సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సీఎం సీటుపై కర్ణాటక రాజకీయాల్లో చర్చ జోరందుకోగా.. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే నినాదంపై మరోమారు దుమారం రేగింది. బెళగావిలో జరిగే శాసనసభా సమావేశాల్లో ఎమ్మెల్యే రాజుకాగెతో పాటు, ఉత్తర కర్ణాటకకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించాలని నిర్ణయించినట్లు ఉత్తర కర్ణాటక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి నాగేశ్ గోలశెట్టి చెప్పడంతో మళ్లీ చర్చ మొదలైంది.
బెళగావిలో నాగేశ్ గోలశెట్టి విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె లేఖ రాసినట్టు చెప్పారు. ఇప్పటికే ఉత్తర కర్ణాటకకు చెందిన 1,48,91,346 మంది ప్రత్యేక రాష్ట్రం కోసం మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. డిసెంబర్ 8న బెళగావిలో 26 మంది ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి డిసెంబర్ 11 నుంచి జరిగే శీతాకాల శాసనసభా సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రంపై గొంతు వినిపిస్తామని చెప్పారు.
రాజుకాగె పోరాటానికి బెళగావి, విజయపుర, బాగలకోట, ధారవాడ, గదగ, ఉత్తర కన్నడలోని 15 జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సిద్దు సవది, విజయానంద కాశప్పనవర, బసనగౌడ పాటిల్‌యత్నాల్, శరణు సలగర, శరణ ప్రకాశ పాటిల్, వినయ కులకర్ణి, అరవింద బెల్లద, జనార్దన్‌రెడ్డి, నారా భరత్‌రెడ్డి, నిఖిల్‌కత్తి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉత్తర కర్ణాటక ప్రజలు తమ డిమాండ్లు సాధించుకోవాలంటే తెలంగాణ తరహా పోరాటం చేసేందుకు సిద్ధమవ్వాలని నాగేశ్ గోలశెట్టి తెలిపారు.
డీకే వర్గం కొత్త డిమాండ్..
మరోవైపు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని, రహస్య ఓటింగ్ కూడా నిర్వహించాలని కూడా కోరుతున్నారు. ఈ మేరకు వారంతా ఢిల్లీ యాత్ర చేపట్టారు. అధిష్టానం పెద్దల వద్దకు వెళ్లి ఈ మేరకు తమ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. బెంగళూరులోని కొందరు ఎమ్మెల్యేలు డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇళ్లకు క్యూలు కడుతున్నారు. ఇద్దరితో మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్ మాత్రం ఎవరి మాట వినేందుకు సిద్ధంగా లేన్నట్లు సమాచారం.
2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొందరు నేతల ద్వారా డీకే శివకుమార్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అందుకు కూడా ఆయన అంగీకరించలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో హైకమాండ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డీకే శివకుమార్ తేల్చిచెప్పారని తెలుస్తోంది. రెండున్నరేళ్ల వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, తాను ఉప ముఖ్యమంత్రిగా.. లోక్‌సభ ఎన్నికల వరకు కేపీసీపీ అధ్యక్షుడిగా కొనసాగాలని హైకమాండ్ నిర్దేశించిందని డీకే శివకుమార్ గుర్తు చేసినట్టు సమాచారం. ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని, తనను ముఖ్యమంత్రి చేయాలని డీకే కోరుతున్నట్టు తెలుస్తోంది.


