగురు ఉన్న కుటుంబంలో తిండికి తడిసిమోపెడు అవుతుంది అనుకుంటే పొరపాటే. తిండికంటే ఎక్కువగా వినియోగ వస్తువులు–సేవలు, మన్నికైన వస్తువులపై భారతీయులు అధికంగా వెచి్చస్తున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.
మన దేశంలో తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన జీవన ప్రమాణాలపై ఆశలు, ఆకాంక్షలు.. వెరసి కుటుంబాలు ప్రతినెలా చేస్తున్న వినియోగ వ్యయాల తీరు మారుతోంది. ఆహారం కంటే అధికంగా వినియోగ వస్తువులు, మన్నిక కలిగిన వాటి కోసం (కన్‌జ్యూమబుల్స్, డ్యూరబుల్స్) ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో కొనుగోళ్ల తీరుతెన్నులను వివరిస్తూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) తాజాగా ఓ సర్వే చేసింది. 2011–12లో చేపట్టిన నేషనల్ శాంపిల్ సర్వేతో పోలుస్తూ 2023–24 నాటికి వచి్చన మార్పులతో ఈ గృహ వినియోగ వ్యయ సర్వేకు రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా 2,61,953 కుటుంబాలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఈఏసీ–పీఎం ప్రతినిధులు షమికా రవి, సింధుజ పెనుమర్తి రూపొందించిన ఈ నివేదికను ఈఏసీ–పీఎం ఇటీవల విడుదల చేసింది.
పల్లెలకూ పాకిన సంస్కృతి..
దేశంలో 12 ఏళ్లలో మారిన వ్యయాల తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పల్లెల్లోనూ ఆహారం కోసం చేస్తున్న వ్యయాలు 52.9% నుంచి 47 శాతానికి తగ్గాయి. గృహ వ్యయంలో ఆహారేతర వస్తువుల వాటా మొత్తం ఏకంగా 53% ఎగబాకింది. పట్టణవాసుల తొలి ప్రాధాన్యత డ్యూరబుల్స్, కన్‌జ్యూమబుల్స్‌దే. వీటి వాటా 57.4% నుంచి 60.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఆహారానికి చేస్తున్న ఖర్చు 42.6% నుంచి 39.7 శాతానికి పడిపోయింది. దుస్తులు, పాదరక్షలు వంటి ప్రాథమిక అవసరాల నుంచి వ్యక్తిగత వస్తువులు, కిచెన్ ఉపకరణాలు, గృహోపకరణాలు, వాహనాలపై.. అంటే ఆస్తి నిర్మాణం వైపు వ్యయాలు మారుతున్నాయి.
జీవన ప్రమాణాలపై..
ప్రజల్లో అవగాహన, రుణ లభ్యత పెరగడం, మెరుగైన ఆర్థిక వ్యవస్థ.. వ్యక్తిగత ఉత్పాదకత, జీవన ప్రమాణాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. మోటారు వాహనాలు, టీవీలు, మొబైల్ హ్యాండ్‌సెట్స్, రిఫ్రిజిరేటర్లు సొంతం చేసుకునేందుకు జనం మొగ్గుచూపుతున్నారు. అయితే టీవీల కొనుగోలు పట్టణ ప్రాంతాలలో కొంతతగ్గింది. మొబైల్ ఫోన్లను టీవీలకు ప్రత్యామ్నాయంగా భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోందని నివేదిక వివరించింది. గృహోపకరణాల్లో రిఫ్రిజిరేటర్లదే పైచేయి. పట్టణ ప్రాంతాల్లో వీటి కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి.
మన్నికైన వస్తువులు (డ్యూరబుల్స్): టీవీ, ల్యాప్‌టాప్/పీసీ, మొబైల్ ఫోన్, టూవీలర్, కారు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ/కూలర్.
వినియోగ వస్తువులు (కన్‌జ్యూమబుల్స్), సేవలు: సబ్బులు, సౌందర్య సాధనాలు, స్టేషనరీ, మందులు, పెట్రోల్/డీజిల్, విద్య, వైద్యం.


