ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిస్ సూర్యకాంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ సూర్యకాంత్.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ బృందం హాజరైంది. ఫిబ్రవరి 9, 2027 వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్న సూర్యకాంత్. ఆర్టికల్ 370 రద్దు, బీహార్ ఎస్‌ఐఆర్ తదితర కేసుల్లో తీర్పు ఇచ్చారు.

సాధారణ లాయర్ నుంచి...
అక్టోబర్ 30వ తేదీన సీజేఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ సుమారు 15 నెలలపాటు బాధ్యతల్లో కొనసాగుతారు. 65వ ఏట ప్రవేశించనున్న జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9వ తేదీన రిటైరవుతారు. హరియాణాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10వ తేదీన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కురుక్షేత్ర వర్సిటీ నుంచి ఎంఏ లాలో డిస్టింక్షన్ సాధించారు. అనంతరం జస్టిస్ కాంత్ చిన్న పట్టణంలో లాయర్‌గా ప్రస్థానం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. అంతకుముందు, ఆయన పంజాబ్ హరియాణా హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల్లో పనిచేశారు.
సీజేఐల గురించి ఐదు విశేషాలు!
భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 52 మంది ప్రధాన న్యాయమూర్తులు ఈ దేశ న్యాయవ్యవస్థ కాపు కాసినవారే. అయితే మనలో చాలామందికి గత సీజేఐల విశేషాలు తెలిసింది తక్కువే. మహిళ న్యాయమూర్తి ఇప్పటివరకూ ఈ అత్యున్నత పదవిని చేపట్టకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఇది 62 ఏళ్లు మాత్రమే. సుప్రీంకోర్టు సీజేఐకి మాస్టర్ ఆఫ్ ద రోస్టర్‌గా పేరు. ఏ న్యాయమూర్తి ఏ రకమైన కేసుల విచారణ చేపడతారన్న విషయంపై సీజేఐదే తుది నిర్ణయం. అధికారిక హోదాల ప్రకారం... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతుల తరువాతి స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులది. ఇలాంటివే మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి.
1. జస్టిస్ హరిలాల్ జెకిసన్‌దాస్ కానియా
దేశ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటు తరువాత నియమితులయ్యారు.
2. జస్టిస్ కె.జి.బాలక్రిష్ణన్
తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. 2007-2010 మధ్యకాలంలో పనిచేశారు.
3. జస్టిస్ బి.ఆర్.గవాయి
52వ ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది మేలో నియమితులయ్యారు. బౌద్ధ మతాన్ని అనుసరించిన తొలి సీజేఐ. ఈ అత్యున్నత పదవిని అధిష్టించిన రెండో దళితుడు కూడా.
4.జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్
1978 - 19875 మధ్య దేశ అత్యున్నత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏడేళ్లకాలం ఈ పదవిలో ఉన్న తొలి జస్టిస్.
5. జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్
1991లో కేవలం పదిహేడు రోజులు మాత్రమే సీజేఐగా పనిచేశారు. అతితక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా ఇదో రికార్డు.



