breaking news
parrot astrology
-
పలకని చిలుక
వికారాబాద్: ఒకప్పుడు గ్రామాల్లో చిలుక జోస్యం చెప్పేవారి వచ్చేరంటే సందడిగా ఉండేది. చిలుక తేసే కార్డులో తమ భవిష్యత్ ఉంటుందని భావించేవారు. అయితే కాలం మారింది. సాంకేతికత పెరిగింది. చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చే సరికి చిలుక జోస్యానికి ఆదరణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఇతరుల భవిష్యత్ చెప్పిన ఆరెగొందిలీలు నేడు వారి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. చిలుక జోస్యానికి పెట్టింది పేరు ఎక్మాయి బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామం సంచారజాతి ఆరెగొందిలీలకు పెట్టింది పేరు. ఈ గ్రామాని కి చెందిన వేలాది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు వెళ్లి దశాబ్దాలుగా చిలుక జోస్యం చెబుతూ జీవనం సాగిస్తున్నా రు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్ణాటకలో బల్లారి, రాయచూరు, కలబురిగి, బీదర్, అలాగే మహారాష్ట్రలో సోలాపూర్, పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో ఈ కుటుంబాలు స్థిరపడ్డాయి. ఒకప్పు డు చిలక జోస్యం వారి కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా ఉండేది. ప్రస్తుతం ఈ వృత్తికి ఆదరణ తగ్గిపోవడంతో యువత ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటోంది. కొందరు వ్యవసాయ కూలీలుగా, మరికొందరు ఆటోలు నడుపుతూ, చిన్న వ్యాపారాలు, భవన నిర్మాణ పనులు, ఇతర కూలీ వృత్తుల్లో జీవనం సాగిస్తున్నారు. ఏరువాక పౌర్ణమికి.. ఆరెగొందిలీల జీవన విధానం ఇప్పటికీ సంచార స్వభావానిదే. సంవత్సరంలో ఎక్కువ కాలం వివిధ ప్రాంతాల్లో గడిపే వీరు ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్వగ్రామమైన ఎక్మాయికి చేరుకుంటారు. తమ కులదైవమైన తుల్జాభవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ఎక్కడ నివసించినా తమ మూలాలను మరువకుండా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే సంచార జీవనం కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. శాశ్వత నివాసం, గుర్తింపు పత్రాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించాలని కోరుతున్నారు. స్థిరపడిన ప్రాంతంలోనే ఓటర్లుగా నమోదు భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకుంటున్నారు. స్థిర నివాసం లేకపోవడంతో కొందరు స్వగ్రామంలో ఓటర్లుగా కొనసాగలేకపోతున్నారు. ఎక్మాయి కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 3 వేల కుటుంబాలకు చెందిన సుమారు 11 వేల మంది ఆరెగొందిలీలు జీవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంప్రదాయ వృత్తి క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక గుర్తింపు కలి్పంచి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, గృహాలు, విద్య, సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
డీకే శివకుమార్‌కు చెంబు, సీఎం సిద్దరామయ్య.. పువ్వు
కర్ణాటక: డీసీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారా?, సీఎం సిద్దరామయ్య పదవిని కాపాడుకుంటారా అనేదానిపై మండ్య నగర బీజేపీ నాయకులు ఆదివారం చిలుక జోస్యం చెప్పించారు. అలా కాంగ్రెస్ సర్కారు పరిణామాలను ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ పేరు చెప్పినప్పుడు చిలుక తీసిన చీటీలో చెంబు బొమ్మ వచ్చింది. సిద్దరామయ్య పేరు చెప్పినప్పుడు తీసిన చీటీలో బంతిపూవు వచ్చింది, ఇవి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీని అర్థం ఏమిటా అని తలోరకంగా మాట్లాడుకున్నారు. శివకుమార్ సీఎం అయితే రాష్ట్ర ప్రజలకు చెంబు గతి పడుతుందని, సిద్దరామయ్య ప్రజల చెవిలో పువ్వులు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కూర్చుని కాపాడుకోడానికి ఒకరు, దానిని లాక్కోవడానికి మరొకరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో 2,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదని అన్నారు. -
చిలుకా చెప్పవా.. మా బతుకు జోస్యం!
సాక్షి, వికారాబాద్, బషీరాబాద్ : చిలుక జోస్యం చెప్పించుకోవడానికి ఒకప్పుడు వారి ముందు జనం చేయిచాపేవారు. ఇప్పుడు వారే చేయిచాపాల్సిన దుస్థితి నెలకొంది. కాలం తెచ్చిన మార్పులకు వారి బతుకులు చితికిపోయాయి. చిలుక జోస్యమే వృత్తిగా బతుకుబండిని నడిపిస్తున్న ఆరె గొందిలీల సంచార జీవితాలు దుర్భరంగా మారాయి. గతంలో గుంపులుగా వచ్చి చిలుక జోస్యం చెప్పించుకునేవారు. నేడు రోజంతా కూర్చున్నా చేయిచాపి జాతకం చెప్పించుకునేవారే కరువయ్యారు. ఆదాయం లేక పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో కొంతమంది వృత్తిని వదులుకోగా..మరికొందరు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని వదులుకోలేక జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జనాభా కలిగిన ఆరె గొందిలీల(బుడబుడకల) జీవన విధానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. మహారాష్ట్ర నుంచి మూడు శతాబ్దాల కిందట వలస వచ్చిన ఆరె గొందిలీలు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయిలో స్థిరపడ్డారు. ఇక్కడ సుమారు 350 కుటుంబాలుండగా క్రమేపి బతుకుదెరువు కోసం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌తోపాటు ఆంధ్రాలోని కడప, కర్నూలు జిల్లాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను ఎంచుకొని చిలుక జోస్యం చెబుతూ జీవనం సాగిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల కాలంలో జనం చిలుక జోస్యాలను ఆదరించడంలేదు. తద్వారా ఆ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వందల కుటుంబాలకు జీవనాధారం లేకుండాపోయింది. దీంతో నేటితరం యువకులు పట్టణాల్లో ఆటోలు నడుపుతూ, మహిళలు స్టీలు సామాన్లు, బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆరెగొందిలీల చారిత్రక నేపథ్యం.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో ఆరెగొందిలీలు కీలకంగా ఉండేవారని ప్రాచుర్యంలో ఉన్న గాధను బట్టి తెలుస్తోంది. తన సామ్రాజ్యంలోని ప్రజలు పాలనపై ఏమనుకుంటున్నారో కనుక్కొని రావాలని ఆరెగొందిలీలను చక్రవర్తి ఆదేశించగా ఆరెగొందీలు మారువేషాల్లో కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లారు. వారిలో కొంతమంది తిరిగి మహారాష్ట్రకు వెళ్లగా మరికొంత మంది ఇక్కడే ఉండిపోయారు. ఇలా స్థిరపడినవాళ్లే నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి, మొహర్రం నాడు ప్రతి కుటుంబం ఎక్మాయి గ్రామానికి వచ్చి పండుగ చేసుకుంటుంది. తర్వాత మళ్లీ ఆయా జిల్లాలకు వెళ్తుంటాయి. అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు... గొందిలీ కుటుంబాలు రాష్ట్రంలో రెండు వేల నుంచి మూడు వేల వరకు పెరిగాయి. వీరిలో సూర్యాపేట జిల్లాలో నివాసముంటున్న గొందిలీలు నిరాదరణకు గురైన తమను బీసీ ‘ఏ’ లో చేర్చాలని కోర్టు ద్వారా ప్రభుత్వంతో కొట్లాడారు. దీంతో సుమారు 500 కుటుంబాలను ప్రభుత్వం బీసీ‘ఏ’ జాబితాలో చేర్చింది. మిగతా జిల్లాల్లోని వారికి మాత్రం అధికారులు బీసీ ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంలేదు. దీంతో వందల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయి. బతుకు కష్టమైంది మాది ఎక్మాయి. 60 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జాతకాలు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. నాలుగైదేళ్లుగా చిలుక జోస్యం చెప్పించుకునేవారు కరువయ్యారు. బతకడం కష్టంగా మారింది. – వకోరి శంకర్రావు, చిలక జ్యోతిష్యుడు, తాండూరు పిల్లలను చదివించలేకపోతున్నం మమ్మల్నీ బీసీ ‘ఏ’జాబితాలో చేర్చాలని చాలారోజుల నుంచి డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడంలేదు. దీంతో మా పిల్లలను చదివించుకోలేకపోతున్నం. సీఎం స్పందించి న్యాయం చేస్తారని నమ్ముతున్నం. – ఇగ్వే శ్రీనివాస్, సిద్దిపేట బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చాలి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది జనాభా ఉన్నం. మహారాష్ట్రలో బీసీ ఏ గ్రూపులో చేర్చింది. ఇక్కడి ప్రభుత్వం మా గొందిలీలను బీసీ ‘ఏ’గ్రూపులో చేర్చాలి. అందరికీ తహసీల్దార్ కార్యాలయాల నుంచి కులం సర్టిఫికెట్లు జారీ చేయాలి. – భౌరి మోహన్, గొందిలీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
చిలకమ్మా.. మా ‘రాత’ చూడమ్మా!
పూర్వం చిలుక జోస్యంపై అందరికీ ఆసక్తి ఉండేది. చిలుక జోస్యం చెప్పేవారు ఆ వీధిలోకి వచ్చారంటే ఇంట్లో ఉన్నవారంతా వారివారి భవిష్యత్తు తెలుసుకుని సంబరపడిపోయేవారు. నేటి కంప్యూటర్ కాలంలో ఎవరికీ వాటిపై పెద్దగా నమ్మకాలు లేకపోయినప్పటికీ.. మదిలో ఏదో ఒక మూల కొద్దిగా ఆశ కొట్టుమిట్లాడుతోంది. చిలుక జోస్యం నిజంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటికీ అక్కడక్కడ ప్రజలు చిలుక చెప్పింది నమ్మేస్తున్నారు. వివిధ పరీక్షల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గురువారం అనంతపురంలోని ఖాజానగర్‌లో గౌరి థియేటర్ కాంప్లెక్స్ వద్ద చిలుక జోస్యం చెప్పించుకునేందుకు ఉత్సాహం చూపారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


